ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో.. ఎక్కడా కూడా అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే రాష్ట్ర, జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతీ వాహనాన్ని ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. సరైన డాక్యుమెంట్స్ లేని రూ. 50 వేలకు మించి నగదు, బంగారం, వెండి.. అలాగే అక్రమ మద్యం లాంటి వాటిని అక్కడికక్కడే సీజ్ చేసి.. గ్రీవెన్స్ సెల్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్తూరులోని యాదమరి బైపాస్ రోడ్‌లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. బెంగళూరు నుంచి నెల్లూరుకు ఓ పెళ్లి బృందం ఒక బస్సు, ఒక కారులో వెళ్తుండగా.. ఆ వాహనాలను ఆపి చెక్ చేశారు పోలీసులు. సరైన ఆధారాలు లేకపోవడంతో పెళ్లికూతురు సారె కోసం పంపుతున్న సుమారు 14 కేజీల వెండి వస్తువులను సీజ్ చేశారు చిత్తూరు టూ-టౌన్ పోలీసులు. సదరు వెండి వస్తువులు నెల్లూరుకు చెందిన ఫణీదర్ అనే వ్యక్తికి సంబంధించినవిగా పోలీసులు గుర్తించారు. అతడి దగ్గర వాటికి సంబంధించి సరైన బిల్లులు లేవని.. అందుకే స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెబుతుండగా.. పెళ్లి సారెను స్వాధీనం చేసుకోవడంతో అటు పెళ్లి బృందం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.