తల లేకుండా 18 నెలలు బతికేసిన కోడి.. ఓనర్‌కు కోట్లు కుమ్మరించింది..! మిరాకిల్ మైక్ అసలు సీక్రెట్ ఇదేనట?
ప్రకృతిలో ఒక్కోసారి ఊహకందని వింతలు జరుగుతుంటాయి. అలాంటి ఒక వింతే 80 ఏళ్ల క్రితం అమెరికాలో చోటుచేసుకుంది. సాధారణంగా ఏ జీవికైనా తల తెగిపోతే కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయి. కానీ, మైక్ అనే కోడి పుంజు మాత్రం తల లేకుండా ఏకంగా 18 నెలల పాటు జీవించి ప్రపంచ రికార్డు సృష్టించింది. తల లేకుండా ఏడాదిన్నర పాటు జీవించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక కోడి పుంజు కథ నేటికీ ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతూనే ఉంది. ఆ వివరాల్లేంటో ఇప్పుడు చూద్దాం..

తల లేకుండా 18 నెలల పాటు జీవించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక కోడి పుంజు కథ ఇది. అమెరికాలోని కొలరాడోలో జరిగిన ఒక వింత సంఘటన మిరాకిల్ మైక్ అనే తల లేని కోడి కథ తెలిస్తే ఆశ్చర్యంతో నోరెళ్ల బెడతారు. అది 1945 సెప్టెంబర్ 10న కొలరాడోకు చెందిన లాయిడ్ ఓల్సన్ అనే రైతు తన ఫామ్‌లో కోళ్లను కోస్తున్నాడు. మైక్ అనే కోడి తలపై గొడ్డలితో వేటు వేయగా, దాని తల వేరుపడింది. కానీ, ఆశ్చర్యకరంగా ఆ కోడి చనిపోకుండా, వెంటనే లేచి మామూలుగా నడవడం, అటూ ఇటూ పరిగెత్తడం మొదలుపెట్టింది. ఓల్సన్ దానిని రాత్రంతా ఒక పాత పెట్టెలో ఉంచాడు. మరుసటి రోజు ఉదయం కూడా అది ప్రాణాలతో ఉండటాన్ని చూసి ఓల్సన్ నివ్వెరపోయాడు. మైక్ అద్భుతం ఇక్కడే మొదలైంది.
సైంటిస్టులు దీనిని పరిశీలించినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. గొడ్డలిని ఉపయోగించిన తీరు వల్ల మైక్ చెవులు, మెదడు కాండంలో చాలా భాగం చెక్కుచెదరకుండా మిగిలిపోయాయి. కోడి మెదడు దాని తల వెనుక భాగంలో ఉంటుంది. ఇది శ్వాస, గుండె కొట్టుకోవడం, జీర్ణక్రియ వంటి ప్రాథమిక విధులను నియంత్రిస్తుంది. గొడ్డలి వేటు వేసినప్పుడు కోడి మెదడులో శ్వాస, గుండె వేగం, జీర్ణక్రియను నియంత్రించే బ్రెయిన్ స్టెమ్ (Brain Stem) అనే భాగం దెబ్బతినలేదు. అలాగే, తల తెగిన వెంటనే రక్తం గడ్డకట్టడంతో రక్తస్రావం ఆగిపోయి అది ప్రాణాలతో బయటపడింది. ఓల్సన్ ఆ కోడికి ఒక డ్రాపర్ ద్వారా నేరుగా ఆహార వాహికలోకి ద్రవ ఆహారాన్ని, నీటిని పంపిస్తూ దానిని సంరక్షించాడు.
ఈ వార్త దావాగ్నంలా వ్యాపించడంతో మైక్ రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది. ఓల్సన్ దీనిని అమెరికా అంతటా ప్రదర్శనలకు తీసుకువెళ్లగా, వేలాది మంది ప్రజలు టికెట్లు కొనుక్కుని మరీ ఈ వింతను చూశారు. లైఫ్ మ్యాగజైన్ వంటి ప్రముఖ పత్రికలు దీనిపై కథనాలు ప్రచురించాయి. మైక్ ద్వారా ఆ రైతు కుటుంబం అప్పట్లోనే మంచి ఆదాయాన్ని గడించింది. దురదృష్టవశాత్తు, 1947లో ఒక హోటల్‌లో ఉన్నప్పుడు మైక్ గొంతులో శ్లేష్మం అడ్డుపడి ఊపిరాడక చనిపోయింది. దానిని శుభ్రం చేసే సిరంజి ఓల్సన్ వద్ద లేకపోవడంతో ఆ అద్భుత జీవి మరణించింది. తల లేకుండా అంతకాలం జీవించిన ఏకైక జీవిగా మైక్ చరిత్రలో నిలిచిపోయింది. నేటికీ కొలరాడోలో మైక్ జ్ఞాపకార్థం ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.




