భారత సంతతికి చెందిన మన్‌దీప్ సింగ్ అనే వైద్యుడు కడుపులో ఉన్న పిండానికి అరుదైన చికిత్స చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇలాంటి చికిత్స చేసిన తొలి భారతీయ సంతతి వైద్యుడిగా ఆయన గుర్తింపు దక్కించుకున్నారు. ముంబై మూలాలున్న ప్రముఖ వైద్య నిపుణులు మన్‌దీప్ సింగ్ అబుదాబిలోని ఒక ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సమయంలోనే తాజాగా కొలాంబియాకు చెందిన ఓ మహిళ గర్భంలో ఉన్న శిశువుకు వెన్నెముక సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే అరుదైన శస్త్రచికిత్స చేయించాల్సి ఉంటుంది.
ఇందులో భాగంగానే అబుదాబిలోని క్రైపస్ నికోలియాడిన్ ఫెటల్ మెడిసిన్, థెరపీ సెంటర్‌ను ఆశ్రయించారు. మన్‌దీప్ సింగ్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం విజయవంతంగా శస్ర్తచికిత్సను పూర్తి చేసి సమస్యను పరిష్కరించారు. 24 వారాల గర్భస్త శిశువుకు ఉన్న వెన్నెముక లోపాన్ని సవరించారు. గర్భంలోని శిశువుకు వచ్చిన సమస్యను స్పైనా బిఫిడాగా పిలుస్తుంటారు. ఇది పుట్టుకతో వచ్చే లోపం. దీనివల్ల పుట్టిన బిడ్డకు శాశ్వత వైకల్యం ఏర్పడుతుంది. అయితే శిశువు భూమిపైకి వచ్చేకంటే ముందే ఈ శస్త్రచికిత్సను చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అరుదైన చికిత్స ప్రపంచంలో చాలా అరుదుగా జరుగుతుంటుంది. 19 నుంచి 25 వారాల మధ్యే ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రపంచంలో వెయ్యి మంది జన్మిస్తే వారిలో కేవలం ఒకరికి మాత్రమే ఇలాంటి సమస్య ఉంటుంది.
శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా డాక్టర్ మన్‌దీప్ సింగ్ మాట్లాడుతూ.. గర్భాశయంపై చిన్న కోత పెట్టి ఈ చికిత్సను నిర్వహించారు. శిశుడు గర్భంలో ఉన్న సమయంలోనే ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. ఇందుకోసం మేము సింథటిక్ ప్యాచ్‌ను ఉపయోగించాము. అమ్మియోటిక్ అనే ద్రవాన్ని కుహరంలోకి పంపించడం ద్వారా శస్త్రచికిత్స అనంతరం గర్భాశయాన్ని తిరిగి మూసివేస్తాము’ అని చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం తల్లి, శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందన్న డాక్టర్.. ఆగస్టులో మహిళ బిడ్డకు జన్మనిస్తుందని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి శస్ర్త చికిత్సలు నిర్వహించే కేంద్రాలు కేవలం 14 మాత్రమే ఉన్నాయి. ఆసియా, దక్షిణ అమెరికా నుంచి జంటలు యూరప్‌తో పాటు, ఉత్తర అమెరికాకు ఇలాంటి శస్త్రచికిత్సల కోసం వెళ్తుంటారు. ఈ విధానం చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇక మహిళ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ’20 వారాల స్కాన్‌లో కడుపులోని శిశువు వెన్నుముక సరిగా లేదని గుర్తించారు. గర్భాన్ని తొలగిస్తే మంచిదనే సలహాలు ఇచ్చారు. అయితే మేము అందుకు ఒప్పుకోలేదు. దేవుడు మాకిచ్చిన బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలనుకున్నాం. ఇందులో భాగంగానే స్పైనా బిఫిడాగా అనే విధానం ఉంటుందని వైద్యుల ద్వారా తెలుసుకున్నాం’ అని చెప్పుకొచ్చారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..