AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్కెట్​లోకి Fortuner కంటే పెద్ద SUV.. కొత్త Nissan Terrano డిజైన్​ చూస్తే ఫిదా కావాల్సిందే

ప్రముఖ కార్ల తయారీ సంస్థ Nissan తన కొత్త Terrano SUVతో ఆటోమొబైల్ మార్కెట్లోకి మరోసారి ఆసక్తికరమైన మోడల్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన Beijing Auto Showలో ఈ SUVని తొలిసారిగా కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించింది. తొలుత Plug-in Hybrid (PHEV) మోడల్‌గా పరిచయమైన ఈ వాహనంలో ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు కూడా అందుబాటులోకి రానున్నట్లు వెల్లడైంది. చైనా పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MIIT) విడుదల చేసిన వివరాలతో ఈ SUVకి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి.

మార్కెట్​లోకి Fortuner కంటే పెద్ద SUV.. కొత్త Nissan Terrano డిజైన్​ చూస్తే ఫిదా కావాల్సిందే
Nissan Terrano Suv.
Nikhil
|

Updated on: Nov 28, 2026 | 7:45 PM

Share

కొత్త Nissan Terrano ప్రత్యేకమైన బాక్సీ డిజైన్‌తో పాటు భారీ పరిమాణంతో ఆకట్టుకుంటోంది. దీని పొడవు 5,098 మి.మీ., వీల్‌బేస్ 2,850 మి.మీ.గా ఉంది. Toyota Fortunerతో పోలిస్తే ఇది పెద్ద SUVగా నిలుస్తోంది. Fortuner పొడవు 4,795 మి.మీ., వీల్‌బేస్ 2,745 మి.మీ.గా ఉంది. Nissan Frontier Pro పికప్ ఆధారంగా రూపొందించిన లాడర్-ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్‌పై ఈ కొత్త SUV తయారవుతోంది.

మూడు ఇంజిన్ ఆప్షన్లతో..

Nissan Terranoలో పెట్రోల్, డీజిల్, Plug-in Hybrid (PHEV) అనే మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. పెట్రోల్ వెర్షన్‌లో 2.0 లీటర్ టర్బో ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 258 PS పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ మోడల్‌లో 2.3 లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో ఇంజిన్ ఉండగా, ఇది 190 PS పవర్‌ను అందిస్తుంది.

PHEV వెర్షన్‌లో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 78 PS పవర్ అందించే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ రెండు కలిపి 272 PS కంబైన్డ్ పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇందులో Lithium Iron Phosphate (LFP) బ్యాటరీని ఉపయోగించనున్నారు. అయితే బ్యాటరీ సామర్థ్యాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. పెట్రోల్, డీజిల్ మోడళ్ల గరిష్ఠ వేగం గంటకు 170 కి.మీ. కాగా, PHEV వెర్షన్ గంటకు 180 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. అన్ని వేరియంట్లలో 2,500 కిలోల టోయింగ్ సామర్థ్యం ఉంటుంది. 36 డిగ్రీల అప్రోచ్ యాంగిల్, 31 డిగ్రీల డిపార్చర్ యాంగిల్ కూడా ఉన్నాయి.

బాక్సీ డిజైన్..

డిజైన్ పరంగా Nissan Terranoకు నిటారుగా ఉండే ఫ్రంట్ ప్రొఫైల్, ప్రత్యేకమైన లైటింగ్ ఎలిమెంట్లు, NISSAN అక్షరాలతో కూడిన ముందు భాగం, రగ్గడ్ బంపర్ ఇచ్చారు. సైడ్‌లో స్క్వేర్ వీల్ ఆర్చెస్, ఫ్లాట్ రూఫ్‌లైన్, రూఫ్ రెయిల్స్, సైడ్ స్టెప్స్, పెద్ద అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక భాగంలో నిలువుగా అమర్చిన టెయిల్ ల్యాంప్స్, స్పేర్ వీల్, భారీ బంపర్ కనిపిస్తున్నాయి. PHEV వెర్షన్‌లో బ్లాక్ ఫినిషింగ్ టెయిల్‌గేట్ ఉండగా, పెట్రోల్, డీజిల్ మోడళ్లలో బాడీ కలర్ టెయిల్‌గేట్ అందించారు.

ఇంటీరియర్ వివరాలను Nissan ఇంకా వెల్లడించలేదు. అయితే Frontier Pro నుంచి 10 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది. సన్‌రూఫ్, టో హిచ్, రియర్ స్పాయిలర్ వంటి ఆప్షన్లు కూడా ఉండవచ్చని అంచనా. చైనాలో Zhengzhou Nissan జాయింట్ వెంచర్ ఈ SUVని తయారు చేయనుంది. చైనాతో పాటు లాటిన్ అమెరికా, ASEAN దేశాలు, మిడిల్ ఈస్ట్ మార్కెట్లలో విక్రయించనున్నారు. భారత్‌లోనూ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. Nissan India పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా 2027 లేదా 2028లో ఈ SUVని తీసుకురావచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే భారత మార్కెట్ విడుదలపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Follow Us