సముద్ర జలాల్లో ఏమి హాయిలే హల ! కేరళలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏం చేశారంటే ?
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నడూ చేయని ఓ 'సాహస' కార్యం చేశారు. రాజకీయాల్లో సదా బిజీగా ఉంటూనే కాస్త తీరిక చేసుకుని దేశం యావత్తూ కళ్లప్పగించి చూసే పని లోకి దిగారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నడూ చేయని ఓ ‘సాహస’ కార్యం చేశారు. రాజకీయాల్లో సదా బిజీగా ఉంటూనే కాస్త తీరిక చేసుకుని దేశం యావత్తూ కళ్లప్పగించి చూసే పని లోకి దిగారు. ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్న ఆయన.. కొల్లం జిల్లాలోని తంగసెరి బీచ్ ను సందర్శించారు. ఆ సందర్భంగా మత్స్య కారులు తమ బోట్లలో సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టడాన్ని చూసిన ఆయన.. తన ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయారు. తను కూడా ఓ బోటునెక్కి సముద్రం లోకి దూకారు. నీలిరంగు టీ షర్ట్, ఖాకీ ట్రౌజర్ దుస్తులతోనే రాహుల్ సముద్ర జలాల్లోకి దూకడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. సుమారు 10 నిముషాలసేపు ఆయన ఈత కొడుతుంటే ..అప్పటివరకు ఆయనకు ఈత వస్తుందని తెలియనివాళ్లంతా తమ కళ్ళ ముందు జరుగుతున్నది చూసి నోళ్లు వెళ్ళబెట్టారు. ఆయన మంచి స్విమ్మర్ అని అప్పుడే వారికి తెలిసింది.ఈ బీచ్ లో రాహుల్ మత్స్యకారులతో సుమారు రెండున్నర గంటలు గడిపారు. వారు తయారు చేసిన ఫిష్ కర్రీని బోటులో వారితో కలిసి ఆరగించారు. కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన ఆయన.. వీరి సమస్యలను తమ పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తానని హామీ ఇచ్చ్చారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మత్స్య కారులు చేపల వేటలో జీవనం సాగించడాన్ని రాహుల్ అభినందించారు. రైతుల మాదిరే వీరు కూడా ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అన్నదాతలు భూమిపై వ్యవసాయం చేస్తే మత్స్య కారులు సముద్రంలో ఈ ‘వ్యవసాయం’ చేస్తున్నారని ఆయన అన్నారు. రైతులకు ఢిల్లీలో ఓ మంత్రిత్వ శాఖ ఉందని, కానీ వీరికి లేదని ఆయన చెప్పారు. మనం చేపలు తింటున్నాం.. కానీ దానివెనుక ఉన్న హార్డ్ వర్క్ గురించి, ఇది ఎలా మన ప్లేట్ లో చేరుతోందన్న విషయం గురించి ఎన్నడూ ఆలోచించం అని రాహుల్ పేర్కొన్నారు.
ఇప్పటికే కేరళ సహా నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఇందుకు ప్రచారాల కోసం పార్టీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సమాజంలోని వివిధ వర్గాల వారిని ఆకట్టుకునేందుకు నానాపాట్లూ పడుతోంది. ఇప్పటివరకు రైతుల డిమాండ్లను తమ ఎన్నికల ‘ప్రచారాస్త్రం’గా వినియోగించుకోజూస్తున్న వందేళ్లకు పైగా చరిత్ర గల ఈ పార్టీ ఇప్పుడు మత్స్య కారుల సమస్యలపై దృష్టి పెట్టింది. ఇన్నాళ్లూ ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్న సందర్భాల్లో ఈ వర్గం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటు వచ్చింది. తుపాను వంటి జలవిలయాల్లో రోజుల తరబడి వీరు చేపల వేటకు వెళ్లలేక ఇళ్లలో అర్ధాకలితో గడుపుతూ వచ్చ్చారు. వీరి వలలు తెగిపోయినా ప్రభుత్వాలు వీరికి నష్టపరిహారం మంజూరు చేసిన సందర్భాలు లేవు. కాగా ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు వీరి పరిస్థితి కొంత మెరుగు పడినా మొత్తం మీద ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉంది. ఇటీవల తన సొంత నియోజకవర్గమైన వయనాడ్ లో పర్యటించిన రాహుల్ గాంధీ సుమారు 6 కి.మీ. ట్రాక్టర్ నడిపి అందరి దృష్టినీ ఆకర్షించారు. రైతు చట్టాలను కేంద్రం రద్దు చేసేంతవరకు తాము రైతుల పక్షానే అని ప్రకటించారు. ఇప్పుడు కొల్లం జిల్లాల్లో ఈ బీచ్ వద్ద గడిపిన ఆయన మత్స్య కారుల ప్రయోజనాలకు తాము కట్టుబడి ఉన్నామని అంటున్నారు. సముద్ర జలాలలో వారితో కలిసి ఈత కొట్టడం చూస్తే ఇది కూడా రాజకీయ ఎత్తుగడగా కనిపిస్తోందని అంటున్నారు. ఇక ఈ ఎత్తుగడను బీజేపీ నేతలు ఎలా తమ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంటారో చూడాల్సి ఉంది.
#WATCH| Kerala: Congress leader Rahul Gandhi took a dip in the sea with fishermen in Kollam (24.02.2021)
(Source: Congress office) pic.twitter.com/OovjQ4MSSM
— ANI (@ANI) February 25, 2021
Shri @RahulGandhi joined the fishermen of Kollam as they toiled for the morning catch on the high-sea.#KeralaWithRahulGandhi pic.twitter.com/etXe1v3Nhu
— Congress (@INCIndia) February 24, 2021
మరిన్ని చదవండి ఇక్కడ :
నరసరావుపేట డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య :Narasaraopet Degree Student Murder video