అప్పుల కుప్పపై అమెరికా మాజీ అధ్యక్షుడు..? ట్రంప్‌ కంపెనీల నుంచి ఒక్కొక్కటిగా వైదొలుగుతున్న ఆర్థిక సంస్థలు

డోనాల్డ్‌ ట్రంప్‌.. మొన్నటి వరకు అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడు. ప్రపంచాన్ని శాసించిన నేత. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో..

  • K Sammaiah
  • Publish Date - 12:10 pm, Mon, 1 February 21
అప్పుల కుప్పపై అమెరికా మాజీ అధ్యక్షుడు..? ట్రంప్‌ కంపెనీల నుంచి ఒక్కొక్కటిగా వైదొలుగుతున్న ఆర్థిక సంస్థలు

డోనాల్డ్‌ ట్రంప్‌.. మొన్నటి వరకు అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడు. ప్రపంచాన్ని శాసించిన నేత. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్‌ చేతిలో అనూహ్యంగా ఓటమి చెందారు. చివరి వరకు ఓటమిని ఒప్పుకోక వివాదాస్పద నేతగా ముద్రపడ్డారు. అంతకంటే ముందు ట్రంప్‌ సక్సెస్‌ఫుల్‌ వ్యాపారస్థుడు. బిలియన్‌ డాలర్లకు అధిపతి. అయితే ఆయన ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ట్రంప్‌ దాదాపు వంద కోట్ల డాలర్ల (సుమారు 7,300 కోట్ల రూపాయలు) మేర అప్పుల్లో ఉన్నట్లు సమాచారం. క్యాపిటల్‌ హిల్‌పై దాడి అనంతరం ఆయనపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్థిక సంస్థల దృక్పథంలో వచ్చిన మార్పు కారణంగా రుణ విముక్తి అంత తేలిగ్గా జరగకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు బ్యాంకులు ట్రంప్‌ కంపెనీలతో సంబంధాలు తెంచుకున్నాయి.

తాజాగా మరికొన్ని బ్యాంకులు ట్రంప్‌తో వ్యాపారానికి గుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతున్నాయి. సిగ్నేచర్‌ బ్యాంకు సైతం ట్రంప్‌ కంపెనీల అకౌంట్లను క్లోజ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆయనకు బ్యాంకుల నుంచి రుణాలు పుట్టే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని నిపుణులంటున్నారు. ఆస్తులు అమ్మి గట్టెక్కాలని భావించినా, కుష్‌మన్‌ అండ్‌ వాక్‌ఫీల్డ్, జేఎల్‌ఎల్‌ లాంటి పలు బ్రోకరింగ్‌ దిగ్గజాలు సైతం ట్రంప్‌తో వ్యాపార బంధాలు తెంచుకున్నాయి. దీంతో ఆస్తుల అమ్మకాలు కూడా కష్టంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. పైగా ఆయన ఆస్తులు ఎక్కువ భాగం డెమొక్రాట్లు బలంగా ఉన్న రాష్ట్రా ల్లో ఉన్నాయి.

అయితే అమెరికా అధ్యక్షుడిగా పని చేయడం వల్ల వ్యాపార విస్తరణ అవకాశాలు పెరిగాయని, విదేశాల్లో పెట్టుబడులు, వ్యాపారాలు విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్రెజిల్, టర్కీ, ఫిలిప్పీన్స్, ఇండియాలాంటి, అరబ్‌ దేశాలతో ట్రంప్‌కు మంచి సంబంధాలు నెలకొన్నాయి. యూఏఈ, సౌదీల్లో ఆయన కంపెనీలకు మంచి గుర్తింపు లభిస్తుండటం కొంత ఉపశమనం కలిగించే అశంమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ వాణిజ్యంపై ట్రంప్‌ దృష్టి పెడితే రుణాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్‌కు అప్పులు కొత్తేమి కావని, గతంలోనూ అప్పుల్లోంచి ఈజీగా బయటపడ్డ సందర్భాలను గుర్తు చేస్తున్నారు.