Israel: ఇరాన్ అణుస్థావరాలు, ఆ దేశ సుప్రీం లీడర్ టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య భీకర యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు ఇరాన్‌లోని అణుస్థావరాలతో పాటు ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీ ఇంటిపైనా ఇజ్రాయెల్ గురిపెట్టింది. ఇరాన్ అధినేత నివాస సమీపంలోనూ వైమానిక దాడులు జరిగాయంటున్నారు. టెహ్రాన్‌లోని మోనిరియాలో ఖొమైనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉంది.

ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో గురువారం అర్ధరాత్రి నుంచి ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఇరాన్ అణు, సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులే లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో టెహ్రాన్ ఆర్మీచీఫ్‌తో పాటు కీలకమైన మిలటరీ అధికారులను, అణుశాస్ర్తవేత్తలను ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ దాడుల్లో 79 మంది ఇరాన్ పౌరులు మృతి చెందగా.. 330 మంది గాయపడ్డారు.
తమ నట్టింట్లో ఇజ్రాయెల్ రహస్య స్థావరం ఏర్పాటుచేసుకుని కోవర్ట్ ఆపరేషన్‌కు దిగటంతో డ్రోన్లు, క్షిపణలతో ఇరాన్ విరుచుకుపడింది. టెల్‌అవీవ్, జెరూసలెం నగరాలవైపు ఇరాన్ క్షిపణులు దూసుకొచ్చాయి. దేశంలో ఎమర్జన్సీ ప్రకటించిన ఇజ్రాయెల్.. ఇరాన్ దాడులను తిప్పికొడుతోంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల్లో కనీసం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పదులసంఖ్యలో గాయపడ్డారు. క్షిపణి దాడుల్లో భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాలు తమ ఉనికికి ముప్పుగా పరిణమించాయంటోంది ఇజ్రాయెల్. గతంలో ఇరాన్, దాని మిత్రదేశాలు తమపై దాడికి ప్రయత్నించాయంటున్నారు నెతన్యాహు. తమ పోరాటం ఇరాన్ నియంతృత్వ పాలనేపైనే గానీ.. ప్రజలపై కాదంటున్నారు. ఇరాన్‌పై ఆపరేషన్‌కి పోయినేడాది నవంబరులోనే అనుమతించానని చెబుతున్నారు. కొన్ని వ్యూహాత్మక కారణాలతో అప్పట్లో అది వాయిదాపడింది. ఇప్పుడు ఆపరేషన్ మొదలైదంటోంది ఇజ్రాయెల్.
ఇప్పటికైనా ఇరాన్ దిగిరావాలంటోంది అమెరికా. దేశం పూర్తిగా నాశనం కావడానికి ముందే అణుఒప్పందానికి చొరవచూపాలని హెచ్చరిస్తోంది. కానీ ఇంతదూరమొచ్చాక ట్రంప్ ప్రతిపాదన అర్ధరహితమంటోంది ఇరాన్. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. తక్షణం కాల్పుల విరమణ పాటించాలని రెండుదేశాలకు పిలుపునిచ్చాయి.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని రష్యా తీవ్రంగా ఖండించింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి ఏమాత్రం సమర్ధనీయం కాదని పాకిస్తాన్ స్పందించింది. స్వీయ రక్షణకు చర్యలు చేపట్టే అధికారం ఇరాన్‌కు ఉందని స్పష్టం చేసింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని సౌదీఅరేబియా తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసియాలో పరిస్థితిపై భారత్ ఆందోళన వ్యక్తంచేసింది.
ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య శత్రుత్వం ఈనాటిది కాదు. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ఇరాన్ ప్రధాన శత్రువులుగా గుర్తించింది. ఇరాన్ అణ్వాయుధాలను ఉత్పత్తి చేస్తోందని ఇజ్రాయెల్ ఎప్పట్నించో ఆరోపిస్తోంది. అలాంటిదేమీ లేదంటూనే.. అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియం నిల్వలను పెంచుకుంటోంది ఇరాన్. దీంతో ఆ దేశం నుంచి ఎప్పటికైనా ముప్పు తప్పదనుకున్న ఇజ్రాయెల్.. ముందే అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..