AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వలసదారులకు నో ఎంట్రీ.. అమెరికాలో మొదలై ప్రపంచ దేశాలకు పాకిన వలస వ్యతిరేకత

అభివృద్ధి చెందిన దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వలసలు. ఆయా దేశాల్లో జీవన ప్రమాణాలు అత్యున్నతంగా ఉండటం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో ఇతర దేశాల నుంచి వలసలు బాగా పెరిగిపోయాయి. గతంలో వారికి సాదర స్వాగతం లభించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చాలా దేశాలలో "స్థానికులకే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కాలి" అనే నినాదంతో నిరసనలు, ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి.

వలసదారులకు నో ఎంట్రీ.. అమెరికాలో మొదలై ప్రపంచ దేశాలకు పాకిన వలస వ్యతిరేకత
Anti Immigrant Protests
Balaraju Goud
|

Updated on: Sep 17, 2025 | 7:47 AM

Share

అభివృద్ధి చెందిన దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వలసలు. ఆయా దేశాల్లో జీవన ప్రమాణాలు అత్యున్నతంగా ఉండటం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో ఇతర దేశాల నుంచి వలసలు బాగా పెరిగిపోయాయి. గతంలో వారికి సాదర స్వాగతం లభించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చాలా దేశాలలో “స్థానికులకే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కాలి” అనే నినాదంతో నిరసనలు, ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఉన్నత విద్య, ఉజ్వల భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయుల ఆశలు ఆవిరవుతున్నాయి.

అమెరికా, పశ్చిమ దేశాల్లో వలసలపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరుగుతోంది. ప్రతీ ఏడాది లక్షలాది మంది ఆయా దేశాలకు వలస పోతున్నారు. ఒకప్పుడు అమెరికాకే పరిమితమైన వలస వ్యతిరేకత, ఇప్పుడు కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలకు సైతం వ్యాపించడంతో వలస వెళ్లిన వారి భద్రత, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారాయి. స్థానికులకే ఉద్యోగాలు దక్కాలనే నినాదంతో పలు దేశాల్లో నిరసనలు వెల్లువెత్తడం ఆందోళన కలిగిస్తోంది.

‘అమెరికా ఫస్ట్’ విధానంతో వ్యతిరేకతకు బీజం

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అనుసరించిన ‘అమెరికా ఫస్ట్’ విధానంతో వలసదారులపై వ్యతిరేకతకు బీజం పడింది. అమెరికాలో ఇదే విషయంపై ప్రచారం చేసిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. వలస వచ్చిన వారిని ఏరిపారేస్తామంటూ చెప్పిన ట్రంప్ అన్నంత పనీ చేశారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదంతో ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అమెరికన్లకే పెద్దపీట వేస్తూ వలసదారులపై కఠినమైన ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు. ఇదే ధోరణి ఇప్పుడు ఇతర దేశాల్లోనూ కనిపిస్తోంది. ఆస్ట్రేలియాలో ‘మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా’ పేరుతో వేలాది మంది రోడ్లపైకి వచ్చి వలసలను ఆపాలని డిమాండ్ చేశారు. కెనడాలోనూ భారతీయులు సహా విదేశీయులు దేశం విడిచి వెళ్లాలంటూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి.

ఐరోపాలో రాజుకున్న సెగ

ఇక, ఐరోపాలో ఈ సెగ మరింత తీవ్రంగా ఉంది. లండన్ వీధుల్లో ఏకంగా లక్షన్నర మంది వలసలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలో పాల్గొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జర్మనీ, డబ్లిన్, వార్సా వంటి నగరాల్లోనూ ఇదే తరహా ఆందోళనలు జరిగాయి. ఈ పరిణామాలన్నీ విదేశాల్లో విద్య, ఉద్యోగాల కోసం వెళ్లే భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఆర్థిక భద్రతే కాకుండా, సామాజిక భద్రత కూడా కరవయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారతీయులే లక్ష్యంగా జాతి విద్వేష దాడులు?

ఈ వలస వ్యతిరేక నిరసనలు ముదిరితే, భారతీయులే లక్ష్యంగా జాతి విద్వేష దాడులు జరిగే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం దౌత్యపరంగా గట్టి చర్యలు తీసుకోవడంలో విఫలమైందని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. కేవలం సూచనలు, సలహాలకే పరిమితం కాకుండా, ఆయా దేశాలతో చర్చించి భారతీయుల భద్రతకు భరోసా కల్పించడంలో విదేశాంగ శాఖ విఫలమైందని వారు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..