Covid Vaccine: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. పలు దేశాల్లో సెకండ్ వేవ్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుండగా..అమెరికా, బ్రిటన్ వంట దేశాలను థర్డ్ వేవ్ భయాలు వెంటాడుతున్నాయి. దేశ పౌరులందరికీ టీకాలు వేయిస్తే తప్ప కరోనాను కట్టడి చేయడం సాధ్యంకాదని వైద్య నిపుణులు ఆయా దేశాలను హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా డెల్టా వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉండే దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అయితే కొందరు టీకాలపై అపనమ్మకాలు, అపోహల కారణంగా ఇప్పటికీ టీకాలు తీసుకునేందుకు ముందుకురావడం లేదు. దీంతో వారు టీకాలు తీసుకునేలా ప్రోత్సహించేందుకు చాలా దేశాలు వెరైటీ బహుమతులు కూడా ప్రకటించాయి. అయినా ముందుకురాని కొందరి విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు పలు దేశాలు సన్నద్ధమయ్యాయి. తాజాగా తమ దేశ పౌరులకు కొవిడ్ టీకాను తప్పనిసరి చేయాలని ఫిజి దేశ ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ టీకాలు తీసుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించే వారి పట్ల కఠినంగా వ్యవహరించనుంది. ‘నో జబ్..నో జాబ్‘ అంటూ ఫిజి ప్రధాని ఫ్రాంక్ బైనిమారామా ఈ తీవ్ర హెచ్చరికలు చేశారు. మాస్క్, భౌతిక దూరం నిబంధనలను దేశ ప్రజలు ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
డెల్టా వేరియంట్ భయాల నేపథ్యంలో కొవిడ్ టీకాలు తీసుకోకుంటే ఉద్యోగాలు ఊడిపోతాయని ఫిజి ప్రధాని హెచ్చరించారు. ఆగస్టు 15నాటికి మొదటి డోస్ టీకా వేసుకోని ప్రభుత్వ ఉద్యోగులంతా సెలవులపై వెళ్లాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. నవంబరు ఒకటికల్లా వారు రెండో డోస్ వేయించుకోని పక్షంలో ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. ప్రైవేటు ఉద్యోగులు ఆగస్టు ఒకటినాటికల్లా మొదటి డోస్ వేయించుకోని పక్షంలో భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. టీకాల విషయంలో నిబంధనలు ఉల్లంఘించే కంపెనీలను మూసివేయిస్తామని హెచ్చరించారు.
9.30 లక్షల మంది జనాభా కలిగిన దక్షిణ పసిఫిక్ దేశమైన ఫిజిలో ఇప్పటి వరకు 3.40 లక్షల మంది జనం మాత్రమే టీకాలు తీసుకున్నారు. మిగిలిన వాళ్లు టీకాలు తీసుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. టీకాలు తీసుకోలేదన్న కారణంతో ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఫిజి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా…మరికొందరు ఇది నియంతృత్వ పోకడగా అభివర్ణిస్తూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
Also Read..
సర్వాంగ సుందరంగా హనుమంతుడి ఆలయ నిర్మాణం.. 17 ఏళ్ల కలను నెరవేర్చుకున్న అర్జున్