AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జర్మనీలో జెన్‌ జెడ్ విధ్వంసకాండ.. దుకాణాల లూటీ.. పోలీసులపై దాడులు.. 27 మందికి గాయాలు!

యూరప్‌లో యువత నేతృత్వంలో కొనసాగుతున్న నిరసనలు ఇప్పుడు జర్మనీని కూడా కుదిపేస్తున్నాయి. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయం, విద్యా రంగంలో నిధుల కొరత, ప్రభుత్వ ఖర్చుల కోతలు, తప్పనిసరి సైనిక సేవకు వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళనలు పలు నగరాల్లో హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా జర్మనీ ఆర్థిక కేంద్రం ఫ్రాంక్‌ఫర్ట్‌లో శనివారం (అక్టోబర్ 31) అర్ధరాత్రి తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పలు దుకాణాల అద్దాలను ధ్వంసం చేసి, వస్తువులను దోచుకున్నారు. బెర్లిన్, కొలోన్, హాంబర్గ్ నగరాల్లోనూ నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

జర్మనీలో జెన్‌ జెడ్ విధ్వంసకాండ.. దుకాణాల లూటీ.. పోలీసులపై దాడులు.. 27 మందికి గాయాలు!
Gen Z Protests Turn Violent In Germany
Balaraju Goud
|

Updated on: Nov 01, 2026 | 7:43 PM

Share

జర్మనీ: యూరప్‌లో యువత నేతృత్వంలో కొనసాగుతున్న నిరసనలు ఇప్పుడు జర్మనీని కూడా కుదిపేస్తున్నాయి. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయం, విద్యా రంగంలో నిధుల కొరత, ప్రభుత్వ ఖర్చుల కోతలు, తప్పనిసరి సైనిక సేవకు వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళనలు పలు నగరాల్లో హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా జర్మనీ ఆర్థిక కేంద్రం ఫ్రాంక్‌ఫర్ట్‌లో శనివారం (అక్టోబర్ 31) అర్ధరాత్రి తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పలు దుకాణాల అద్దాలను ధ్వంసం చేసి, వస్తువులను దోచుకున్నారు. బెర్లిన్, కొలోన్, హాంబర్గ్ నగరాల్లోనూ నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

ఫ్రాంక్‌ఫర్ట్‌లో దుకాణాల ధ్వంసం.. పోలీసులపై దాడులు

ఫ్రాంక్‌ఫర్ట్‌లోని ప్రధాన షాపింగ్ వీధిలో అల్లర్లు చెలరేగడంతో పోలీసులు పలు ప్రాంతాలను మూసివేశారు. దుకాణాల అద్దాలు పగలగొట్టడంతో పాటు క్రీడా బూట్లు సహా పలు వస్తువులను నిరసనకారులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. అత్యవసర సేవల సిబ్బందిపై రాళ్లు, సీసాలు, బాణసంచా విసిరినట్లు తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో 27 మంది పోలీసు అధికారులు గాయపడగా, పలువురిని అరెస్టు చేశారు. ఒక ఆయుధాల దుకాణం అద్దాలు ధ్వంసం చేసిన ఘటనలో అనుమానితుడిని అదుపులోకి తీసుకుని రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

బెర్లిన్, హాంబర్గ్‌లోనూ ఉద్రిక్తతలు

బెర్లిన్‌లో భారీ నిరసనల అనంతరం జరిగిన ఘర్షణల్లో 27 మంది పోలీసు అధికారులు గాయపడ్డారు. 56 మందిని పోలీసులు తాత్కాలికంగా అదుపులోకి తీసుకున్నారు. హాంబర్గ్‌లో నల్ల దుస్తులు ధరించిన నిరసనకారులు బాణసంచా కాల్చడంతో పాటు బారికేడ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలకు సంబంధించి 120 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కొలోన్‌లో ప్రధాన రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులపై సీసాలు విసిరినట్లు అధికారులు తెలిపారు.

ఎందుకీ నిరసనలు?

‘జెన్ జెడ్ రెగెల్ట్’ (Gen Z Regelt) అనే ప్రచార బృందం ఆధ్వర్యంలో పగటిపూట జరిగిన నిరసనల్లో వేలాది మంది పాల్గొన్నారు. పాఠశాలలు, విద్యా వ్యవస్థకు మరిన్ని నిధులు కేటాయించాలని, పెరుగుతున్న జీవన వ్యయాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సేవలపై కోతలు విధించవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. తప్పనిసరి సైనిక సేవను కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆరోగ్య, విద్యా వ్యవస్థలకు మెరుగైన మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

ఫ్రాన్స్ సహా పలు దేశాల్లోనూ ఆందోళనలు

జర్మనీకి ముందు ఫ్రాన్స్‌లోనూ యువత నేతృత్వంలో భారీ నిరసనలు జరిగాయి. శనివారం జరిగిన ప్రదర్శనల్లో 3.20 లక్షల మందికి పైగా పాల్గొన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా 770 మందికి పైగా అరెస్టయ్యారు. ఇటలీలోని రోమ్, టురిన్ నగరాల్లోనూ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పోర్చుగల్‌లో గృహ సంక్షోభం, పెరుగుతున్న అద్దెలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. బెల్జియం, ఐర్లాండ్, స్పెయిన్, గ్రీస్, సెర్బియా, అల్బేనియా వంటి దేశాల్లోనూ యువత నిరసనలు కొనసాగుతున్నాయి.

జర్మన్ అంతర్గత వ్యవహారాల మంత్రి అలెగ్జాండర్ డోబ్రిండ్ట్ హింస, దోపిడీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిరసనల సందర్భంగా హింసకు పాల్పడటం సరికాదని జర్మన్ అధికారులు పేర్కొన్నారు. మొత్తంగా పెరుగుతున్న జీవన వ్యయం, నిరుద్యోగం, విద్య, గృహ వసతి, ప్రభుత్వ విధానాలపై యువతలో అసంతృప్తి యూరప్‌లో నిరసనల రూపంలో వ్యక్తమవుతోంది. శాంతియుతంగా ప్రారంభమైన ఆందోళనలు కొన్ని ప్రాంతాల్లో హింసాత్మకంగా మారడం యూరప్ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us