కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. లులోంగా నదిలో పడవ బోల్తా పడి 145 మంది ప్రాణాలు కోల్పోయారు. రాత్రిపూట వస్తువులు, జంతువులతో ఓవర్‌లోడ్ తో వెళ్తుండగా.. మోటరైజ్డ్ పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదం నుంచి 55 మంది ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. మొత్తం 200 మందితో రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. బసంకుసు పట్టణానికి సమీపంలో లులోంగా నదిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓవర్‌లోడ్ కారణంగానే పడవ మునిగిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం తమ ప్రావిన్స్‌లో, ఇక్కడ బసంకుసు భూభాగంలో ఇతర రవాణా మార్గాలు లేవని వెల్లడించారు.
కాగా.. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తరచూ పడవ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. రోడ్డు మార్గాలు లేకపోవడంతో ప్రజలు పడవల్లోనే ప్రయాణం చేస్తుంటారు. బతుకుదెరవు కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్లే కార్మికులు ప్రమాదమని తెలిసినా గత్యంతరం లేక.. పడవల్లోనే వెళ్తుంటారు. ఈత రాకపోయినా పడవల్లో ప్రయాణించి ప్రమాదాలకు గురవుతుంటారు. అక్టోబర్‌లో ఈక్వెటూర్ ప్రావిన్స్‌లోని కాంగో నదిలో ఇలాగే 40 మందికి పైగా మృతి చెందారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..