Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkey Revenge: విలన్‌గా మారిన కోతి.. రివేంజ్ తీర్చుకోవడానికి ఏకంగా 22 కిలోమీటర్లు ప్రయాణించింది..

Monkey Revenge: ఇప్పటి వరకు మనం పాములు మాత్రమే పగపడుతాయి.. వెంటాడి వెంటాడి పగ తీర్చుకుంటాయని భావిస్తూ వచ్చాం. మరికొన్ని సందర్భాల్లో పక్షులు పగబట్టిన ఘటనలు కూడా చూశాం.

Monkey Revenge: విలన్‌గా మారిన కోతి.. రివేంజ్ తీర్చుకోవడానికి ఏకంగా 22 కిలోమీటర్లు ప్రయాణించింది..
Monkey
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 25, 2021 | 1:03 PM

Monkey Revenge: ఇప్పటి వరకు మనం పాములు మాత్రమే పగపడుతాయి.. వెంటాడి వెంటాడి పగ తీర్చుకుంటాయని భావిస్తూ వచ్చాం. మరికొన్ని సందర్భాల్లో పక్షులు పగబట్టిన ఘటనలు కూడా చూశాం. మరి కోతి పగబట్టడం ఎప్పుడైనా చూశారా? కోతి పగబడితే ఏ రేంజ్‌లో హింస పెడుతుందో ఎవరికైనా తెలుసా?.. ఇక్కడ ఓ వ్యక్తిపై పగ పెంచుకున్న కోతి.. ఏకంగా 22 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. ఛలో.. ఇలా భయంకరమైన విలన్‌గా మారిన ఈ కోతి కథేంటి?.. కోతి పగ ఏంది.. ఎవరిని భయపెట్టింది.. అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కర్ణాటకలోని చిక్‌మగళూర్‌ జిల్లా కొట్టిగెహారా గ్రామానికి చెందిన జగదీష్ బిబి అనే వ్యక్తికి చుక్కలు చూపిస్తోంది ఓ కోతి. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అతనికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 22 కిలోమీటర్ల దూరంలో వదిలేసినా.. మళ్లీ వచ్చి కూర్చుంది. ఇలా భయంకరమైన విలన్‌గా మారి.. అతనికి ముచ్చెమటలు పట్టిస్తోంది. బోనెట్ మకాక్ జాతికి చెందిన మగ కోతి.. స్థానికంగా తిరుగుతూ మార్కెట్‌లో పండ్లను, దుకాణాల్లో స్నాక్స్ ప్యాకెట్లను ఎత్తుకెళ్తూ ఉండేది. కోతి సాధారణ స్వభావం అది అని జనాలు పెద్దగా పట్టించుకోలేదు. అయితే, దాని ప్రవర్తన రోజు రోజుకు హద్దులు మీరుతోంది. తాజాగా స్కూళ్లు తెరవగా.. ఆ కోతి స్కూల్ వద్దకు వెళ్లి విద్యార్థులను భయబ్రాంతులకు గురి చేసింది. దాంతో వారు హడలిపోయారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కోతిని బంధించాల్సిందిగా, లేదా వేరే ప్రాంతానికి తరిమేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వెంటనే రెస్పాండ్ అయిన అటవీశాఖ అధికారులు.. కోతిని తరిమేందుకు ప్లాన్ వేశారు.

సాధారణంగా కోతిని పట్టుకోవడం చిన్న విషయమేమీ కాదు. అటవీ శాఖ అధికారులను కూడా అది ముప్పుతిప్పలు పెట్టింది. దాంతో ఆ కోతిని తరిమివేయాలని వారు నిర్ణయించారు. ఇందులో భాగంగా స్థానిక సహాయ సహకారం తీసుకున్నారు. ఇంతలో.. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న డ్రైవర్ జగదీష్ కూడా అటవీశాఖ అధికారులకు సహాయం చేయబోయాడు. కోతిని తరిమేందుకు తాను కూడా ప్రయత్నించాడు. అయితే, అటవీశాఖ అధికారులతో విసిగిపోయిన కోతికి.. జగదీష్ చర్యలు మరింత చిర్రెత్తించాయి. ఆగ్రహంతో ఆ కోతి జగదీష్‌పైకి దూకింది. అతని చేయిని గట్టిగా కొరికింది. కోతి చర్యతో భయపడిపోయిన జగదీష్ దాని నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఆటో రిక్షాలో దాక్కోగా.. ఆ వాహనంపైనా దాడి చేసింది. ఆటో టాప్‌ని చించిపడేసింది. ఇలా అతను ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లి అటాక్ చేసింది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన జగదీష్‌ను మాత్రం వదిలిపెట్టలేదు. ఇంటికి వెళ్తే ఇంటికి.. బయటకు వెళితే బయట.. ఎక్కడ కనిపిస్తే అక్కడ అతనిపై దాడి చేసింది. దాని చర్యతో జగదీష్ హడలిపోయాడు.

చివరికి 30 మందికిపైగా వ్యక్తుల బృందం 3 గంటల పాటు శ్రమించి కోతిని బంధించారు. ఆ తరువాత అటవీశాఖ అధికారులు దానిని 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలూర్ అడవికి తీసుకెళ్లి అక్కడ వదిలేశారు. దాంతో కోతి కథ సమాప్తం అయిపోయిందని అందరూ భావించారు. సాధారణ దినచర్యను ప్రారంభించారు. ఇలా వారం రోజులు అక్కడి ప్రజలు హాయిగా గడిపారు. కానీ, ఇంతలో వారికి పిడుగు లాంటి దృశ్యం కనిపించింది. అటవిలో వదిలేసిన కోతి మళ్లీ ఆ ప్రాంతానికి వచ్చింది. అవును.. 22 కిలోమీటర్ల దూరంలో వదిలేసిన కోతి.. తిరిగి అదే ప్రాంతానికి చాలా తెలివిగా వచ్చింది. బలూరు అడవికి సమీపంలో ఉన్న రహదారి గుండా వెళ్తున్న ట్రక్కులో దూకిన కోతి.. నేరుగా కొట్టిగెహరకు చేరుకుంది. అది చూసి అక్కడి జనాలు భయబ్రాంతులకు గురయ్యారు.

ఇక ఈ వార్త విని జగదీష్‌కు కంటిమీద కునుకు లేకుండా పోయింది. కోతి దాడిని తలుచుకుంటూ వణికిపోయాడు. ‘‘కోతి మళ్లీ గ్రామంలోకి వచ్చిందని విన్నప్పుడు వెన్నులో వణుకు పుట్టింది. అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి వెంటనే రావాలని కోరాను. ఎంత దాక్కున్నా ఆ కోతి నుంచి తప్పించుకోలేను. ఆ కోతి నన్ను వదిలిపెట్టదు. నాపై పగ పట్టినట్లుంది. కోతి నాపై చేసిన దాడికి తలుచుకుంటేనే వణుకు పుడుతోంది. ఆ పిచ్చి కోతి నేను ఎక్కడికి వెళితే అక్కడి వచ్చింది. అది చేసిన గాయాలు మానడానికి ఒక నెల రోజులు పడుతుందని వైద్యులు చెప్పారు. కోతి దాడి వలన ఆటో కూడా నడపలేకపోతున్నారు. కోతి నన్ను అనుసరిస్తుందనే భయంతో ఇంటికి కూడా వెళ్లలేదు.’’ బాధిత జగదీష్ వాపోయాడు. కాగా, కోతి భయంతో ఇంటికే పరిమితమైన జగదీష్.. తాజా వార్తతో మరికొన్ని రోజులు ఇంటికే పరిమితం అవ్వాలని నిర్ణయించుకున్నాడు.

ఇదిలాఉంటే.. అటవీ శాఖ అధికారులు ఆ కోతిని రెండోసారి కూడా బంధించారు. ఈ సారి మరింత దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఆ కోతిని వదిలేశారు. విషయం తెలుసుకున్న జగదీష్.. ఆ కోతి మళ్లీ రాదని భావిస్తున్నాడు. మరి ఏం జరుగుతుందనేది కాలమే సమాధానం చెప్పాలి. ఇక, కోతి రివేంజ్‌పై అటవీ శాఖ అధికారులు స్పందించారు. ఆ కోతి.. జగదీష్‌నే ఎందుకు టార్గెట్ చేసిందో అర్థం కావడం లేదని ముదిగెరె రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ మోహన్ కుమార్ అన్నారు. ఇంతకు ముందు ఆ కోతికి ఏమైనా హానీ చేశాడా? లేక ఆత్మరక్షణ చర్యలో భాగంగా కోతి అతనిపై దాడి చేసిందా? అనేది తెలియదని న్నారు. అయితే, కోతిని తరిమేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో జగదీష్ తమకు సహకరించాడని ఆయన చెప్పుకొచ్చారు.

Also read:

Beauty Tips For Skin: మొటిమలు, మచ్చలు లేని ముఖారవిందం కావాలా? అయితే ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి..

Cyclone Effect on AP : ఉత్తర కోస్తాంధ్రకు తుపాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు.. అధికారుల వార్నింగ్..

IRCTC – Ramayan Yatra: రామ భక్తులకు గుడ్‌ న్యూస్‌.. శ్రీరామాయణ యాత్రకు స్పెషల్‌ ట్రైన్స్‌.. ఎప్పటినుంచంటే..!