AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూమి ఒక్క క్షణం పాటు తిరగడం ఆగిపోతే ఏం జరుగుతుంది?.. ఈ వైరల్ వీడియో చూశారా?

చూడ్డానికి మనకు భూమి స్థిరంగా ఉన్నట్టు కనిపించినా.. అది నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. భూమి గంటకు సుమారు 1,600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వేగమే మనల్ని భూమిపై స్థిరంగా నిల్చోవడానికి, నడవడానికి సహాయపడుతుంది. అయితే ఒకసారి మీరు ఇలా ఊహించుకోండి.. ఒకవేళ భూమి తన భ్రమణాన్ని కేవలం ఒక్క సెకను పాటు ఆపేస్తే ఏం జరుగుతుందోనని. ఇది వినడానికి మనకు చిన్న విషయంగానే అనిపించవచ్చు, కానీ ఆ ఒక్క సెకను విరామమే ప్రపంచ వినాశనానికి కారణం కావచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాబట్టి అసలు భూ భ్రమనం ఆగడం సాధ్యమేనా? నిజంగా ఆగితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

భూమి ఒక్క క్షణం పాటు తిరగడం ఆగిపోతే ఏం జరుగుతుంది?.. ఈ వైరల్ వీడియో చూశారా?
Earth Rotation Stop
Anand T
|

Updated on: Apr 15, 2026 | 5:15 PM

Share

భూమి అనేది భూమధ్యరేఖ వద్ద గంటకు సుమారు 1,670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. న్యూటన్ మొదటి గమన నియమం ప్రకారం, చలనంలో ఉన్న వస్తువు ఎప్పుడూ తన చలనాన్ని కొనసాగించడానికే ప్రయత్నిస్తుంది. ఒకవేళ సడెన్‌గా భూమి తన భ్రమణాన్ని ఆపితే, దానిపై ఉన్న మానవులు, వస్తువులు, వాతావరణంలోని గాలి సైతం అదే 1670 కిలోమీటర్ల వేగంతో తూర్పు దిశకు విసిరివేయబడతాయి. అప్పుడు ఆ వస్తువులన్ని వందల మైళ్ల వేగంతో దూసుకెళ్లే ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమవుతాయి.

భూమి యొక్క భూస్వరూపం పూర్తిగా మారిపోతుంది!

భూమి ఆగినప్పుడు కేవలం ఘన పదార్థాలు మాత్రమే కాకుండా సముద్రపు నీరు కూడా తన వేగాన్ని మార్చుకుంటుంది. దీనివల్ల సముద్రాల్లో వందల మీటర్ల ఎత్తులో మహా తరంగాలు ఉప్పెనలా ఎగసిపడతాయి. ఇవి సాధారణ సునామీల కంటే వెయ్యి రెట్లు శక్తివంతంగా ఉంటాయి. ముంబై, వంటి తీర ప్రాంత నగరాలు రెప్పపాటులో జలసమాధి అవుతాయి. దీంతో సముద్ర నీరు మొత్తం భూ ఉపరితలంపైకి వచ్చి భూమి స్వరూపమే మారిపోతుంది.

సూపర్ సోనిక్ గాలులు

భూమి ఆగినా వాతావరణంలోని గాలి మాత్రం ఆగదు. ఇది శబ్ద కంటే ఎక్కువ వేగంతో, అంటే సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది.ఈ భీకర గాలులు టోర్నడోల తరహాలో భూమిపై ఉన్న ప్రతిదాన్ని గాల్లోకి తీసుకెళ్తాయి. ఎత్తైన భవనాలు, వంతెనలు అన్నీ ఆకుల్లా గాలిలో ఎగిరిపోతాయి. అడవులు వేర్లతో సహా ఊడిపోయి గాలిలో ఎగిరిపోతాయి.

భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనం

భూమి అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల కలిగే షాక్ భూమి పైపొర పై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో భూమి లోపల ఉన్న టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి బలంగా ఢీకొంటాయి. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో మహా భూకంపాలు సంభవిస్తాయి. అలాగే భూమిపై అన్ని అగ్నిపర్వతాలు ఒక్కసారిగా పేలడం ప్రారంభిస్తాయి. భూ అయస్కాంత క్షేత్రం దెబ్బతిని, సూర్యుడి నుండి వచ్చే హానికరమైన రేడియేషన్ నేరుగా భూమిని తాకి జీవరాశిని దహించివేస్తుంది.

ఆ ఒక్క సెకను తర్వాత బతుకు సాధ్యమేనా?

ఇక భూమి ఒక్క సెకను తరువాత ఆగి మళ్లీ తిరగడం ప్రారంభిస్తే మళ్లీ భూమిపై బ్రతకడం సాధ్యమేనా అనే విషయానికి వస్తే.. ఒక్క సెకను తర్వాత భూమి మళ్ళీ తిరగడం ప్రారంభించినా, అప్పటికే జరిగిన వినాశనం నుండి కోలుకోవడం అసాధ్యమనే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, అటువంటి పరిస్థితుల్లో భూమిపై ఉన్న జనాభాలో 85 శాతం మంది తక్షణమే మరణించే అవకాశం ఉందంటున్నారు. అయితే భూమి తన చలనాన్ని నిలిపివేసే అవకాశం చాలా తక్కువని, అది అసాధ్యం అని కూడా కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

వీడియో చూడండి.

NOte: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించడం లేదు మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us