AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: గాల్లో ఎగురుతూ ఆఫీసుకు! అమెరికా వ్యక్తి వెరైటీ జర్నీ.. 20 నిమిషాల్లోనే డ్యూటీకి!

రోజూ ఆఫీసుకు వెళ్లాలంటే ట్రాఫిక్‌లో గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. బైక్‌లు, కార్లతో రోడ్లపై నరకం కనిపిస్తుంది. కానీ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఈ ట్రాఫిక్ కష్టాలకి పరిష్కారం కనిపెట్టాడు. కారులోనో, బైక్‌పైనో కాకుండా ఏకంగా గాల్లో ఎగురుతూ ఆఫీసుకు వెళ్తున్నాడు. అతడి ప్రయాణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు అతడి ఐడియాను చూసి ఆశ్చర్యపోతున్నారు.

Video: గాల్లో ఎగురుతూ ఆఫీసుకు! అమెరికా వ్యక్తి వెరైటీ జర్నీ.. 20 నిమిషాల్లోనే డ్యూటీకి!
Us Man Ditches Road Commutes To Work Using Paramotor
Sharada V
|

Updated on: Oct 17, 2026 | 8:16 AM

Share

అమెరికాలోని కొలరాడోకు చెందిన 28 ఏళ్ల జాకబ్ హట్జ్లర్ వృత్తిరీత్యా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా పనిచేస్తున్నాడు. విమానాల రాకపోకలను పర్యవేక్షించే బాధ్యతలు నిర్వర్తించే అతడు.. విమానాశ్రయానికి వెళ్లడానికి ఓ ప్రత్యేక మార్గాన్ని ఎంచుకున్నాడు. పారామోటార్‌ (Paramotor) సాయంతో గాల్లో ఎగురుతూ తన కార్యాలయానికి చేరుకుంటున్నాడు. పారామోటార్ అంటే మోటార్, ప్రొపెల్లర్‌తో ఉన్న బ్యాక్‌ప్యాక్‌ను వీపుపై తగిలించుకుని, పారాగ్లైడింగ్ రెక్కల సాయంతో గాల్లో ఎగిరే పరికరం. దీంతో ఎగరడానికి సాధారణ విమానంలా రన్‌వే అవసరం లేదు. అనువైన ప్రదేశం నుంచి పరుగెత్తుకుంటూ టేకాఫ్ తీసుకోవచ్చు. జాకబ్ తన ఇంటి సమీపంలోని ఖాళీ ప్రదేశం నుంచి పారామోటార్‌తో బయలుదేరి, తాను పనిచేసే విమానాశ్రయంలో ల్యాండ్ అవుతాడు.

కేవలం 20 నిమిషాల్లోనే ఆఫీసుకు!

జాకబ్ తన ప్రయాణ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అందులో ఇంటి నుంచి బయలుదేరే ముందు పారామోటార్ పరికరాలను సిద్ధం చేసుకోవడం, రెక్కలను నేలపై పరిచి మోటార్‌ను తనిఖీ చేయడం కనిపించింది. అనంతరం వీపుకు మోటార్ బ్యాక్‌ప్యాక్‌ను తగిలించుకుని కొద్దిదూరం పరుగెత్తి గాల్లోకి ఎగిరాడు. ఆ తర్వాత పచ్చని పొలాలు, బహిరంగ ప్రదేశాల మీదుగా ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించాడు. మధ్యలో కాళ్లను ఒకదానిపై మరొకటి వేసుకుని కూర్చున్నాడు. తన అపార్ట్‌మెంట్ సమీపంలోని రోడ్డు వరకు నడుచుకుంటూ వెళ్లడమే ఈ ప్రయాణంలో కష్టమైన పని అని సరదాగా చెప్పాడు. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత గాల్లోకి ఎగిరి కేవలం 20 నిమిషాల్లోనే కార్యాలయానికి చేరుకున్నాడు. ఆ తర్వాత తన పరికరాలను సర్దుకుని డ్యూటీకి వెళతాడు.

అతని పారామోటార్ ప్రత్యేకత ఏమిటంటే..

తాను ఉపయోగిస్తున్న పరికరాల వివరాలను జాకబ్ చెప్పాడు. పారాజెట్ మావెరిక్ (Parajet Maverick) మోటార్ సెటప్‌తో పాటు ఓజోన్ సిరోకో 3 (Ozone Sirocco 3) అనే 18 మీటర్ల రెక్కను ఉపయోగిస్తున్నట్లు తెలిపాడు. ఈ పరికరాల వల్ల వేగం, పనితీరు, నియంత్రణ మధ్య మంచి సమతుల్యత లభిస్తుందని వివరించాడు. ఎలాంటి రన్‌వే అవసరం లేకుండా గాల్లో ప్రయాణించడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభవమని తెలిపాడు.

‘ఇదే కదా అసలైన కూల్ జర్నీ!’

జాకబ్ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలను ప్రస్తావిస్తూ ఓ యూజర్.. ఇంధన ధరలు చూస్తుంటే చివరికి అందరూ ఇలాంటి ప్రయాణాలే చేయాల్సి వస్తుందేమోనని సరదాగా వ్యాఖ్యానించాడు. మరో వ్యక్తి.. తాను ఇప్పటివరకు చూసిన ప్రయాణాల్లో ఇదే అత్యంత అద్భుతమైన ఆఫీసు ప్రయాణమని ప్రశంసించాడు. ఇంకొకరు అసలు ఇలా వెళ్లడం చట్టబద్ధమేనా? తనకు కూడా ఇలాంటిది కావాలని ఆసక్తి వ్యక్తం చేశాడు. మరికొందరు.. ఇలాంటి ప్రయాణం సాధ్యమవుతుందని తమకు తెలియదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆలస్యంగా ఆఫీసుకు వస్తే ఏం చెబుతావు? ఈ రోజు ఆకాశంలో పక్షుల ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చెప్పుకుంటావా? అంటూ మరో నెటిజన్ చమత్కరించాడు.

చిన్నప్పటి నుంచే విమానాలంటే ఇష్టం

జాకబ్‌కు చిన్నతనం నుంచే ఎగరాలనే ఆసక్తి ఉండేది. అతని తాత చిన్న విమానంలో ప్రయాణాలకు తీసుకెళ్లేవారు. దాంతో విమానయానంపై మక్కువ పెరిగింది. కాలేజీలో చదువుతున్న సమయంలో పైలట్ లైసెన్స్ కూడా సంపాదించాడు. అయితే విమాన ప్రయాణాలకు అయ్యే ఖర్చు ఎక్కువ కావడంతో ఆ తర్వాత విమానాలు నడపడం మానేశాడు. ఓ యూట్యూబర్ పారామోటార్‌లో మెక్‌డొనాల్డ్స్‌కు వెళ్లి ఆహారం తెచ్చుకున్న వీడియోను చూశాడు. అప్పుడే తను కూడా పారామోటార్‌తో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాడు.  ప్రయాణానికి తగిన భద్రతా ఏర్పాట్లు, విమానయాన నిబంధనలను పాటిస్తూ జర్నీ చేస్తున్నాడు.  చిన్నప్పటి నుంచి ఉన్న ఎగరాలనే కలను సరికొత్తగా నెరవేర్చుకుంటూ.. ఇప్పుడు రోజూ గాల్లో ప్రయాణిస్తూ ఆఫీసుకు చేరుకుంటున్నాడు జాకబ్.  .

Follow Us