ఢాకా, అక్టోబర్ 24: ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటన ఇంకా పూర్తిగా మరిచిపోక ముందే మరో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. బంగ్లాదేశ్‌లో సోమవారం (అక్టోబర్ 23) రెండు రైళ్లు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందిగా.. వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. ఢాకా ట్రిబ్యూన్ నివేదిక అదించిన సమాచారం మేరకు..
బంగ్లాదేశ్ దేశ రాజధాని ఢాకాకు 80 కిలోమీటర్ల దూరంలోని కిషోర్‌గంజ్‌లోని భైరబ్ వద్ద సోమవారం సాయంత్రం (అక్టోబర్ 23) 4 గంటల ప్రాంతంలో కిశోర్‌గంజ్ నుంచి ఢాకా వైపు వెళ్తున్న రైలును ఎగరో సింధూర్ ప్యాసింజర్ రైలును వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో రెండు రైళ్లు పరస్పరం ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. దీంతో ప్రయాణికులతో వెళ్తున్న రెండు రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. రైలు ప్రమాదంలో 15 మంది మరణించారు. కోచ్‌ల శిథిలాల కింద కొందరు ప్రయాణికులు చిక్కుకుపోయారు. వందల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. చాలా మంది ప్రయాణికులు రైలు కోచ్‌ల కింద పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు తరలిస్తున్నారు. క్షతగాత్రులను రక్షించి సమీపంలోని ఆసుపత్రులకు చేరవేస్తున్నారు. అక్కడి స్థానిక ప్రజలు కూడా ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు ఢాకా రైల్వే పోలీస్ సూపరింటెండెంట్ అనోవర్ హొస్సేన్ తెలిపారు.
చెన్నైలోని ఆవడి వద్ద ఈఎంయూకి చెందిన తిరువళ్ళూరు రూట్ లోకల్ ట్రైన్ మంగళవారం ఉదయం (అక్టోబర్ 24) పట్టాలు తప్పింది. అన్ననూర్ వర్క్‌షాప్ నుంచి ఆవడికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైన్‌కు సంబంధించిన 4 కోచ్‌లు పట్టాలు తప్పాయి. మెరీనా బీచ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద సమయంలో రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా తిరువళ్లూరు నుంచి సెంట్రల్ రూట్‌లో గత నెల రోజులుగా నిర్వహణ పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రైలు పట్టాలపై పగుళ్లు కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు లోకో ఫైలెట్ అస్వస్థత గురికావడంతోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.