Smartwatch Explodes: అప్పుడప్పుడు ఫోన్‌లు పేలినట్లు వార్తలు విన్నాం. కానీ స్మార్ట్ వాచ్‌లు పేలినట్లు పెద్దగా విని ఉండము. కొన్ని స్మార్ట్‌ఫోన్లు, సాధారణంగా ఫోన్లలో బ్యాటరీ పేలడం అనేది జరుగుతుంటాయి. నాలుగేళ్ల బాలిక చేతిమణికట్టుకు ఉన్న స్మార్ట్ వాచ్ పేలడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. స్మార్ట్ వాచ్‌లో బ్యాటరీ ఒక్కసారిగా పేలడంతో ఆమెకు గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
యాహూ న్యూస్ ఆస్ట్రేలియా ప్రకారం.. చైనా ప్రావిన్స్ ఫుజియాన్‌లోని క్వాన్‌జౌ నగరానికి చెందిన యియి హువాంగ్ అనే బాలిక.. ఈ నెల మొదటి వారంలో తన బంధువులతో ఆడుకుంటుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. భయాందోళనకు గురై ఆ చిన్నారి పరుగులు పెట్టింది. మణికట్టుకు గాయాలై భారీగా పొగలు వచ్చాయి. దీంతో వాచ్ పేలినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే మణికట్టుకు ఉన్న స్మార్ట్ వాచ్‌ను తొలగించారు. తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుడు కారణంగా ఆమె చేతి వెనుక భాగంలో తీవ్రమైన గాయాలు అయ్యాయి. అయితే ఈ స్మార్ట్ వాచ్ కంపెనీ వివరాలు వారు వెల్లడించలేదు. పేలుడు గురించి సదరు వాచ్ కంపెనీకి సమాచారం అందించారు. ఈ ఘటనకు నష్టపరిహారం చెల్లింపు విషయమై ఆమె తండ్రి మిస్టర్ హువాంగ్ తయారీదారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.