AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750 వచ్చేసింది.. ధర, అదిరిపోయే ఫీచర్లు ఇవే !

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) బైక్ ప్రియుల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలో గోవాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక మోటోవర్స్ (Motoverse) ఈవెంట్‌లో కొత్త హిమాలయన్ 750 (Himalayan 750) బైక్‌ను గ్రాండ్‌గా ఆవిష్కరించింది. ఈ బైక్ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర, బుకింగ్స్ వివరాలు తెలుసుకుందాం..

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750 వచ్చేసింది.. ధర, అదిరిపోయే ఫీచర్లు ఇవే !
Royal Enfield Himalayan 750
Korivi Jayakumar
|

Updated on: Nov 28, 2026 | 5:57 PM

Share

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) బైక్ ప్రియుల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. క్లాసిక్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, లాంగ్ రైడ్‌లకు అనువైన బైక్‌లతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా అడ్వెంచర్ టూరింగ్ విభాగంలో ఈ కంపెనీకి చెందిన హిమాలయన్ సిరీస్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ క్రమంలో తమ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తూ మరో శక్తివంతమైన బైక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గోవాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక మోటోవర్స్ (Motoverse) ఈవెంట్‌లో తమ తొలి 750 సీసీ బైక్‌ను గ్రాండ్‌గా ఆవిష్కరించింది. పవర్ ఫుల్ ఇంజిన్, అధునాతన రైడింగ్ టెక్నాలజీ, ప్రీమియం హార్డ్‌వేర్‌తో తీసుకొచ్చిన ఈ బైక్ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర, బుకింగ్స్ వివరాలు తెలుసుకుందాం..

హిమాలయన్ 750 ధర, వేరియంట్లు..

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ తొలి 750 సీసీ బైకుగా “హిమాలయన్ 750” ని అనౌన్స్ చేసింది. ఈ బైక్ పరిచయ ధర రూ.4,89,490 (ఎక్స్‌షోరూమ్ చెన్నై) నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ.6.29 లక్షల వరకు ఉందని చెబుతున్నారు. ఇందులో మూడు ప్రధాన వేరియంట్లు అందుబాటులో ఉన్నట్టు వెల్లడించారు. బేస్ వేరియంట్‌లో కాస్ట్ అల్లాయ్ వీల్స్‌తో పాటు ఆజ్టెక్ గ్రీన్, టెక్టోనిక్ బ్లాక్ రంగులు లభిస్తాయని స్పష్టం చేస్తున్నారు. అలానే మిడ్ వేరియంట్‌లో ట్యూబ్‌లెస్ స్పోక్డ్ వీల్స్‌తో వైకింగ్ బ్రాంజ్, సైబీరియా వైట్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. టాప్ వేరియంట్ అంటార్కిటిక్ సిల్వర్ రంగులో లభిస్తుంది. ఇందులో ప్రత్యేకమైన GIVI టూరింగ్ లగేజ్ కిట్‌ను అందిస్తున్నారు.

హిమాలయన్ 750 ఫీచర్స్..

శక్తివంతమైన 743 సీసీ ఇంజిన్ :

ఈ బైక్‌లో కొత్త 743 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 5,000 ఆర్‌పీఎం వద్ద 54 బీహెచ్‌పీ గరిష్ట పవర్, 63 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. అలాగే స్లిప్ అసిస్ట్ క్లచ్‌ను అందించారు. లాంగ్ రైడింగ్‌తో పాటు అడ్వెంచర్ ప్రయాణాల్లోనూ మెరుగైన పనితీరు అందించేలా ఈ ఇంజిన్‌ను రూపొందించారు.

అధునాతన సేఫ్టీ ఫీచర్లు :

హిమాలయన్ 750లో 6-యాక్సిస్ ఇనర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్ (IMU) టెక్నాలజీని అందించారు. దీని ద్వారా కార్నరింగ్ ABS, లీన్ సెన్సిటివ్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు పనిచేస్తాయి. రైడర్ల అవసరాలకు అనుగుణంగా ఐదు రైడింగ్ మోడ్లు, క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉన్నాయి. దీంతో సుదీర్ఘ ప్రయాణాల్లో రైడింగ్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

సస్పెన్షన్, బ్రేకింగ్, హార్డ్‌వేర్ :

ఈ బైక్ ముందు భాగంలో అడ్జస్టబుల్ 43mm షోవా (Showa) USD ఫోర్క్స్, వెనుకవైపు షోవా IFP మోనోషాక్ సస్పెన్షన్‌ను అందించారు. మెరుగైన బ్రేకింగ్ కోసం డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. ముందు 19 అంగుళాలు, వెనుక 17 అంగుళాల వీల్స్ అమర్చారు. బైక్ కర్బ్ వెయిట్ 224 కేజీలు కాగా, 205mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. సీట్ హైట్ 815mmగా ఉంది. 17.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సుదీర్ఘ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

TFT డిస్‌ప్లే, నేవిగేషన్, TPMS :

టెక్నాలజీ పరంగానూ హిమాలయన్ 750లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో నేవిగేషన్ సపోర్ట్‌తో కూడిన 4 అంగుళాల సర్క్యులర్ TFT డిస్‌ప్లేను అందించారు. దీనితో పాటు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) కూడా ఉంది. ప్రయాణ సమయంలో టైర్లలో గాలి ఒత్తిడిని పర్యవేక్షించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

బుకింగ్స్ ఎప్పటి నుంచి..?

హిమాలయన్ 750 బుకింగ్స్ దేశవ్యాప్తంగా డిసెంబర్ 1, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో బుకింగ్ చేసుకోవచ్చు. గోవాలోని మోటోవర్స్ ఈవెంట్‌కు హాజరయ్యే రైడర్లకు నవంబర్ 28, 29 తేదీల్లోనే ఆన్‌సైట్ బుకింగ్ సదుపాయం కల్పించారు. నగరాన్ని బట్టి ధరలు, డెలివరీ సమయాల్లో మార్పులు ఉండవచ్చు.

టూరింగ్ ప్రియుల కోసం ప్రత్యేక యాక్సెసరీస్.. 

లాంగ్ రైడింగ్‌ను దృష్టిలో ఉంచుకుని హిమాలయన్ 750లో టూరింగ్ యాక్సెసరీలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా టాప్ వేరియంట్‌లో GIVI లగేజ్ కిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. లగేజ్ ప్యానియర్లను అమర్చుకునేందుకు ప్రత్యేక మౌంట్స్ ఉన్నాయి. హార్డ్, సాఫ్ట్ లగేజ్ ఆప్షన్లతో పాటు క్రాష్ ప్రొటెక్షన్, టైర్ రిపేర్ టూల్స్ వంటి యాక్సెసరీలను కూడా రైడర్లు తమ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు.

Follow Us