ఇరాన్‌లో హిజాబ్ వివాదం మరింత ముదురుతోంది. సెప్టెంబర్ 16న మహ్సా అమీని మరణం తర్వాత ఆ దేశ యువత హిజాబ్‌కు వ్యతిరేకంగా గళంవిప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు చేరి నిరసనలు తెలుపుతున్నారు. ఇక ప్రభుత్వం అగ్నికి ఆజ్యం పోసినట్లు ఎక్కడికక్కడ నిరసనకారులను అణచివేత చర్యలకు పూనుకుంటోంది. అనేకమందిని అరెస్టు చేసి, శిక్షిస్తోంది. షిరాజ్‌లోని షా చెరాగ్ సమాధిపై అక్టోబర్ 26న ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ చేసిన దాడిలో దాదాపు 13 మంది మరణించారు. గడచిన రెండు నెలల్లో తలెత్తిన ఘర్షనల్లో డజన్ల కొద్దీ మరణాలు చోటుచేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లో ఆందోళన తెలుపుతున్న గుంపుపై ఉగ్రవాద మూక తాజాగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, పది మంది తీవ్రంగా గాయపడినట్లు ఈ దేశ మీడియా వెల్లడించింది. మృతులలో ఓ మహిళా, ఓ చిన్నారి కూడా ఉన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ సంస్థ ప్రకటన విడుదల చేయలేదు. 2 మోటార్ సైకిళ్లపై వచ్చిన దుండగులు నిరసనకారులు, సెక్యురిటీ ఫోర్స్‌పై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.