వావ్.. రూ.150కే పట్టుచీర.. దేశంలోని ఈ హోల్‌సేల్ మార్కెట్ల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
చీరలంటే ఇష్టపడని భారతీయ మహిళలు ఉండరు. పండుగకైనా, పెళ్లికైనా, ఆఫీసుకైనా చీర ఇచ్చే అందమే వేరు. నాణ్యమైన చీరలు కొనాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని భయపడతారు. అయితే భారత్‌లో కొన్ని ప్రాంతాల్లో మీరు నమ్మలేనంత తక్కువ ధరలకే అద్భుతమైన చీరలు లభిస్తాయి. ఆ తక్కువ ధరల చీరల మార్కెట్లు ఎక్కడ ఉన్నాయి? వాటి ప్రత్యేకతలు ఏంటి? అనేది తెలుసుకుందాం..

భారతీయ సంస్కృతిలో చీర అంటే ఒక అపురూపమైన ఆభరణం. పెళ్లిళ్ల సీజన్ వచ్చినా, పండుగలు ఎదురైనా మహిళల చూపు ముందుగా చీరల పైనే ఉంటుంది. అయితే ఆధునిక ఫ్యాషన్ యుగంలో ట్రెండీగా, రిచ్‌గా కనిపించే చీరలను కొనాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని చాలామంది ఆందోళన చెందుతుంటారు. కానీ మన దేశంలోని కొన్ని చారిత్రాత్మక హోల్‌సేల్ మార్కెట్లకు వెళ్తే.. మీరు షోరూమ్‌లలో చూసే ఖరీదైన బనారసి, కాంచీవరం, డిజైనర్ చీరలు సగం కంటే తక్కువ ధరలకే లభిస్తాయి. ఢిల్లీలోని రాజసం ఉట్టిపడే చాందీనీ చౌక్ వీధుల నుండి, కోల్‌కతా సంప్రదాయాన్ని చాటే బుర్రా బజార్ సందుల వరకు.. తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన కలెక్షన్‌ను అందించే ఆ షాపింగ్ స్వర్గధామాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
చాందీనీ చౌక్ :
ఢిల్లీలోని చాందీనీ చౌక్ కేవలం స్ట్రీట్ ఫుడ్‌కే కాదు, దుస్తులకు కూడా ప్రపంచ ప్రసిద్ధి. ఇక్కడ బనారసి, పట్టు, కాటన్ నుంచి బాలీవుడ్ సెలబ్రిటీలు కట్టుకునే డిజైనర్ చీరల వరకు అన్నీ లభిస్తాయి. ఇక్కడ చీరలు కేవలం రూ.500 నుంచే ప్రారంభమవుతాయి. కినారీ బజార్, కత్రా నీల్ వంటి ప్రాంతాల్లో హోల్‌సేల్ ధరలకే సింగిల్ పీస్ చీరలను కూడా పొందవచ్చు. ఉదయం 10:00 నుండి రాత్రి 9:00 వరకు షాపులు ఓపెన్ ఉంటాయి. అయితే ప్రతి ఆదివారం మార్కెట్ మూసివేస్తారు.
కోల్‌కతా బుర్రా బజార్
బెంగాలీ చేనేత చీరలు లేదా నిత్యం ఆఫీసు వేర్ కోసం చీరలు కావాలంటే కోల్‌కతాలోని బుర్రా బజార్‌ను మించిన చోటు మరొకటి లేదు. వందలాది దుకాణాలు ఇక్కడ కొనుగోలుదారులకు రకరకాల ఆప్షన్లను అందిస్తాయి. కేవలం రూ.150 నుండి రూ.3000 మధ్యలోనే రోజువారీ, పార్టీ వేర్ చీరలు దొరుకుతాయి. బంధాని, సింథటిక్, సంప్రదాయ బెంగాలీ కాటన్ చీరలకు ఇది పెట్టింది పేరు. ఇక్కడ కూడా ఉదయం 10:00 నుండి రాత్రి 9:00 వరకు షాపులు ఓపెన్ ఉంటాయి. సేమ్ ఆదివారం మూసి ఉంటుంది.
మంగళదాస్ మార్కెట్
ముంబైలోని మంగళదాస్ మార్కెట్ ఇండో-వెస్ట్రన్, లేటెస్ట్ ప్రింటెడ్ చీరలకు ప్రసిద్ధి. ఇక్కడ ఒకే సందులో పదుల సంఖ్యలో దుకాణాలు ఉండి, పోటీపడి మరీ తక్కువ ధరలకు చీరలను అమ్ముతుంటాయి. జార్జెట్, పట్టు, బనారసి, ఆఫీస్ వేర్ చీరల్లో ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు ఇక్కడ ప్రత్యక్షమవుతాయి. ఇక్కడ ఉదయం 10:30 నుండి రాత్రి 8:00 వరకు షాపులు ఓపెన్ ఉంటాయి. ఇక్కడ కూడా ఆదివారం సెలవు ఉంటుంది.
షాపింగ్ చేసేటప్పుడు గమనించాల్సిన చిట్కాలు
బేరమాడటం: ఈ హోల్‌సేల్ మార్కెట్లలో బేరమాడటం చాలా ముఖ్యం. వారు చెప్పిన ధర కంటే 20-30శాతం తక్కువకే అడిగే అవకాశం ఉంటుంది.
గుంపులు: ఈ మార్కెట్లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి, కాబట్టి ఉదయాన్నే వెళ్లడం ఉత్తమం.
క్యాష్: చిన్న దుకాణదారులు ఎక్కువగా నగదునే ఇష్టపడతారు, కాబట్టి తగినంత నగదు వెంట ఉంచుకోవడం మంచిది.
