చనిపోయినట్లు నటించి శత్రువులను బురిడీ కొట్టిస్తాయి.. ఈ జంతువుల ట్రిక్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..
అడవి అంటేనే ఆకలి వేట.. ప్రాణం కాపాడుకోవడానికి చేసే నిరంతర పోరాటం.. కొన్ని జంతువులు ప్రాణాలు కాపాడుకోవడానికి వేగంగా పరిగెత్తితే, మరికొన్ని భీకరంగా పోరాడుతాయి. కానీ ప్రకృతిలో కొన్ని తెలివైన జీవులు ఉన్నాయి. అవి శత్రువు ఎదురైనప్పుడు యుద్ధం చేయవు.. కనీసం పారిపోవు కూడా.. ఆస్కార్ స్థాయి నటనతో చనిపోయినట్లు నటించి శత్రువులనే బురిడీ కొట్టిస్తాయి.

అడవి అంటేనే మనుగడ కోసం సాగే పోరాటం. వేటాడే జంతువుల నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక్కో జీవి ఒక్కో రకమైన విద్యను ప్రదర్శిస్తుంది. కొన్ని వేగంగా పరిగెత్తితే, మరికొన్ని దాక్కుంటాయి. కానీ కొన్ని జంతువులు మాత్రం అద్భుతమైన నటనతో శత్రువులనే మోసం చేస్తాయి. అవి బెదిరింపులకు గురైనప్పుడు చనిపోయినట్లు నటించి ప్రాణాలు కాపాడుకుంటాయి. ఈ వింత రక్షణ యంత్రాంగాన్ని థానాటోసిస్ అని పిలుస్తారు. ప్రకృతిలో ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసే కొన్ని జీవుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒపోసమ్: నటనలో ఆస్కార్ లెవల్
కంగారూ కుటుంబానికి చెందిన ఒపోసమ్ చనిపోయినట్లు నటించడంలో ప్రపంచ ప్రసిద్ధి చెందింది. శత్రువును చూడగానే ఇది నేలపై పడిపోతుంది. నోరు తెరిచి, కళ్ళు స్థిరంగా ఉంచి అచ్చం శవంలా మారిపోతుంది. అంతేకాదు తన శరీరం నుండి ఒక రకమైన దుర్వాసనను వెదజల్లుతుంది. దీనివల్ల వేటాడే జంతువు అది కుళ్లిపోయిన శవం అని భావించి అసహ్యంతో వదిలేసి వెళ్ళిపోతుంది.
తూర్పు హాగ్నోస్ పాము
పాము అంటేనే అందరూ భయపడతారు. కానీ ఈ తూర్పు హాగ్నోస్ పాము మాత్రం శత్రువు ఎదురైనప్పుడు తానే భయపడి చనిపోయినట్లు నటిస్తుంది. తన వెల్లకిలా పడుకుని, నాలుకను బయటకు పెట్టి కదలకుండా ఉంటుంది. వేటాడే జంతువు అక్కడి నుంచి వెళ్లిపోయే వరకు ఇది శ్వాస కూడా తీసుకోకుండా అచ్చం బొమ్మలా పడి ఉంటుంది.
లివింగ్‌స్టన్ సిచ్లిడ్: వేట కోసమే ఈ వేషం
మిగిలిన జంతువులు ప్రాణాలు కాపాడుకోవడానికి చనిపోయినట్లు నటిస్తే.. ఈ చేప మాత్రం తన ఆహారాన్ని వేటాడేందుకు ఈ ట్రిక్ వాడుతుంది. ఇది సరస్సు అడుగున కదలకుండా పడి ఉంటుంది. దీన్ని చూసి ఏదో చనిపోయిన చేప అని భావించి చిన్న చిన్న చేపలు దీని దగ్గరకు వస్తాయి. అంతే! అప్పటి వరకు కదలకుండా ఉన్న ఈ చేప అకస్మాత్తుగా దాడి చేసి వాటిని మింగేస్తుంది.
బాతులు: అదును చూసి ఎగిరిపోతాయి..
కొన్ని జాతుల బాతులు ప్రమాదం ఎదురైనప్పుడు తమ శరీరాన్ని గట్టిగా బిగదీసుకుని చనిపోయినట్లు పడి ఉంటాయి. శత్రువు తనపై ఆసక్తి కోల్పోయి అప్రమత్తంగా లేని సమయం చూసి, ఇవి ఒక్కసారిగా రెక్కలు విప్పి ఆకాశంలోకి ఎగిరిపోతాయి.
ఫైర్-బెల్లీడ్ టోడ్స్: రంగులతో హెచ్చరిక
ఈ కప్పలు బెదిరింపులకు గురైనప్పుడు తమ పొట్టను పైకి తిప్పి కదలకుండా పడుకుంటాయి. వీటి పొట్టపై ఉండే ప్రకాశవంతమైన రంగులు “నేను విషపూరితమైన జీవిని, నన్ను తింటే చస్తారు” అని వేటాడే జంతువులకు సంకేతాలు పంపుతాయి. ఈ రంగుల భయంతో శత్రువులు వీటి జోలికి వెళ్లవు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
