ఇండియాకు సపోర్ట్ చేసిన వాళ్లపై ఉగ్రవాద ముద్ర! పాకిస్థాన్‌కు ట్రంప్ కొత్త గిఫ్ట్..
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కోరిక మేరకు అమెరికా, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)ను ఉగ్రవాద సంస్థగా గుర్తించే అవకాశం ఉంది. పహల్గాం దాడి తరువాత భారతదేశానికి మద్దతు ఇచ్చిన బీఎల్ఏ, పాకిస్తాన్ సైన్యాని కి తీవ్ర ముప్పుగా ఉంది.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు డోనాల్డ్ ట్రంప్ మరో గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. జూన్‌లో అమెరికా అధ్యక్షుడితో మునీర్ ఒక ప్రైవేట్ విందుకు హాజరైనప్పటి నుండి పాకిస్తాన్ పట్ల అమెరికా వైఖరి మారిపోయింది. తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA)ని విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించబోతున్నట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మీ పాకిస్థాన్‌పై జరిగిప ఆపరేషన్ సిందూర్ సమయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇండియాకు మద్దతు ప్రకటించింది. అలాగే పాకిస్థాన్ ఆర్మీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
బలూచిస్థాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలనే డిమాండ్‌తో బీఎల్‌ఏ ఎప్పటి నుంచో పోరాటం చేస్తోంది. అందుకోసమే బీఎల్‌ఏను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కోరినట్లు సమాచారం. మునీర్ కోరిక మేరకు అమెరికా దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన వారాల తర్వాత ఈ అంశం తెరపైకి వచ్చింది.
బలూచ్ తిరుగుబాటు సంస్థను ఉగ్రవాద సంస్థగా అమెరికా ముద్ర వేయమని పాకిస్తాన్ ఒత్తిడి చేయడం ద్వారా పాకిస్తాన్ కూడా ఉగ్రవాద బాధితురాలిగా ఉందని నిరూపిస్తోంది. అమెరికా కొత్తగా ప్రకటించిన ఈ హోదా వల్ల ఆ గ్రూపుకు ఎవరైనా మద్దతు ఇవ్వడం నేరం. పాకిస్తాన్ దశాబ్దాలుగా ఎటువంటి కచ్చితమైన ఆధారాలు లేకుండా దేశంలో విధ్వంసక కార్యకలాపాలను నిర్వహించడానికి భారతదేశం BLA ను రెచ్చగొడుతోందని ఆరోపిస్తోంది. స్వతంత్ర బలూచిస్తాన్ కోసం పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ, మజీద్ బ్రిగేడ్ ఆత్మాహుతి బాంబు దాడులతో సహా అనేక దాడులకు పాల్పడింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
