AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Economy: ఆసియా దేశాల ఆర్థిక వృద్ధిలో తైవాన్ టాప్.. భారత్ స్థానం ఎంతంటే..?

2026లో ఆసియాలో అత్యంత వేగంగా వృద్ధి చెందనున్న దేశాల జాబితాను ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ విడుదల చేసింది. ఈ జాబితాలో తైవాన్‌ ఆసియా దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ ఆరో స్థానంతో ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. సాంకేతిక రంగం, పెట్టుబడులు, సేవల ఎగుమతులు ఆసియా దేశాల ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయి.

Asia Economy: ఆసియా దేశాల ఆర్థిక వృద్ధిలో తైవాన్ టాప్.. భారత్ స్థానం ఎంతంటే..?
Taiwan GrowthImage Credit source: Pexels
Janardhan Veluru
|

Updated on: Oct 09, 2026 | 6:29 PM

Share

ఆసియా దేశాల ఆర్థిక వృద్ధి (GDP)పై ఆసక్తికరమైన అంచనాలు వెలువడ్డాయి. 2026లో అత్యంత వేగంగా వృద్ధి చెందనున్న ఆర్థిక వ్యవస్థగా తైవాన్‌ నిలిచే అవకాశముందని అంచనా. భారత్‌ కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాల జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ADB) సెప్టెంబర్‌ 2026 అంచనాల ఆధారంగా రూపొందించిన ఆసియా దేశాల ఆర్థిక వృద్ధి అంచనాల జాబితాలో భారత్‌ ఆరో స్థానంలో నిలిచింది.

ఆసియాలో వేగంగా వృద్ధి చెందుతున్న టాప్‌ 10 ఆర్థిక వ్యవస్థలు

2026లో వాస్తవ జీడీపీ (GDP) వృద్ధి అంచనాల ప్రకారం 11.0 శాతం వృద్ధితో తైవాన్ అగ్రస్థానంలో నిలచే అవకాశముంది. రెండో ర్యాంకులో కిర్గిజ్‌స్థాన్‌ (8.9 శాతం వృద్ధిరేటు), మూడో ర్యాంకులో వియత్నాం (7.8శాతం), నాలుగో ర్యాంకులో తజికిస్థాన్ (7.0శాతం), ఐదో ర్యాంకులో ఉజ్బెకిస్థాన్ (7.0 శాతం) నిలిచాయి. 7.0శాతం వృద్ధి రేటు అంచనాతో భారత్ ఆరో ర్యాంకులో నిలిచింది. ఏడో ర్యాంకులో భూటాన్ (6.5 శాతం), ఎనిమిదో ర్యాంకులో జార్జియా (6.3 శాతం), తొమ్మిదో ర్యాంకులో తుర్క్‌మొనిస్థాన్ (6.3 శాతం), పదో ర్యాంకులో మంగోలియా (5.7 శాతం) నిలిచాయి.

అగ్రస్థానంలో తైవాన్‌.. ఎందుకింత వృద్ధి?

తైవాన్‌ 11 శాతం వృద్ధి రేటుతో ఆసియాలో మొదటి స్థానంలో నిలవనుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), సెమీకండక్టర్లు, అధునాతన సాంకేతిక ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌ తైవాన్‌ ఆర్థిక వృద్ధికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ముఖ్యంగా AI సాంకేతికతకు అవసరమైన చిప్స్‌ ఎగుమతులు ఆ దేశానికి మద్దతుగా నిలుస్తున్నాయి. రెండో స్థానంలో ఉన్న కిర్గిజ్‌స్థాన్‌ 8.9 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా. వియత్నాం 7.8 శాతం వృద్ధితో మూడో స్థానంలో ఉంది. తయారీ రంగం, ఎగుమతులు, దేశీయ డిమాండ్‌ వియత్నాం ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

భారత్‌ ఆరో స్థానంలో ఉండటానికి కారణాలేంటి?

భారత్‌ 7 శాతం వృద్ధితో ఆరో స్థానంలో నిలిచింది. భారత్‌లో పెట్టుబడుల డిమాండ్‌, సేవల రంగం ఎగుమతులు ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నాయని అంచనాలు సూచిస్తున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్‌ ఈ స్థాయిలో వృద్ధిని కొనసాగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, జీడీపీ వృద్ధి శాతం ఆధారంగా ఇచ్చే ర్యాంకింగ్‌ను దేశాల మొత్తం ఆర్థిక పరిమాణంతో పోల్చకూడదు. చిన్న ఆర్థిక వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందడం వల్ల అధిక శాతాన్ని నమోదు చేసే అవకాశం ఉంటుంది.

ఆసియా ఆర్థిక వృద్ధికి సవాళ్లు

ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు అంచనాల ప్రకారం, 2026లో అభివృద్ధి చెందుతున్న ఆసియా, పసిఫిక్‌ ప్రాంత ఆర్థిక వ్యవస్థలు మొత్తంగా 5 శాతం వృద్ధి చెందే అవకాశముంది. అయినప్పటికీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితి, ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు, వాతావరణ సంబంధిత పరిణామాలు వృద్ధిపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

Follow Us