ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆ దేశ పోలీసులు ఓ భారతీయుణ్ణి కాల్చి చంపారు. తమిళనాడుకు చెందిన 32ఏళ్ల మహ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్‌గా ఆయన్ను గుర్తించారు. సిడ్నీ రైల్వే స్టేషన్‌లో ఓ క్లీనర్‌ను కత్తితో దాడి చేసి, పోలీసులను బెదిరించడంతో అతనిని కాల్చిచంపినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా స్పందించింది. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని విచారం వ్యక్తం చేసింది. విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగంతోపాటు పోలీసు అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని తెలిపింది. న్యూ సౌత్ వేల్స్ కార్యాలయం, రాష్ట్ర పోలీసు అధికారులతో ఈ విషయం గురించి మాట్లాడుతున్నట్లు పేర్కొంది.
బోర్డింగ్ వీసాపై ఆస్ట్రేలియాలో ఉంటున్న అహ్మద్.. సిడ్నీ రైల్వే స్టేషన్‌లో క్లీనర్(28)ను కత్తితో పొడిచాడు. ఆ తర్వాత సిడ్నీలోని ఆబర్న్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరు పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. ఆపై దాడికి యత్నించాడు. దీంతో పోలీస్ అధికారి అహ్మద్‌పై మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అందులో రెండు అహ్మద్ ఛాతీలోకి దూసుకెళ్లాయి. దీంతో వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్టు పోలీసులు ప్రకటించారు.
అధికారులు స్పందించడానికి కొన్ని సెకన్ల సమయం ఉందని.. అహ్మద్‌ను కాల్చడం తప్ప వేరే మార్గం లేకుండా పోయిందని న్యూ సౌత్ వేల్స్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ స్టువర్ట్ స్మిత్ మీడియా సమావేశంలో తెలిపారు.
మహ్మద్ రహమతుల్లా దాడిలో గాయపడిన క్లీనర్‌ను స్థానిక ఆసుపత్రిలో చేర్చామని.. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..