India vs China: అమెరికా యూనివర్సిటీల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో టాప్ ఎవరు..?
India vs China Students in USA: అమెరికా యూనివర్సిటీల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటికేడు పెరుగుతుండగా.. ఈ విషయంలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 2024–25 విద్యా సంవత్సరంలో అమెరికాలోని యూనివర్సిటీల్లో 3.63 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించారు. భారత్ తర్వాత చైనా రెండో స్థానంలో కొనసాగుతోంది. అమెరికాకు అత్యధిక మంది విద్యార్థులను పంపుతున్న టాప్ 10 దేశాల జాబితాలో ఏయే దేశాలు ఉన్నాయో తెలుసుకోండి.

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా యూనివర్సిటీల్లో అత్యధిక మంది విదేశీ విద్యార్థులు ఏ దేశం నుంచి వస్తున్నారు? భారత్ అగ్రస్థానంలో ఉందా? చైనా రెండో స్థానానికి పడిపోయిందా? అనే ఆసక్తికరమైన వివరాలు తాజా అంతర్జాతీయ విద్యా గణాంకాల్లో వెల్లడయ్యాయి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (IIE) విడుదల చేసిన ఓపెన్ డోర్స్ 2025 నివేదిక ప్రకారం.. 2024–25 విద్యా సంవత్సరంలో అమెరికా ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకున్న అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య సుమారు 11.78 లక్షలకు చేరింది. వీరిలో అత్యధిక మంది భారతదేశం నుంచి వచ్చినవారే కావడం విశేషం.
టాప్-10 దేశాలు ఇవే..
2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన గణాంకాల ప్రకారం..అమెరికాలోని యూనివర్సిటీల్లో చదువుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 3,63,019కి చేరింది. అంతకుముందు విద్యా సంవత్సరంతో పోలిస్తే ఇది 9.5 శాతం అధికం. మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో 30.8 శాతంతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు, చైనా నుంచి వచ్చిన విద్యార్థుల సంఖ్య 2,65,919గా (22.58 శాతం వాటా) నమోదుకాగా.. ఆ దేశం రెండో స్థానంలో ఉంది. దక్షిణ కొరియా (42,293), కెనడా (29,903), వియత్నాం (25,584), నేపాల్ (24,890), తైవాన్ (23,263), నైజీరియా (21,847), బంగ్లాదేశ్ (20,156), బ్రెజిల్ (17,277) తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
భారత్ అగ్రస్థానంలోకి ఎలా వచ్చింది?
గతంలో అమెరికాకు అత్యధిక మంది విద్యార్థులను పంపే దేశంగా చైనా ఉండేది. అయితే 2023–24 విద్యా సంవత్సరంలో భారత్ చైనాను అధిగమించి మొదటి స్థానానికి చేరుకుంది. 2024–25లోనూ భారత్ అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. భారతీయ విద్యార్థుల సంఖ్య పెరగగా, చైనా విద్యార్థుల సంఖ్య తగ్గడం ఈ మార్పులో కీలకంగా నిలిచింది. అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సులకు మంచి ఆదరణ ఉంది. 2024–25లో అంతర్జాతీయ విద్యార్థుల్లో 57 శాతం మంది ఈ కోర్సుల్లో చదువుకున్నారు. మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాలు అత్యంత ప్రజాదరణ పొందిన కోర్సులుగా నిలిచాయి
అమెరికా యూనివర్సిటీలకు భారతీయ విద్యార్థులు ప్రధాన వనరుగా మారారు. ఉన్నత విద్యతో పాటు ఉద్యోగ అనుభవం పొందేందుకు కూడా చాలామంది అమెరికాను ఎంచుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మారిన వీసా నిబంధనలు, యూనివర్సిటీల ఫీజులు, జీవన వ్యయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులు తమ విదేశీ విద్యా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
