China Spy Balloon: అమెరికాకు చెమటలు పట్టిస్తోన్న బెలూన్.. కూల్చడానికి అగ్రరాజ్యం అందుకే వెనుకడుగు వేస్తోందా.?
అమెరికా, చైనాల మధ్య ఆదిపత్య పోరు ముదురుతోందా.? అమెరికాపై పైచేయి చాటుకునేందుకు చైనా పావులు కదుపుతోందా.? తాజాగా అమెరికాలో గగనతలంలో కనిపించిన చైనా నిఘా బెలూన్ వ్యవహారం అవుననే సమాధానం వస్తోంది. అమెరికాలోని అణు స్థావరం వద్ద చైనాకు చెందిన...
అమెరికా, చైనాల మధ్య ఆదిపత్య పోరు ముదురుతోందా.? అమెరికాపై పైచేయి చాటుకునేందుకు చైనా పావులు కదుపుతోందా.? తాజాగా అమెరికాలో గగనతలంలో కనిపించిన చైనా నిఘా బెలూన్ వ్యవహారం అవుననే సమాధానం వస్తోంది. అమెరికాలోని అణు స్థావరం వద్ద చైనాకు చెందిన నిఘా బెలూన్ కనిపించడంతో ప్రపంచం దృష్టి అటు పడింది. సుమారు మూడు బస్సుల పరిమాణంలో ఉన్న ఈ బెలూన్ తొలుత ఫిబ్రవవరి 2వ తేదీన మోంటానాలో ప్రత్యక్షమైందని పెంటగాన్ పేర్కొంది. అనంతరం తాజాగా మరో బెలూన్ అమెరికా గగనతలంలో ప్రత్యక్షమైందని అమెరికా అధికారులు చెబుతున్నారు.
అమెరికాలోని మోంటానాతో పాటు అనేక సున్నితమైన ప్రదేశాలపై ఈ బెలూన్ ఎగురుతున్నట్లు అమెరికా ప్రభుత్వం గుర్తించింది. అయితే దాన్ని కూల్చివేయాలని మొదట భావించినప్పటికీ.. అందులో ఏమైనా రసాయనాల్లాంటివి ఉంటే, అవి దేశం మీద పడితే, ఇబ్బంది ఉంటుందని వైట్ హౌజ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ బెలూన్ దిశను అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ ఎప్పటికప్పుడు గమనిస్తోంది. బెలూన్‌ను కూల్చేయాలా.? లేదా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఈ బెలూన్ వ్యవహారంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. చైనాతో చర్చల నిమిత్తం శుక్రవారం రాత్రి బయల్దేరాల్సిన విదేశాంగ మంత్రి బ్లింకెన్ పర్యటన సైతం వాయిదా పడింది.
బెలూన్‌పై పలు అనుమానాలు..
ఇక ఈ నిఘా బెలూన్‌పై అమెరికాకు చెందిన నిపుణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బెలూన్‌లో ఏవైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. అలాగే ఈ బెలూన్ ఆర్టిషిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుందని అధికారుల అభిప్రాయపడుతున్నారు. అధునాత టెక్నాలజీతో పనిచేసే ఇలాంటి బెలూన్లు తమకు తాముగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే మేథోసంపత్తి కలిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ బెలూన్స్ దిశను సైతం మార్చుకోగలవని భావిస్తున్నారు. ఈ కారణంగానే బెలూన్‌ను పేల్చడానికి అమెరికా వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోసారి తెరపైకి చైనా, అమెరికా విబేధాలు..
ఈ బెలూన్ కారణంగా అమెరికా, చైనాల మధ్య ఉన్న విభేదాలు మరోసారి భయటపడ్డాయి. గత కొంతకాలంగా ఇండో- పసిఫిక్‌లో చైనా చేస్తున్న దుశ్చర్యలు అమెరికాకు చికాకు తెప్పిస్తున్నాయి. అంతేకాకుండా ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ కూడా ఎక్కువైంది. తైవాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలకు చైనా పాల్పడుతుందని అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. అలాగే.. దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనిక కార్యకలాపాలను సైతం అమెరికా ఖండించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ బెలూన్ వ్యవహారంతో ఈ అంశం మరింత ముదిరినట్లైంది.
చైనా వెర్షన్ ఏంటంటే..
ఇదిలా ఉంటే ఈ బెలూన్ పై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. తాము అంతర్జాతీయ చట్టాలను అనుసరిస్తున్నామని విదేశాంగశాఖ ప్రతినిధి మావో వింగ్ తెలిపారు. ఈ బెలూన్ వల్ల ఎవరికీ హాని జరగదని ప్రకటన విడుదల చేశౄరు. ఈ బెలూన్ వాతావరణ పరిశోధనకు సంబంధించిందని వెల్లడించారు. బలమైన గాలులు కారణంగా అది నిర్ణీత మార్గందాటి బయటకు వచ్చిందని చైనా చెబుతోంది. ఈ అంశాన్ని అమెరికా అనవసరంగా రద్దాంతం చేస్తోందని, అంతర్జాతీయ గగనతల నిబంధనలు ఉల్లంఘించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. ఇరుదేశాలు ఈ సమస్యను ప్రశాంతంగా పరిష్కరించుకోవచ్చన్న విదేశాంగశాఖ ప్రతినిధి మావో వింగ్ తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..