ఎవరీ ఉషా వాన్స్‌..? గూగుల్‌లో వెతుకుతున్న అమెరికన్లు! వీడియో

ఎవరీ ఉషా వాన్స్‌..? గూగుల్‌లో వెతుకుతున్న అమెరికన్లు! వీడియో

Samatha J

|

Updated on: Jan 24, 2025 | 2:30 PM

అమెరికాలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. తన దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షించారు ఉషా వాన్స్‌. నూతన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సతీమణి, భారత సంతతి మహిళ అయిన ఆమె గురించి తెలుసుకునేందుకు అమెరికన్లు ఆసక్తి చూపిస్తున్నారు. మతం, పౌరసత్వం వంటి వ్యక్తిగత సమాచారం కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేశారు ఉషా చిలుకూరి అమెరికాలో కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. యేల్‌ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయ విభాగంలో సుదీర్ఘంగా పనిచేశారు. యేల్‌ లా స్కూల్‌లోనే ఉషా, జేడీ వాన్స్‌ తొలిసారి కలుసుకున్నారు.

ఈ క్రమంలోనే పరస్పరం ఇష్టపడ్డారు. 2014లో కెంటకీలో వారు వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయంలో వీరి వివాహం జరగడం విశేషం. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. భర్త విజయంలో ఉష కీలక పాత్ర పోషించారు. తన కెరీర్‌లో అడుగడుగునా ఆమె అండగా ఉంటుందని వాన్స్‌ గతంలో వెల్లడించారు. భర్త క్రిస్టియానిటీ, ఆమె హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు.వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్‌ రద్దు చేసారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమిస్తుంది. దీనిపై ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీ చేశారు. జన్మతః పౌరసత్వం పొందిన ఉషా వాన్స్‌పై ఈ ఆర్డర్ వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. అది అమల్లోకి వచ్చిన తర్వాత పుట్టిన పిల్లలకు మాత్రమే ఆ నిబంధన వర్తిస్తుంది. ఇదిలా ఉంటే.. జేడీ వాన్స్‌ ప్రమాణ స్వీకార సమయంలో ఆమె తన ముగ్గురు చిన్నారులను చూసుకుంటూ.. మరోవైపు భర్త పక్కనే ఉంటూ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించారు.

 

Published on: Jan 24, 2025 02:30 PM