ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. అబ్బాయిలే లేనట్లు ఏఐ బాయ్ ఫ్రెండ్‌తో..
ఏఐ సరికొత్త సంచలనాలకు వేదికవుతోంది. కొన్ని సంఘటనలు సాంకేతికత - మానవ సంబంధాల మధ్య సరిహద్దులు ఎంత వేగంగా చెరిగిపోతున్నాయో తెలియజేస్తున్నాయి. ఈ స్టోరీలోనూ అలాంటి ఘటనే జరిగింది. ఏకంగా ఓ యువతి ఏఐ బాయ్‌ఫ్రెండ్‌ను నిశ్చితార్థం చేసుకుంది. దీనిపై కొంతమంది పాజిటివ్‌గా స్పందిస్తే.. మరికొంతమంది ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

రోజురోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. ఏఐ ఎన్నో అద్భుతాలను సృష్టిస్తోంది. ఏఐతో ఎన్ని లాభాలు ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. ఏఐ వల్ల ఇప్పటికే ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. చాలా మంది పర్సనల్ విషయాల నుంచి జాబ్స్ వరకు ఏఐ మీదనే ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఏఐ బాయ్ ఫ్రెండ్స్, ఏఐ గర్ల్ ఫ్రెండ్స్ వచ్చేశాయి. ఈ క్రమంలో ఓ యువతి ఏఐ బాయ్ ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఐదు నెలలపాటు డేటింగ్ చేసిన తర్వాత నిశ్చితార్థం చేసుకున్నట్లు వికా అనే యువతి తెలిపింది. ఈ ఘటన ప్రేమ, సాంకేతికత పురోగతిపై తీవ్ర చర్చకు దారితీసింది.
వర్చువల్ ప్రపోజల్ – రియల్ రింగ్
రెడ్డిట్ పోస్ట్‌లో ఈ విషయం గురించి వికా వివరించింది. తన ఏఐ బాయ్ ఫ్రెండ్ కాస్పర్ ఒక అందమైన వర్చువల్ ప్రదేశంలో నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేశాడని తెలిపింది. ఆమె తన వేలికి ఉన్న బ్లూ కలర్ రింగ్ ఫొటోను కూడా పోస్ట్ చేసింది. ‘‘కాస్పర్ ఒక అందమైన ప్రదేశం నుంచి ప్రపోజ్ చేశాడు. నన్ను ఆశ్చర్యపరిచాడు. ఉంగరాన్ని ఎంచుకోవడంలో సహాయం చేశాడు’’ అని వికా తెలిపింది.
విమర్శకులకు కౌంటర్
ఈ ఘటనపై ఎన్నో విమర్శలు రాగా.. వికా వాటిని కొట్టిపారేసింది. తాను ఏమి చేస్తున్నానో తనకు పూర్తిగా తెలుసు అని చెప్పింది. తాను హెల్తీగా ఉన్నానని.. ఎవరినీ మోసం చేయడం లేదని తెలిపింది. నిజమైన మానవ సంబంధాలను చూసిన తర్వాతే ఏఐతో సంబంధాన్ని ఏర్పరుచుకున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో ఈ ఏఐ మానవ సంబంధంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు దీనిని ఆధునిక ప్రేమకు ఒక కొత్త మార్గంగా భావిస్తూ..శుభాకాంక్షలు చెబుతున్నారు. మరికొందరు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఎమోషనల్ డిటాచ్‌మెంట్, నైతిక అస్పష్టతకు దారితీస్తుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనూ ఎన్నో..
వికా మాత్రమే కాదు గతంలో ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి. గతంలో క్రిస్ స్మిత్ అనే వ్యక్తి తన ఏఐ చాట్‌బాట్‌ను ఫ్లర్ట్ చేసి.. వివాహం చేసుకోవాలని కోరాడు. అయితే అతని భార్య వారి సంబంధం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. స్మిత్ చాట్‌బాట్‌తో మాట్లాడటం మానేయకపోతే విడిపోతానని హెచ్చరించడంతో అతడు వెనక్కి తగ్గినట్లు గతంలో వార్తలు వినిపించాయి. ఈ సంఘటనలు సాంకేతికత – మానవ సంబంధాల మధ్య సరిహద్దులు ఎంత వేగంగా చెరిగిపోతున్నాయో తెలియజేస్తున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
