Pravasa News: ప్రముఖ కూచిపూడి కళాకారిణి గురు స్వాతి అట్లూరి తమ స్వఛ్ఛంద సంస్థ ‘కళావేదిక’ ఆధ్వర్యంలో.. స్వర్గీయ ఎస్.పి బాల సుబ్రహ్మణ్యం కు శ్రద్ధాంజలి అర్పిస్తూ.. ‘‘బాలు స్వరఝరి’’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల సుబ్రహ్మణ్యం జీవన ప్రయాణం, పాటలు, మాటలు, సినిమాల వంటి అంశాలపై అద్భుతమైన ప్రదర్శనలు చేశారు. కాగా, బాల సుబ్రహ్మణ్యం ఆశయాలను నెరవేర్చే ప్రయత్నం చేస్తూ.. వారి స్ఫూర్తితో, వారు చేపట్టిన ఎన్నో మంచి కార్యక్రమాలను కొనసాగించి, ముందుకు తీసుకువెళ్ళాలనే సదుద్దేశంతో స్థాపించబడిన ఈ సంస్థ నిర్వహించిన తొలి కార్యక్రమం ఇది. న్యూజెర్సీలోని శివ, విష్ణు టెంపుల్ వారి ఈవెంట్ హాల్‌లో జరిగిన ఈ స్వరాంజలి కార్యక్రమంలో ప్రముఖ గాయనీ గాయకులైన ఉష, సుమంగళి, శ్రీకాంత్ సండుగు పాల్గొన్నారు.
సెయింట్ లూయీస్ కు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత వింజమూరి సాహిత్య ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కళావేదిక సంస్థ ఎడ్వైజర్ కమిటీలో ఒకరైన ఫణి డొక్కా అట్లాంటా నుంచి ఈ కార్యక్రమానికి వచ్చి, సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా బాల సుబ్రహ్మణ్యంతో తన అనుభవాలను ఆయన పంచుకున్నారు. ఉజ్వల్ కష్థల అన్నీ తానై ఈ కార్యక్రమం ఆద్యంతం సజావుగా సాగేందుకు దోహదపడ్డారు.
ఇక ఈ కార్యక్రమంలో బాల సుబ్రహ్మణ్యం పాడిన కొన్ని మధుర గీతాలను ఉష, సుమంగళి, శ్రీకాంత్ పాడారు. తమ మధురమైన గాత్రంతో బాల సుబ్రహ్మణ్యం పాటలు పాడి.. కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులను అలరించారు. మధ్యలో మెరుపులా మెరుస్తూ తన చక్కని వ్యాఖ్యానంతో, సమయస్ఫూర్తితో కార్యక్రమం ఆద్యంతం చక్కగా నడిపించారు సాహిత్య. ఇక బాల సుబ్రహ్మణ్యం తనను ఆశీర్వదించిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ ఒకటి రెండు వీడియో క్లిపింగ్స్‌ను పంచుకున్నారు గాయని ఉష.
ఇక సంస్థ అధ్యక్షురాలు స్వాతి మాట్లాడుతూ.. తమ సంస్థ ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని వెల్లడించారు. తాము చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు.. సంస్థ లక్ష్యాలు, ఉద్దేశ్యాలకు ఆకర్షితులై అప్పటికప్పుడు భారీగా విరాళాలు అందజేశారు. ఈ క్రమానికి వచ్చిన వారికి అన్నపూర్ణ సంస్థ నిర్వాహకులు శేఖర్, మాధవి వెంపరాల దంపతులు భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమం దిగ్విజయమవ్వడానికి కారణమైన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు స్వాతి అట్లూరి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపేంద్ర చివుకుల (కమిషనర్ న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్), స్టెరిలీ.ఎస్.స్టాన్లీ (అసెంబ్లీ మేన్), శాంతి నర్రా (మిడిల్ సెక్స్ కౌంటీ కమిషనర్ డిప్యూటీ డైరెక్టర్), శాం జోషి (ఎడిసన్ టౌన్షిప్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్) హాజరయ్యారు. తానా, ఆటా, నాట్స్, టాటా, టి.ఎల్.సి.ఏ, టి.ఎఫ్.ఏ.ఎస్, ఎన్.ఆర్.ఐ.వి.ఏ, సిలికాన్ ఆంధ్రా, సాయి దత్త పీఠం శివ విష్ణు టెంపుల్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిథులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also read:
RRR: ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే…
Samantha- Naga Chaitanya Divorce: సమంత -నాగచైతన్య విడాకుల పై వర్మ రియాక్షన్.. అంతమాట అనేశాడేంటి..!!