AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: యుద్ధవిమానం నడిపిన థాయ్‌లాండ్ రాణి .. సోలో ఫ్లైట్‌తో సంచలనం!

థాయ్‌లాండ్ రాణి సుతిదా తన విమానయాన కెరీర్‌లో మరో ఘనత సాధించారు. యుద్ధవిమానంలో తొలిసారి ఒంటరిగా ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విమాన ప్రయాణం విజయవంతంగా పూర్తయిన తర్వాత రాణిని అభినందిస్తూ ఆమె భర్త, థాయ్‌లాండ్ రాజు మహా వజిరలాంగ్‌కోర్న్ పుష్పగుచ్ఛంతో పాటు ప్రత్యేక గుర్తింపును అందించారు.

Video: యుద్ధవిమానం నడిపిన థాయ్‌లాండ్ రాణి .. సోలో ఫ్లైట్‌తో సంచలనం!
Thailand Queen Makes First Solo Flight In Fighter Jet
Sharada V
|

Updated on: Oct 09, 2026 | 6:28 PM

Share

థాయ్‌లాండ్‌లోని దక్షిణ ప్రాంతమైన సూరత్ థానీ ప్రావిన్స్‌లో ఉన్న వింగ్ 7 ఎయిర్‌బేస్‌లో గురువారం, అక్టోబర్ 8న ఈ విమాన ప్రయాణం జరిగింది. స్వీడన్‌లో తయారైన గ్రిపెన్ అనే సింగిల్ సీట్ యుద్ధవిమానంలో రాణి సుతిదా ప్రయాణించారు. ఇంతకుముందు రెండు సీట్లు ఉన్న యుద్ధవిమానం నడిపిన ఆమె.. ఈసారి ఒకే సీటు ఉన్న యుద్ధ విమానంలో తొలిసారి ఒంటరిగా ప్రయాణించారు. రాణి సుతిదా విజయానికి రాజు మహా వజిరలాంగ్‌కోర్న్ ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. ఆమె విమాన ప్రయాణం పూర్తయిన తర్వాత పుష్పగుచ్ఛాన్ని అందించి అభినందించారు. గ్రిపెన్ యుద్ధ విమానాన్ని నడిపినవారికి సంబంధించిన ప్రత్యేక గుర్తింపు ‘గ్రిపెన్ ఆర్డర్ గోల్డెన్ ప్యాచ్‌’ను కూడా అందజేశారు.

రాణికి 1,188 గంటల విమాన ప్రయాణ అనుభవం

రాణి సుతిదాకు విమానయాన రంగంలో మంచి అనుభవం ఉంది. ఇప్పటివరకు వివిధ రకాల విమానాల్లో కలిపి 1,188 గంటల పాటు ప్రయాణించారు. సెస్నా, పిలాటస్, పైపర్ వంటి చిన్న విమానాలతో పాటు బోయింగ్ 737 ప్యాసింజర్ విమానాలను కూడా నడిపారు. 2010 లొ సెస్నా విమానాన్ని నడపడంతో ఆమె పైలట్ ప్రయాణం ప్రారంభమైంది.

రాజుతో కలిసి విమాన ప్రయాణాలు

రాణి సుతిదా రాజుతో కలిసి దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల్లో కో-పైలట్‌గా కూడా వ్యవహరించారు. రాజకుటుంబ అధికారిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన విమాన ప్రయాణాల్లో ఆమె తన బాధ్యతలు నిర్వర్తించారు. గత ఏడాది ఏప్రిల్‌లో భూటాన్ పర్యటన సందర్భంగా రాజు, రాణి కలిసి రాజకుటుంబ విమానాన్ని నడిపారు. ఆ విమానం పారో విమానాశ్రయంలో దిగింది. పర్వత ప్రాంతంలో ఉండటం, విమానం దిగే మార్గం క్లిష్టంగా ఉండటంతో పారో విమానాశ్రయం ప్రపంచంలోని సవాళ్లతో కూడిన విమానాశ్రయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇలా పౌర విమానాలు, ప్రయాణికుల విమానాలు, సైనిక యుద్ధ విమానాలపై అనుభవం సంపాదించిన రాణి సుతిదా.. ఇప్పుడు యుద్ధవిమానాన్ని సోలోగా నడిపి మరో అరుదైన ఘనత సాధించారు.

Follow Us