అమెరికాలో మాయమైన మహానగరం.. లండన్ కంటే గొప్పది? కానీ, చివరికి మిగిలింది సామూహిక హత్యల సంచలనం!
అమెరికా చరిత్రలో అట్లాంటిస్ ఆఫ్ ది ల్యాండ్‌గా పిలవబడే కహోకియా నగరం ఇప్పటికీ ఒక అంతుచిక్కని మిస్టరీ. క్రీ.శ. 1050 ప్రాంతంలో మిసిసిపీ నది ఒడ్డున వెలిసిన ఈ నగరం, అప్పట్లో లండన్ కంటే పెద్దదిగా ఉండేది. ఇక్కడి భారీ మట్టి పిరమిడ్లు, వింత ఆచారాలు, సామూహిక నరబలుల ఆనవాళ్లు శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేస్తున్నాయి. సుమారు 30,000 మంది జనాభాతో కళకళలాడిన ఈ నగరం, క్రీ.శ. 1350 నాటికి అకస్మాత్తుగా ఎందుకు ఖాళీ అయిపోయిందో నేటికీ ఎవరికీ తెలియదు. వాతావరణ మార్పులా లేక అంతర్గత యుద్ధాలా అనేది ఇప్పటికీ పరిశోధనల్లోనే ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ప్రపంచంలోని పురాతన నాగరికతల గురించి మాట్లాడేటప్పుడు మనం ఈజిప్ట్, మెసొపొటేమియా గురించి చెప్పుకుంటాం. కానీ, అమెరికాలో ఒకప్పుడు లండన్, పారిస్ నగరాల కంటే వైభవంగా వెలిసిన కహోకియా అనే నగరం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. దీనిని చరిత్రకారులు అట్లాంటిస్ ఆఫ్ ది ల్యాండ్ అని పిలుస్తారు. ప్రస్తుత సెయింట్ లూయిస్ సమీపంలో ఉన్న ఈ నగరం, క్రీ.శ 1050 నుండి 1200 మధ్య కాలంలో అత్యున్నత స్థితిలో ఉండేది. ఇక్కడి ప్రజలు మట్టితో భారీ పిరమిడ్లను (Mounds) నిర్మించారు. వీటిలో మాంక్స్ మౌండ్ అత్యంత ప్రసిద్ధమైనది. ఇది దాదాపు 100 అడుగుల ఎత్తుతో 14 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ నిర్మాణాలు ఆ కాలపు ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. కానీ, ఈ నగరం ఘనమైన చరిత్ర వెనుక, తవ్వకాలలో కనుగొనబడిన సామూహిక సమాధుల ద్వారా వెల్లడైన ఒక భయంకరమైన, చీకటి నిజం ఉంది.
ఈ నగరం ఎలా ఉండేది..?:
సుమారు 11వ శతాబ్దంలో కహోలియా దాని ఉచ్ఛస్థితిలో ఉండేది. దాని జనాభా 10,000 నుండి 20,000 మధ్య ఉండేది. ఇది ఆ కాలంలోని లండన్ జనాభాకు సమానం. ఆ నగరం అస్తవ్యస్తంగా ఏర్పడిన నివాస ప్రాంతం కాదు, ఒక ప్రణాళికాబద్ధమైనది. అక్కడి ప్రజలు కేవలం రైతులు లేదా వేటగాళ్ళు మాత్రమే కాదు, వారికి ఖగోళ శాస్త్రంలో కూడా మంచి పరిజ్ఞానం ఉండేది. వారు సూర్యుని స్థానాన్ని కొలవడానికి పెద్ద చెక్క స్తంభాలను నిలబెట్టారు. 120 భారీ మట్టి దిబ్బలను నిర్మించారు. వాటిలో అతిపెద్దది 100 అడుగుల ఎత్తులో ఉంటుంది.
పురావస్తు శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారు?:
కహోకియా తవ్వకాల్లో వెలుగుచూసిన కొన్ని విషయాలు భయం గొల్పుతాయి. ఈ తవ్వకాలలో పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నది ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. యువతుల మృతదేహాలతో నిండిన ఒక భారీ సామూహిక సమాధి బయటపడింది. ముఖ్యంగా మౌండ్ 72 వద్ద జరిపిన పరిశోధనల్లో వందలాది మంది అస్థిపంజరాలు బయటపడ్డాయి. వీరిలో ఎక్కువ మంది యువతులు ఉండటం గమనార్హం. ఈ మహిళలను గొంతు నులిమి చంపారని లేదా వారి రక్తాన్ని పూర్తిగా తీసివేసి బలి ఇచ్చారని దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాకుండా, కొంతమంది పురుషుల చేతులు నరికివేయబడగా, మరికొందరిని కొట్టి చంపినట్లు కనుగొన్నారు. ఈ హింసను బయటి శత్రువులు కాకుండా, తమ అధికారాన్ని నిరూపించుకోవడానికి నగరంలోని పలుకుబడి ఉన్న వ్యక్తులే పాల్పడ్డారని నిపుణులు భావిస్తున్నారు. తమ దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి లేదా మతపరమైన ఆచారాల్లో భాగంగా ఇక్కడ సామూహిక నరబలులు ఇచ్చేవారని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది ఆ నగరంలోని క్రూరమై, సంక్లిష్టమైన సామాజిక వ్యవస్థను సూచిస్తుంది.
అంత పెద్ద నగరం ఎలా అదృశ్యమైంది?:
కొలంబస్ అమెరికాకు చేరుకోవడానికి ముందే, అంటే 1350వ సంవత్సరం నాటికే ఆ నగరం పూర్తిగా నిర్జనమైపోవడం ఇక్కడి అతిపెద్ద రహస్యం. ఆశ్చర్యకరంగా, స్థానిక ఆదివాసుల జానపద కథలలో ఈ నగరం గురించి ప్రస్తావనే లేదు. ఇక్కడ ఏదో జరిగి ప్రజలలో విద్వేషాన్ని రేకెత్తించిందని, దానివల్లే వారు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక్కడ యుద్ధానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించనప్పటికీ, నగరంపై జరిగిన మూడు ముట్టడులు, ఎల్లప్పుడూ దాడి జరుగుతుందనే భయం ఉండేదని సూచిస్తున్నాయి.
అంత వైభవంగా ఉన్న నగరం అకస్మాత్తుగా ఎందుకు అంతమైపోయిందనే దానిపై భిన్న వాదనలు ఉన్నాయి. మిసిసిపీ నదికి వచ్చిన భారీ వరదలు, అడవుల నరికివేత వల్ల ఏర్పడిన పర్యావరణ నష్టం, కరువు లేదా అంతర్గత తిరుగుబాట్లు దీనికి కారణమై ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఏ ఒక్క కారణం కూడా దీనిని పూర్తిగా నిరూపించలేకపోయింది. అమెరికా గడ్డపై విలసిల్లిన ఈ గొప్ప నాగరికత ఎందుకు కనుమరుగైందో ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యమే. నేటికీ, సెయింట్ లూయిస్ సమీపంలో కహోలియాకు చెందిన మట్టి దిబ్బలను చూడవచ్చు.




