ఖాకీ డ్రెస్ వెనుక ఉన్న కరుణ… పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్కు శ్రీమంతం చేసిన సిబ్బంది!
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల అదుపు కోసం నిత్యం అత్యంత ఒత్తిడితో కూడిన వాతావరణంలో విధి నిర్వహణలో నిమగ్నమయ్యే పోలీసులు తమలో ఉన్న మానవీయ కోణాన్ని చాటుకున్నారు. తోటి ఉద్యోగి పట్ల తమకున్న ప్రేమాభిమానాలను, సొంత కుటుంబ బంధాన్ని చాటుతూ ఆదిబట్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది చేసిన ఒక మంచికార్యం ప్రస్తుతం అందరి మనసులను గెలుచుకుంటోంది.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో మానవీయత చాటుకున్నారు పోలీసులు. గత ఐదేళ్లుగా అఖిల అనే మహిళా కానిస్టేబుల్ అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తొమ్మిది నెలల గర్భవతి. కాగా, అఖిల జీవితంలోని ఈ మధురమైన ఘట్టాన్ని ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చేయాలని తోటి సిబ్బంది భావించారు. సీఐ ఎస్. రమేష్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే ఆమెకు అత్యంత ఘనంగా శ్రీమంతం వేడుకను నిర్వహించారు.
ఈ వేడుకలో ఆదిబట్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా ఒక కుటుంబంలా మారిపోయారు. సాంప్రదాయబద్ధంగా కానిస్టేబుల్ అఖిలకు చీర, గాజులు, పండ్లు, పువ్వులతో కూడిన సారెను అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం శాంతిభద్రతల విధుల్లో బిజీగా ఉండే స్టేషన్ వాతావరణం ఈ వేడుకతో ఒక్కసారిగా పండగ వాతావరణాన్ని సంతరించుకుంది.
మహిళా సిబ్బంది సంక్షేమానికి అండగా ఉంటాం – సీఐ రమేష్:
ఈ సందర్భంగా సీఐ ఎస్. రమేష్ మాట్లాడుతూ.. పురుష పోలీసులతో సమానంగా, ఎలాంటి సంకోచం లేకుండా నిరంతరం అంకితభావంతో విధులు నిర్వహించే మహిళా పోలీస్ సిబ్బందికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. వారి సంక్షేమం, మానసిక సంతోషం తమ బాధ్యతని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఐ ప్రసాద్, ఎస్సైలు మరియు ఇతర సిబ్బంది పాల్గొని కానిస్టేబుల్ అఖిలను ఆశీర్వదించారు.
కేవలం చట్టాన్ని అమలు చేయడానికే పరిమితం కాకుండా, తోటి సిబ్బంది సంతోషంలో పాలుపంచుకుంటూ మానవత్వాన్ని, కుటుంబ అనుబంధాన్ని చాటుకున్న ఆదిబట్ల పోలీసుల తీరుపై స్థానికులు, ఉన్నతాధికారులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.




