బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుపాను బంగ్లాదేశ్, మయన్మార్ల మధ్య మోచా తుఫాన్ తీరాన్ని దాటింది. వేగంగా దూసుకొస్తూ.. బంగ్లాదేశ్, మయన్మార్‌లను షేక్ చేస్తోంది. గంటకు గరిష్ఠంగా 180, 190 నుంచి 210 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. దాంతో.. బంగ్లాదేశ్, మయన్మార్ తీర ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మోచా.. ఐదో కేటగిరి తుపానుగా రూపుదాల్చడంతో బంగ్లాదేశ్, మయన్మార్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే దాదాపు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
తీరప్రాంతాల సమీపంలోని విమానాశ్రయాలను మూసివేశాయి. బంగ్లాదేశ్‌లో ప్రజల కోసం 1,500 తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాటు చేశారు. బంగ్లాలో రోహింగ్యాలు నివసిస్తున్న, ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థుల శిబిరం ‘కాక్స్ బజార్’కు తుపాను ముప్పు పొంచి ఉందని అధికారులు వెల్లడించారు. దాదాపు రెండు దశాబ్దాల్లో బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న అత్యంత శక్తిమంతమైన తుపాను ఇదేనని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అంతకుముందు.. 2007లో వచ్చిన తుపాను ధాటికి బంగ్లాదేశ్‌లో మూడు వేల మందికిపైగా మృతి చెందారు. బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. వాస్తవానికి.. మొదట మోచా తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలపై ఉంటుందని అధికారులు భావించారు. కానీ.. తుపానుగా మారిన తర్వాత దిశను మార్చుకుంది. బంగ్లాదేశ్, మయాన్మార్ సరిహద్దుల్లోని తీరం దాటింది. ఇక.. మోచా తుపాను విరుచుకుపడుతుండటంతో పశ్చిమ బెంగాల్‌లో అధికారులు అప్రమత్తమయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..