Afghan New Ruler: అఫ్గానిస్తాన్ కొత్త రూలర్ అతనేనా? పబ్లిక్ అప్పియరెన్స్‌కు రెడీ అవుతున్నఅఖుంద్జాదా

| Edited By: Anil kumar poka

Aug 31, 2021 | 11:24 AM

ఆగస్టు 31తో అమెరికన్, నాటో మిలిటరీ ఉపసంహరణ పూర్తి కానున్న తరుణంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు తాలిబన్లు సిద్దమవుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. నిజానికి తాలిబన్లు అఫ్గానిస్తాన్‌పై పట్టు సాధించినప్పటికీ ఆ సంస్థ అధినేత...

Afghan New Ruler: అఫ్గానిస్తాన్ కొత్త రూలర్ అతనేనా? పబ్లిక్ అప్పియరెన్స్‌కు రెడీ అవుతున్నఅఖుంద్జాదా
Afghan New President Hibatullah Akhundzada
Follow us on

Afghan New Ruler Akhundzada Taliban Chief: పదంటే పది రోజుల అగ్రెషన్‌తో అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు సెప్టెంబర్ 1 నుంచి పూర్తి స్థాయి పరిపాలన ప్రారంభించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆగస్టు 31తో అమెరికన్, నాటో మిలిటరీ ఉపసంహరణ పూర్తి కానున్న తరుణంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు తాలిబన్లు సిద్దమవుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. నిజానికి తాలిబన్లు అఫ్గానిస్తాన్‌పై పట్టు సాధించినప్పటికీ ఆ సంస్థ అధినేత ఇంతవరకు పబ్లిక్ అప్పియరెన్స్ ఇవ్వలేదు. 2016లో ఆనాటి తాలిబన్ చీఫ్ ముల్లా ఒమర్ మరణానంతరం పలు గ్రూపులుగా చీలిపోయిన తాలిబన్లను దాదాపు ఒక్కతాటిపై నడింపించింది అఖుంద్జాదానే. అయితే.. ఇతగాడు ఎక్కువగా పబ్లిక్ అప్పియరెన్సెస్ ఇవ్వడు. తాజాగా ఆగస్టు మొదటి వారంలో మొదలైన తాలిబన్ల అగ్రెషన్ ఆగస్టు 15 నాటికి దేశాన్ని హస్తగతం చేసుకునేలా ప్లాన్ చేసింది అఖుంద్జాదానే అని తెలుస్తోంది. అయితే.. అమెరికన్ సేనలు పూర్తి స్థాయిలో దేశాన్ని వదిలేసి వెళ్ళే దాకా అఖుంద్జాదా వ్యూహాత్మకంగానే పబ్లిక్ అప్పియరెన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ మేరకు తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఆగస్టు 29న ఓ ప్రకటన చేస్తూ.. ఒకట్రెండు రోజుల్లోనే అఖుంద్జాదా పబ్లిక్ అప్పియరెన్స్ ఇస్తారని తెలిపారు.

ఓవైపు అమెరికన్ సేనలు నిర్ణీత గడువు ఆగస్టు 31 నాటికి దేశాన్ని పూర్తిగా వదిలేసి వెళుతూ వుండడం.. మరోవైపు అఖుంద్జాదా పబ్లిక్ అప్పియరెన్స్‌కు సిద్దమవుతుండడంతో సెప్టెంబర్ 1 నుంచి అప్గాన్‌లో తాలిబన్ల పూర్తి స్థాయి ప్రభుత్వం అమల్లోకి వస్తుందని కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కాందహార్‌లో వున్న అఖుంద్జాదా అక్కడ్నించే దేశప్రజలకు సందేశం ఇస్తారా? లేక దేశ రాజధాని కాబుల్‌లో అధ్యక్ష భవనానికి వచ్చి జాతినుద్దేశించి ప్రసంగిస్తారా అన్నది తేలాల్సి వుంది. అఖుంద్జాదా గత ఆరేళ్ళుగా కాందహార్‌ సమీపంలోని ఓ రహస్య ప్రదేశంలోనే వుంటున్నారని జబీహుల్లా ముజాహిద్ చెబుతున్నారు. మరోవైపు తాలిబన్ల డిప్యూటీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ బిలాల్ కరిమీ కూడా అఖుంద్జాదా ప్రజల ముందుకు త్వరలోనే వస్తారంటూ ప్రకటన చేశారు.

2015లో ముల్లా ఒమర్ మరణించిన తర్వాత తాలిబన్లు అనేక గ్రూపులుగా విడిపోయారు. ఇంకొకరి నాయకత్వాన్ని మరొకరు సహించకపోవడంతో తాలిబన్లలో చీలికకు దారితీశాయి. అయితే.. ఈ గ్రూపులన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చిన ఘనత మాత్రం అఖుంద్జాదాదే. గత ఆరేళ్ళుగా తగిన సమయం కోసం చూస్తూ వున్న అఖుంద్జాదా.. అమెరికాకు బైడెన్ అధ్యక్షుడు అవగానే చక్రం తిప్పినట్లు అంతర్జాతీయ అంశాల పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి బైడెన్ ఎలాంటి హామీ ఇవ్వకపోయినా అధికారం చేపట్టిన నెలన్నర కాలంలోనే అఫ్గాన్ నుంచి అమెరికన్ బలగాలను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటన చేశారు. దాన్ని అమల్లోకి తెచ్చి.. పూర్తి చేసే తేదీలను కూడా ప్రకటించారు. ఇటు అమెరికా ప్రకటన వెలువడిందో లేదో.. అటు తాలిబన్లు దేశాన్ని హస్తగతం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అమెరికన్ దళాల ఉపసంహరణ సగం పూర్తి అయ్యిందో లేదో.. అఫ్గాన్‌ని తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు సిద్దమయ్యారు. దేశంలో కొనసాగుతున్న పౌరప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఆగస్టు మొదటి వారంలో యుద్ధం మొదలు పెట్టారు. ఈ యుద్దానికి తగిన తంత్రాన్ని సిద్దం చేసిన అఖుంద్జాదా మాత్రం కాందహార్ దాటి రాలేదు.

తాజాగా అమెరికన్ దళాల ఉపసంహరణ ఆగస్టు 31వ తేదీన ముగియనుండడంతో అఫ్గానిస్తాన్‌లో పరిపాలన ప్రారంభించేందుకు అఖుంద్జాదా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. ముందుగా అఫ్గానీలనుద్దేశించి అఖుంద్జాదా ప్రసంగిస్తారని.. ఆ తర్వాత దేశాధ్యక్షునిగా తనను తాను ప్రకటించుకుంటారని పరిశీలకులు అంఛనా వేస్తున్నారు. కాబుల్ అధ్యక్ష భవనం నుంచే అఖుంద్జాదా పరిపాలన కొనసాగిస్తారని తెలుస్తోంది. అయితే.. అమెరికన్ల కనుసన్నల్లో ఇంతకాలం కొనసాగిన పరిపాలన తాలూకు ఛాయలను ముందుగా మార్చేందుకు అఖుంద్జాదా సిద్దమవుతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే గత ప్రభుత్వానికి సహకరించిన వారి జాబితాలను ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి తాలిబన్లు సేకరిస్తున్నారని తెలుస్తోంది. మొబైల్, ల్యాండ్‌లైన్ ఫోన్ల కాల్ డేటా ఆధారంగా వీరందరినీ గుర్తిస్తారని సమాచారం. ఈపరిణామంపై పలువురు అఫ్తానీలు ఆందోళన వ్యక్తం చేస్తుండడం కూడా తాలిబన్ల ప్రభుత్వం తదుపరి చర్యలు ఎలా వుండబోతున్నాయో ఊహించేందుకు ఆస్కారమిస్తోంది.