Viral News: థాంక్యూ గూగుల్.. ఆరేళ్ల బాలుడి ప్రాణాలను కాపాడుకున్న తల్లి.. ఎలాగంటే
సోషల్ మీడియా, గూగుల్ , స్మార్ట్ ఫోన్ వంటి వాటి వలన మంచి చెడులు కూడా ఉన్నాయి. వాటిని ఉపయోగించే పద్దతిమీద ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఒక తల్లి తన 6 ఏళ్ల బిడ్డ ప్రాణాలను కాపాడుకునేందుకు గూగుల్ ని ఆశ్రయించింది. పగలు రాత్రి అనే తేడా లేకుండా తన పిల్లాడిని రక్షించుకునేందుకు గూగుల్‌లో మంచి వైద్యుడిని వెతికి పట్టుకుంది. ఇప్పుడు ఆ బాలుడు బతికి బట్టకట్టాడు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటు చేసుకుంది.

టెక్సాస్‌లో 6 ఏళ్ల విట్టెన్ డేనియల్ అకస్మాత్తుగా కదలలేని, మాట్లాడలేని లేదా ఊపిరి పీల్చుకునే సామర్థ్యాన్ని కోల్పోయాడు. దీంతో అతని కుటుంబం తీవ్ర భయాందోళనలకు గురైంది. వెంటనే ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. వైద్యులు బాలుడికి ఫ్లూ సోకినట్లు అనుమానించారు. అయితే ఆ బాలుడి పరిస్థితి తీవ్రంగా మారింది. తన కొడుకిని ఎలాగైనా కాపాడుకోవాలని తల్లి భావించింది. దీంతో తన కొడుకు వ్యాధి లక్షణాలు దృష్టిలో పెట్టుకుని రాత్రనక పగలనక గూగుల్ ని శోధించడం మొదలు పెట్టింది.
ఏప్రిల్‌లో విట్టెన్‌కు తలతిరగడం, తలనొప్పి సమస్య కలిగింది. దీంతో ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మొదట్లో ఇది ఫ్లూ అని చెప్పారు. అయితే 24 గంటల్లోనే బాలుడి పరిస్థితి మరింత దిగజారింది. విట్టెన్ ఇకపై నడవలేడు, మాట్లాడలేడు లేదా స్వయంగా శ్వాస తీసుకోలేడని చెప్పారు. స్పృహ కోల్పోయిన తన కొడుకుని ఆ స్థితిలో చూసిన తల్లి కేసీ డేనియల్ తల్లడిల్లింది. కొడుకు పడుతున్న బాధని చూడడం ఎంత భయంకరమైనదో వర్ణించడానికి మాటలు రావడం లేదు చెప్పింది.
వైద్యులు వెంటనే అతనికి ఇంట్యూబేట్ చేసి పరీక్షలు నిర్వహించారు. అప్పుడు ఆ బాలుడికి వచ్చింది ఫ్లూ కాదని అతని మెదడు కాండంలో కారుతున్న అరుదైన, ప్రమాదకరమైన రక్త నాళాల సమూహం అని గుర్తించారు.
అరుదైన రోగ నిర్ధారణ
అలయన్స్ టు క్యూర్ ప్రకారం కావెర్నస్ మాల్ఫార్మేషన్ లేదా కావెర్నోమా అని పిలువబడే ఈ పరిస్థితి 500 మందిలో ఒక్కరిని మాత్రమే ప్రభావితం చేస్తుందని తెలుస్తోంది. చాలామందికి ఈ వ్యాధి లక్షణాలు కనిపించవు. కానీ మూర్ఛలు, రక్తస్రావం, తలనొప్పి, దృష్టి సమస్య, బలహీనత వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. ఈ వ్యాధి దాదాపు 20% కేసులు జన్యుపరంగా వస్తుంది.
విట్టెన్ వ్యాధిని నిర్ధారించిన తర్వాత వైద్యులు కేసీ తో మాట్లాడుతూ.. ఇక బాలుడు ఎప్పటికీ నడవకపోవచ్చని, జీవితాంతం వెంటిలేటర్, ఫీడింగ్ ట్యూబ్ అవసరమని చెప్పారు. అయితే విట్టెన్ ఆస్పత్రిలో చేరడానికి కంటే రెండు వారాల క్రితమే లిటిల్ లీగ్ జట్టులో MVPగా ఎంపికయ్యాడు. దీంతో తన కొడుకు భవిష్యత్ ఆ తల్లికి అనిశ్చితంగా అనిపించింది.
ప్రాణాలను కాపాడేందుకు Googleలో శోధన
కేసీ పట్టు వదలకుండా నిరంతరం గూగుల్ లో కొడుకు వ్యాధి గురించి చికిత్స విధానం గురించి తెలుసుకోవడం మొదలు పెట్టింది. అప్పుడు ఆమెకు UTHealth హ్యూస్టన్‌లోని న్యూరో సర్జన్, కావెర్నోమాలకు చికిత్స చేయడంలో స్పెషలిస్ట్ అయిన డాక్టర్ జాక్వెస్ మోర్కోస్ రాసిన వ్యాసం కనిపించింది. వెంటనే ఆమె డాక్టర్ కు తన కొడుకు పరిస్తితి తెలియజేస్తూ ఒక ఇమెయిల్ పంపింది. డాక్టర్ జాక్వెస్ మోర్కోస్ ఆ మెయిల్ కు వెంటనే స్పందించారు. ఆ బాలుడి రిపోర్ట్ చూసినట్లు.. చికిత్స కోసం తన వద్దకు తీసుకుని రమ్మనమని చెప్పారు.
6 సంవత్సరాల బాలుడికి చికిత్స.. కోలుకోవడం
వెంటనే విట్టెన్‌ను హూస్టన్‌కు తరలించారు. అక్కడ డాక్టర్ మోర్కోస్, పీడియాట్రిక్ న్యూరో సర్జన్ డాక్టర్ మనీష్ షా నాలుగు గంటల పాటు శ్రమించి సున్నితమైన శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ విజయవంతమైంది. కొన్ని గంటల్లోనే విట్టెన్ మేల్కొని.. సొంతంగా శ్వాస తీసుకొని, మళ్ళీ మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆపరేషన్ జరిగిన ఆరు వారాల తర్వాత విట్టెన్ తన 7వ పుట్టినరోజు సందర్భంగా లుబ్బాక్‌లోని ఇంటికి తిరిగి వచ్చాడు. మళ్ళీ తన చదువు మొదలు పెట్టాడు. రెండవ తరగతి చదువుతో పాటు బేస్ బాల్ బ్యాట్ కూడా పట్టుకున్నాడు.
తన స్నేహితులను మళ్ళీ చూడటానికి అవకాశం ఇచ్చిన డాక్టర్ మోర్కోస్, డాక్టర్ షా లకు థాంక్స్ చెబుతున్నాడు ఈ చిన్నారి. అయితే విట్టెన్ మళ్ళీ బేస్ బాల్ ఆడుతూ ఆ ఫోటోలు తమకు పంపించాలనే షరత్తు పెట్టినట్లు వైద్యులు చెప్పారు. ఇదే విషయంపై తల్లి మాట్లాడుతూ.. తన కొడుకు ప్రాణాలను కాపాడటానికి సహాయపడిన గూగుల్‌ని తాను ఎప్పటికీ మరచిపోలేనని కేసీ చెప్పింది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




