వీళ్లదో వింత ఆచారం.. పశువు రక్తం పాలలో కలిపి తాగితే పౌరుషం వస్తుందట!
ఆహారం, సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల్లో విభిన్నంగా ఉంటాయి. వినడానికి కొంత ఆశ్చర్యంగా, వింతగా అనిపించినప్పటికీ కొన్ని తెగల జీవితంలో అవి జీవన్మరణ సమస్యతో ముడిపడి ఉంటాయి. తూర్పు ఆఫ్రికాలోని మైదాన ప్రాంతాల్లో జీవించే మాసాయి తెగకు చెందిన వింత ఆహార సంప్రదాయం ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తూర్పు ఆఫ్రికాలోని కెన్యా, టాంజానియా సరిహద్దుల్లో నివసించే మాసాయి తెగ తమ వినూత్న, వింత ఆచారాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఈ తెగ ఆహార అలవాట్లు వైరల్గా మారాయి. వీరు తమకు అపారమైన శక్తిని, ప్రోటీన్లను, ఐరన్ను అందించే పానీయంగా భావించే ఒక ఆహారం ప్రస్తుతం విస్తృత చర్చనీయాంశంగా మారింది. ఆ ఆహారమే తమ శారీరక దృఢత్వానికి, మగతనానికి సంకేతంగా నిలుస్తుందని మాసాయి ప్రజలు విశ్వసిస్తారు. ఇంతకీ ఏంటా ఆహారం..? ఎందుకు అంత చర్చనీయాంశంగా మారింది.
జీవిని చంపరు.. కానీ రక్తం తాగుతారు:
మాసాయి తెగ ప్రజలకు పశువులు కేవలం ఆస్తి మాత్రమే కాదు.. వారి జీవితంలో అత్యంత పవిత్రమైన భాగం. సాధారణంగా వీరు మాంసం కోసం ఆవులను చంపరు. కానీ, శారీరక దృఢత్వం, ప్రోటీన్లు, ఐరన్ పోషకాల కోసం ఆవు రక్తాన్ని సేకరించి, దాన్ని ఆవు పాలలో కలిపి తాగుతారు. ఈ తెగ ప్రజలు ఆవుకు ఎలాంటి ప్రాణాపాయం లేదా తీవ్ర గాయం కాకుండా అత్యంత నైపుణ్యంతో రక్తాన్ని తీస్తారు.
మొదట ఆవు మెడ భాగంలో తాడుతో గట్టిగా కట్టి నరం స్పష్టంగా కనిపించేలా చేస్తారు. లిమిటర్ ఉన్న ప్రత్యేకమైన బాణంతో నరానికి చిన్న గాయం చేస్తారు. దీనివల్ల లోపలికి బాణం ఎక్కువగా గుచ్చుకోదు. లభించిన రక్తాన్ని ప్రత్యేకమైన సొరకాయ పాత్రల్లో సేకరిస్తారు. అవసరమైనంత రక్తం వచ్చిన వెంటనే తాడు విప్పేసి, ఆ గాయంపై మూలికా పసరు లేదా బూడిద పూస్తారు. దీంతో రక్తం వెంటనే ఆగిపోయి, ఆవు త్వరగా కోలుకుంటుంది.
ఇలా సేకరించిన రక్తం గడ్డకట్టకుండా దాన్ని నిరంతరం తిప్పుతూ, తాజా పాలలో కలిపి తాగుతారు. అడవుల్లో, కఠినమైన వాతావరణంలో జీవించడానికి ఈ పానీయం వారికి అపారమైన శక్తిని, రోగనిరోధక శక్తిని ఇస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా, వారి సంస్కృతిలో ఈ పానీయం తాగడం వీరత్వానికి, మగతనానికి, ఆరోగ్యానికి సంకేతంగా భావిస్తారు.
ఆధునిక కాలంలో సాంకేతికత ఎంత పెరిగినప్పటికీ, మాసాయి తెగ ప్రజలు తమ పశు సంపదను కాపాడుకుంటూ, వాటికి హాని తలపెట్టకుండా వేల ఏళ్ల నాటి తమ సాంప్రదాయ ఆహారపు అలవాట్లను నేటికీ కొనసాగిస్తుండటం విశేషం.




