Rahul Gandhi: రాహుల్ గాంధీ మళ్లీ లారీ ఎక్కారు. ఈసారి ఏకంగా అగ్రరాజ్యం అమెరికాలో ఈ ప్రయాణాన్ని చేపట్టారు. అక్కడ జీవనం కోసం వెళ్లిన భారత సంతతికి చెందిన కొందరు ట్రక్కు డ్రైవర్ల సమస్యలను తెలుసుకునేందుకు స్వయంగా వారితో కలిసి ప్రయాణం చేశారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ నగరం వరకు ఈ ట్రక్కు ప్రయాణం కొనసాగింది. భారత్‌సహా విదేశాల్లో సామాన్య ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు రాహుల్ తన యాత్రను కొనసాగిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. తల్జీందర్ సింగ్ విక్కీ గిల్, అతడి సహచరుడు రంజీత్ సింగ్ బనిపాల్ కలిసి వెళ్తున్న ట్రక్కులో రాహుల్ వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వరకు సుమారు 190 కిలోమీటర్లు ప్రయాణించారని.. ప్రయాణం ముగింపు అనంతరం డ్రైవర్లతో కలిసి ఆయన భోజనం చేశారని కాంగ్రెస్‌పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది.
అయితే ట్రక్కులో ప్రయాణిస్తున్న సమయంలో అమెరికాలోని ట్రక్కులను ఇక్కడి డ్రైవర్ల భద్రత సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించారని.. ఈ సౌలభ్యం భారత్‌లో లేదని రాహుల్ తెలిపారు. భారత్‌లో దేశంలో డ్రైవర్లు అతి తక్కువ వేతనాలకు పనిచేస్తారని, దీంతో నిత్యావసరాల ధరల పెరుగుదల వారికి భారంగా మారుతుందని.. కానీ, అమెరికాలో ఆ పరిస్థితి ఉండదని.. ఇక్కడి ట్రక్కు డ్రైవర్లు గౌరవప్రదమైన వేతనాలతో పాటు గౌరవం కూడా పొందుతారని రాహుల్ అన్నారు.
ఈ సందర్భంగా డ్రైవర్లు ఎంత ఆదాయం సంపాదిస్తారు? భారత్ లో లారీ డ్రైవర్లకు..అమెరికాలో లారీ డ్రైవర్లకు ఎదరుయ్యే ఇబ్బందులు వంటి విషయాలను తన ప్రయాణంలో రాహుల్ అడిగి తెలుసుకున్నారు. నెలకు రూ.8లక్షల దాకా సంపాదిస్తామని డ్రైవర్ చెప్పడంతో రాహుల్ ఆశ్చర్యపోయారు. భారత్‌లో కంటే అమెరికాలో ట్రక్కు డ్రైవర్ల జీవితాలు చాలా బాగున్నాయన్నారు రాహుల్‌గాంధీ. ఈ వీడియోను రాహుల్ తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. గతనెలలో ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్తున్న రాహుల్.. మార్గమధ్యంలో కారు దిగి ఓ ట్రక్కు ఎక్కి ప్రయాణించారు. లారీలో డ్రైవర్ పక్కన కూర్చోవడం ఓ దాబా వద్ద డ్రైవర్లతో మాటామంతీ తదితర దృశ్యాలను కాంగ్రెస్ పార్టీ నాడు ట్విటర్ వేదికగా పోస్ట్ చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..