ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఓ వైపు అధికార పార్టీ.. మరోవైపు కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ దూకుడు పెంచాయి. ముఖ్యంగా కొన్ని సీట్ల విషయంలో కూటమిలోని పార్టీల నేతల మధ్య సమన్వయం దెబ్బతిన్నది. పొత్తులో భాగంగా పిఠాపురం సీటు జనసేనకు ప్రకటించగానే టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్మ అనుచరులు టీడీపీ కార్యాలయానికి వెళ్లి ఫ్లెక్సీలు, జెండాలు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. వర్మకే టీడీపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే చంద్రబాబు వర్మను పిలిచి బుజ్జగించారు. ఎమ్మెల్సీ హామీ ఇవ్వడంతో ఈ గొడవ సద్దుమణిగింది.
ఆల్ ఈజ్ వెల్ అనుకునేలోపే.. పిఠాపురంలో పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. జనసేన తరపున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్‌ని ప్రకటించారు పవన్. ప్రధాని మోదీ, అమిత్ షా సూచనతో ఒకవేళ తాను ఎంపీగా బరిలోకి దిగితే మాత్రం.. పిఠాపురం అసెంబ్లీ నుంచి ఉదయ్ పోటీ చేస్తారని ఉన్నారు. ఇద్దరం స్థానాలు మార్చుకుంటామని చెప్పడం మరోసారి హీటెక్కెలా చేసింది.
ఈ వ్యాఖ్యలే టీడీపీలో ఆశలు పెంచేలా చేశాయి. పొత్తులో భాగంగా సీటు త్యాగం చేశానన్న ఎస్వీఎస్ఎన్ వర్మ.. పవన్ పోటీ చేయకపోతే తాను బరిలో ఉంటానన్నారు. పవన్ బరిలో నిలిస్తే రక్తం ధారపోసైనా గెలిపించుకుంటాం.. కానీ వేరే వాళ్ల పల్లకీలు మోయడానికి సిద్ధంగా లేమన్నారు.
వర్మ కామెంట్లు జనసేన కేడర్‌ను అయోమయంలో పడేశాయి. పొత్తులో భాగంగా పిఠాపురంను జనసేనకు కేటాయించాక.. మళ్లీ టీడీపీ ఎలా పోటీకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. సీటు పాట్ల సంగతి పక్కనపెడితే.. పిఠాపురం సెగ్మెంట్ చుట్టూ ఏపీ రాజకీయం నడుస్తోంది. నిన్న పవన్ సమక్షంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు జనసేనలో చేరారు. దీనికి పోటీగా వైసీపీ కూడా చేరికల్ని స్పీడప్ చేసింది.
కొద్ది నెలలుగా జనసేనకు దూరంగా ఉంటోన్న శేషుకుమారిని వ్యూహాత్మకంగా పార్టీలో చేర్చుకుంది వైసీపీ. శేషు కుమారి గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పిఠాపురం బరిలో నిలిచారు. అయితే ఉదయ్‌ని ఇన్‌ఛార్జ్‌గా నియమించాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారామె. ఈ క్రమంలోనే వంగా గీత.. శేషుకుమారిని వెంటబెట్టుకుని తాడేపల్లికి తీసుకెళ్లారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు శేషుకుమారి.
పిఠాపురంలో గెలుపుని అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలిచేందుకు ఉన్న అన్ని అవకాశాలను అనుకూలంగా మలచుకుంటోంది. అటు జనసేన కూడా ఇక్కడ గెలిచి ప్రత్యర్థుల నోళ్లు మూయించాలని భావిస్తోంది. దీంతో పిఠాపురం పోరు ఆరంభంలోనే రసవత్తరంగా మారింది.