ఫండింగ్ కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను సోమవారం (ఫిబ్రవరి 20) అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇమ్రాన్ ఖాన్ తన ఫోన్ సంభాషణల ఆడియో లీక్‌లపై దర్యాప్తు కోరుతూ వేసిన పిటిషన్‌ను విచారించాలని ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించించారు. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలో ఆయనను అరెస్ట్ చేసేందుకు పాక్ ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. లాహోర్‌లోని ఇమ్రాన్ ఖాన్ తన పిటీషన్‌లో సుప్రీంకోర్టును ఈ విధంగా అభ్యర్ధించారు.. ‘నా అభ్యర్థనను కూడా వినవలసిందిగా సుప్రీంకోర్టును కోరుతున్నాను. నాకు, నా భార్య బుష్రా బీబీకి సంబంధించిన అనేక ఆడియో లీకేజీలపై నా పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని అభ్యర్ధిస్తున్నాను. మా ప్రాథమిక హక్కులను వారు ఉల్లంఘించారు. ఒక దేశ ప్రధానమంత్రి ఫోన్ సంభాషణలు లీక్ అయితే అది అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. తక్షణపై వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరుతున్నానంటూ’.. ఇమ్రాన్ ఖాన్ విన్నవించారు. కాగా పాక్ మాజీ ప్రధానికి సంబంధించిన పలు ఆడియోలు గత ఏడాది ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. దీంతో పీఎం హౌస్ ఆడియో లీక్‌లపై దర్యాప్తుకు జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (జేఐటీ) లేదా జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇమ్రాన్ అరెస్టు కోసం నలుగురు సభ్యుల బృందాన్ని ఎఫ్‌ఐఏ ఏర్పాటు చేసినట్లు సమాచారం. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇమ్రాన్ ఖాన్ నివాసం వద్ద పోలీసు బలగాలు మోహరించాయి. విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించి విదేశీ నిధులు పొందారనే ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్‌తో పాటు మరో పది మందిపై కేసు నమోదైంది. పార్టీ ఫండింగ్‌లో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నట్లు పార్టీ సభ్యులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.