ఇటీవల అమెరికా-కెనడా సరిహద్దు (US-Canada border)లో మైనస్ డిగ్రీల వాతావరణంలో చిక్కుకుపోయి గుజరాత్ కు చెందిన ఓ కుటుంబం (Gujarat Family) మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మైనస్ 35 డిగ్రీల అతిశీతల పరిస్థితుల్లో కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన నలుగురు మంచులో గడ్డకట్టుకు పోయి మృత్యువాత పడ్డారు. వీరంతా గుజరాత్‌కు చెందిన వారు కాగా.. వీరి మృతదేహాలను జనవరి 19న అక్కడి అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో జగదీష్ పటేల్, అతని భార్య వైశాలి పటేల్, వారి పిల్లలు గోపి, ధార్మిక్‌లు మంచు తుఫాను ధాటికి ప్రాణాలు విడిచినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. కాగా వీరంతా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని కలోల్ తాలూకాలోని దింగుచా (Dingucha) గ్రామానికి చెందినవారు. కాగా ఈ దారుణ సంఘటన తర్వాత యూఎస్, కెనడాకు కుటుంబాలను పంపే స్థానిక ఏజెంట్లపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
‘డాలర్ డ్రీమ్స్’ లో పడి..
కాగా దింగుచా గ్రామానికి చెందిన పలువురు ఇప్పటికే కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు వలస పోయి స్థిరపడ్డారు. వారు అక్కడి నుంచే పంచాయితీ భవనం, పాఠశాల, దేవాలయం, ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు ఉదారంగా విరాళాలు పంపుతున్నారట. వీరిని చూసి దింగుచా గ్రామ యువతలో ‘అమెరికన్ డ్రీమ్స్’ ఆలోచన బలంగా పాతుకుపోయింది. ఎలాగైనా అక్కడకు వెళ్లి స్థిరపడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు అక్రమ మార్గంలో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. స్థానిక ఏజెంట్లను నమ్మి ప్రాణాలు కోల్పోతున్నారని తెలుస్తోంది. ఈ ఘటన తరువాత గుజరాత్ పోలీసులు ఓ స్థానిక ఏజెంట్‌ను పట్టుకున్నారు. జనవరి మొదటి వారంలో జగదీష్ పటేల్ కుటుంబ సభ్యులను కెనడాకు పంపినట్లు ఆ ఏజెంట్ పోలీసులకు వెల్లడించాడు. ఈ క్రమంలోనే తమ అక్రమ కార్యకలాపాలన్నింటినీ బహిర్గతం చేసినట్లు తెలుస్తోంది.
అవే హోర్డింగ్ లు, పోస్టర్లు..
2011 జనాభా లెక్కల దింగుచా గ్రామంలో దాదాపు 3,300 జనాభా ఉంది. వీరిలో ఎక్కువ మంది పాటిదార్ కమ్యూనిటీకి చెందినవారు. సుమారుగా 5ం శాతం పాటిదార్ కుటుంబాలకు యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియాలో బంధువులు ఉన్నారు. వారిని చూసి గ్రామంలోని చాలామంది మెరుగైన జీవనం కోసం విదేశాలకు వెళుతున్నారు. ఈక్రమంలోనే కెనడా, అమెరికా, ఆస్ట్రేలియాలకు వెళ్లేవారి కోసం కొందరు ఏజెంట్లు బహిరంగంగానే తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా వీరి పోస్టర్లు, హోర్డింగ్ లు కనిపిస్తుండడం విశేషం. కాగా జగదీశ్ ఫ్యామిలీ మృత్యువాత పడిన తర్వాత గుజరాత్ పోలీసులు ట్రావెల్ ఏజెంట్లపై దృష్టి సారించారు. ఈక్రమంలో స్థానిక ఏజెంట్లు గత మూడేళ్లలో 10 కుటుంబాలను అమెరికాకు అక్రమంగా తరలించినట్లు తెలిసింది. అంతేకాదు ఈ 10 కుటుంబాల్లో మూడు కుటుంబాలు అదృశ్యమైనట్లు తెలిసింది.
Also Read: Janhvi Kapoor: జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఈసారైనా పక్కానేనా.?