100 Civet Cats: పెళ్లి కూతురికి కట్నంగా 100 పునుగు పిల్లులు ఇచ్చిన తండ్రి..! అసలు విషయం ఏంటో తెలిస్తే..
కట్నం ఇవ్వటం, తీసుకోవటం రెండూ నేరమే అంటారు.. కానీ, ప్రతి ఆడపిల్ల పెళ్లిలోనూ కట్నం తప్పనిసరిగా ఉంటుంది. అమ్మాయి పెళ్లికి తల్లిదండ్రులు కట్నం కింద డబ్బులు, బంగారం, స్థలాలు వంటి అనేక రకాల కానుకలు ఇస్తుంటారు. కానీ, ఇక్కడ ఒక యువతి పెళ్లిలో మాత్రం ఆమె తండ్రి ఒక వింత కానుకను ఇచ్చాడు. కూతురి పెళ్లిలో కట్నం కింద డబ్బు, బంగారం వంటి ఆస్తులతో పాటుగా అత్యంత అరుదైన పునుగు పిల్లుల్ని కూడా ఇచ్చారు. అది ఒకటి రెండు కాదు.. ఏకంగా 100 పునుగు పిల్లుల్ని ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

వియత్నాంలో ఒక వధువుకు ఆమె తల్లిదండ్రులు అసాధారణమైన కట్నాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆడపిల్ల పెళ్లిలో కట్నంగా పెద్ద మొత్తంలో నగదు, కంపెనీ షేర్లు, అనేక అధిక-విలువైన రియల్ ఎస్టేట్ ఆస్తులు కూడా ఉన్న విపరీత కట్నాన్ని బహుకరించారు. అదేంటంటే.. నవ వధువుకు కట్నంగా 100 పునుగు పిల్లులను కట్నంగా పంపించాడు ఆమె తండ్రి..వినడానికి ఇది వింతగా అనిపించినప్పటికీ దీని వెనుక అసలు కారణం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే.. ఈ జంతువులు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన, ప్రత్యేకమైన కాఫీ తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి. వధువు తండ్రి తన కుమార్తె వ్యాపారం ప్రారంభించాలనుకుంటుందని, అందుకే ఇవన్నీ ఇచ్చానని చెప్పాడు.
ఈ కాఫీ తయారు చేయడానికి పునుగు పిల్లులకు పండిన కాఫీ గింజలను తినిపిస్తారు. తరువాత, వాటికి జీర్ణం కానీ గింజలను వాటి మలం నుండి తీసి ప్రాసెస్ చేస్తారు. ఈ ఖరీదైన కాఫీ పొడిని ఇలా తయారు చేస్తారు. కాబట్టి, ఈ కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా ఖరీదు ఎక్కువగా ఉంటుంది.
అయితే, ఇక్కడ నవవధుకు ఇచ్చిన 100 పునుగు పిల్లుల ఖరీదు సుమారు $70,000 (రూ. 60,05,454). దీనితో పాటు, కట్నంలో 25 బంగారు ఇటుకలు, రూ. 17 లక్షల నగదు, $ 11,500 (రూ. 9,86,610) విలువైన కంపెనీ వాటాలు, ఇతర ఆస్తులు కూడా ఉన్నాయి. ప్రతిగా వరుడి కుటుంబం వధువుకు 10 బంగారు ఇటుకలు, $ 7,600 (రూ. 6 లక్షలు) వజ్రాల ఆభరణాలను ఇచ్చింది.




