చర్చికి వచ్చిన ప్రజలపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడిన ఘటన జర్మనీలోని హంబర్గ్ నగరంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అనేక మంది చనిపోగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. చర్చీలో కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానికులను అప్రమత్తం చేశారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. కాల్పులకు పాల్పడిన దుండగుడు కూడా తనను తాను కాల్చుకుని మరణించినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.
వారంవారం నిర్వహించే బైబిల్ పఠనం కార్యక్రమంలో భాగంగా పలువురు డీల్‌బోజ్ వీధిలోగల మూడంతస్తుల చర్చి భవనంలోకి వచ్చారు. అదే సమయంలో ఈ ఘటన జరిగింది. దుండగుడు భవనం నుంచి బయటికి పారిపోయినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు లేవని, కాబట్టి కాల్పుల అనంతరం దుండుగుడు తనను కాల్చుకుని మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, 12 సార్లు కాల్పుల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని పోలీసు అధికార ప్రతినిధి హోల్గర్ వెహ్రెన్ తెలిపారు.
Germany: 6 people killed in a shooting attack in Hamburg
Read @ANI Story | https://t.co/mbRet7g7kf#Germany #HamburgPolice #shootingattack pic.twitter.com/pM5jzXFZmM
— ANI Digital (@ani_digital) March 9, 2023
ఈ కాల్పులపై నగర మేయర్ పీటర్ షెంచర్ ట్విట్టర్‌లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎమర్జెన్సీ సర్వీసెస్ కృషి చేస్తున్నాయని చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..