
భూగోళాన్ని పైన మంచు దుప్పటి కప్పేస్తుంటే…కింద నుంచి నిప్పల కుంపటి వేడెక్కిస్తోంది. ప్రపంచానికి అటు ఇటు…రెండు విపరీత వాతావరణాలు చోటు చేసుకున్నాయి. ఉత్తరార్ధ గోళంలో…అమెరికా, రష్యాలను మంచు తుఫాన్లు ముంచెత్తుతున్నాయి. దక్షిణార్థ గోళంలోని ఆస్ట్రేలియాకు వేడిగాలుల సెగ తగులుతోంది. ఇక చిలీని కార్చిచ్చు కమ్మేస్తోంది.
ఉత్తరార్థ గోళంలోని అమెరికాను “ఫెర్న్” మంచు తుఫాన్ వణికిస్తోంది. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, బోస్టన్ వంటి ఈశాన్య నగరాలపై ఈ వింటర్ స్టార్మ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. టెక్సాస్, కాన్సాస్, ఓక్లహోమా రాష్ట్రాల్లో ఇప్పటికే మంచు బీభత్సం మొదలైంది. ప్రస్తుతం ఇది మెల్లగా తూర్పు వైపు కదులుతూ సౌత్-ఈస్ట్ రాష్ట్రాలను వణికిస్తోంది. సోమవారం నాటికి ఈ తుఫాను వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, బోస్టన్ నగరాలను తాకనుంది. మంచు తుఫాన్‌తో 8 నుంచి 16 అంగుళాల మేర భారీ హిమపాతం కురిసే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణ శాఖ.
దీంతో వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. జార్జియా, మిస్సిసిపితో పాటు 17 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించారు. అమెరికాలో సగం జనాభా అంటే 16కోట్లమందిపై ఈ తుఫాన్ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్ వెళ్లిన వెంటనే అమెరికాను ‘ఆర్కిటిక్ చలి’ వణికించనుంది. మంగళ, బుధవారాల్లో ఆర్కిటిక్ ధృవం నుంచి విరుచుకుపడే గాలులు, అగ్రరాజ్యాన్ని ఒక ‘డీప్ ఫ్రీజర్’లా మార్చేయబోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఊహకందని విధంగా మైనస్ 45 డిగ్రీలకు పడిపోతాయని అంచనా. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు జీరో కంటే తక్కువగానే నమోదవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక అదే ఉత్తరార్థ గోళంలో ఉన్న రష్యాను కూడా మంచు తుఫాన్లు వణికిస్తున్నాయి. తూర్పు రష్యాలోని కాంచట్కా ప్రాంతంలో రికార్డు స్థాయిలో భారీ హిమపాతం సంభవించింది. ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 6 అడుగుల మంచు కురిసిందంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కార్లు, నివాసాలు మంచులో కూరుకుపోయాయి. దీంతో ప్రజలు తమ కార్ల ఆచూకీ కోసం మంచులో తవ్వకాలు జరుపుతున్నారు. ఒక మంచు తుఫాన్ తర్వాత, మరో మంచు తుఫాన్ విరుచుకుపడి రష్యాను అతలాకుతలం చేస్తున్నాయి. మంచులో కూరుకుపోయి ఇద్దరు మరణించారు.
ఇక దక్షిణార్థ గోళంలో ఉన్న ఆస్ట్రేలియా.. అతి భారీ వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆ దేశంలో వాతావరణం రికార్డు స్థాయిలో వేడెక్కిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వేడికి ఆస్ట్రేలియాలో చెట్లుచేమలు తగలబడి, భారీస్థాయిలో కార్చిచ్చు మొదలైంది. ఈ వేడిమిని తట్టుకోలేక లక్షలాది మంది విలవిల్లాడుతున్నారు. వాతావరణంలో వేడి ఉక్కపోత భరించలేక బీచ్‌లకు పరుగులు తీస్తున్నారు ఆస్ట్రేలియన్లు. చల్లటి నీళ్లలో సేద తీరుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మంటలు వేయడంపై నిషేధం విధించారు
ఇక అదే దక్షిణార్థ గోళంలో ఉన్న చిలీ.. కార్చిచ్చు సెగతో కకావికలమవుతోంది. దక్షిణ మధ్య చిలీలోని బియోబియో, ఉబ్లె ప్రాంతాల్లోని అడవుల్లో మొదలైన మంటలు.. దావానలంలా మారి దేశం మొత్తం వ్యాపించాయి. వందలాది ఇళ్లు దగ్ధమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కార్చిచ్చు కొనసాగుతోంది. 40వేల హెక్టార్ల ప్రాంతం దగ్ధమైనట్లు అధికారులు వెల్లడించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..