Viral News: పొలంలో బావి మాయం.. వెతికిపెట్టాలని పోలీసులను ఆశ్రయించిన రైతు
Viral News- Well Missing: పొలంలో బావి కనిపించకుండా పోయిందని రైతు ఫిర్యాదు చేయడం కాస్త విడ్డూరంగా ఉన్నా.. దీని వెనుక అసలు స్టోరీ మాత్రం ఆసక్తిరేపుతోంది.
తమ పొలంలో ఇటీవల తవ్విన కొత్త బావి కనిపించడం లేదంటూ కర్ణాటకకు చెందిన ఓ రైతు పోలీసులను ఆశ్రయించారు. కనిపించకుండా పోయిన బావిని వెతికిపెట్టాలంటూ విన్నవించారు. పొలంలో బావి కనిపించకుండా పోయిందని రైతు ఫిర్యాదు చేయడం కాస్త విడ్డూరంగానే ఉన్నా.. దీని వెనుక అసలు స్టోరీ మాత్రం అందరిలో ఆసక్తిరేపుతోంది. బెళగావి జిల్లాలోని మావినహోండ గ్రామానికి చెందిన మల్లప్ప రామప్ప అనే రైతు తన కుమారులతో కలిసి రాయబాగ్ పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 3న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై ప్రభుత్వ అధికారులను కూడా కలిసి వినతిపత్రాలు సమర్పించారు. రైతు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కూడా అవాక్కయ్యారు. అసలు విషయం ఏంటని ఆరాతీశారు.
స్థానిక పంచాయితీ అధికారులు రైతు మల్లప్ప పొలంలో బావిని తవ్వినట్లు రికార్డు సృష్టించి ప్రభుత్వ నిధులు కాజేశారు. ఉపాధి హామీ పథకం కింద ఈ బావిని తవ్వేందుకు రూ.77,000 వ్యయం చేసినట్లు ఆ రికార్డుల్లో చూపారు. బావిని తవ్వేందుకు ఒక్క పైసా కూడా వెచ్చించకుండానే నకిలీ బిల్లులతో నిధులను మొత్తం స్వాహా చేశారు. విషయం తెలుసుకున్న రైతు మల్లప్ప..పంచాయితీ అధికారులకు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో కనిపిస్తున్న బావి…తన పొలంలో కనిపించడం లేదంటూ ఈ రకమైన ఫిర్యాదుతో పంచాయితీ అధికారుల నిర్వాకాన్ని ఎండగట్టారు.
40 ఏళ్లుగా తమ పొలంలో ఒక్కటే బావి ఉందని రైతు మల్లప్ప తెలిపారు.అయితే తమ పొలంలో కొత్తగా తవ్వినట్లు రికార్డుల్లో చూపిస్తున్న బావిని పోలీసులు, అధికారులు వెతికిపెట్టాలన్నారు. చేయని పని చేసినట్లు బిల్లులు చూపించి ఆ నిధులు స్వాహా చేసిన పంచాయితీ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. దీనిపై మీడియా ప్రతినిధులు స్థానిక పీడీవోను ప్రశ్నించగా…తాను వారం క్రితమే ఇక్కడ బాధ్యతలు చేపట్టానని.. విషయం తన దృష్టికి రాలేదని సెలవిచ్చారు.
Also Read..
ఊహించని గెటప్ లో యాంకర్ రవి.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో..
అట్టాంటి, ఇట్టాంటి దొంగ కాదు, ఫ్లైట్‌లో వస్తాడు, ఆవులను దొంగతనం చేస్తాడు.. మళ్లీ…