Running Train: రన్నింగ్ ట్రైన్‌ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

విజయవాడలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రన్నింగ్ ట్రైన్ లో నుంచి ఓ మహిళ రాత్రి సమయంలో కాలువలోకి దూకేసింది. అనంతరం కాలువలోని నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ఓ చెట్టుకు చిక్కుకుంది. చెట్టు కొమ్మల సాయంతో ఆమె దాదాపు 10 గంటలపాటు నీళ్లలోనే నరకయాతన అనుభవించింది..

Running Train: రన్నింగ్ ట్రైన్‌ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Woman Jumped From A Running Train Into A Canal
Follow us

|

Updated on: Nov 04, 2024 | 10:00 AM

విజయవాడ, నవంబర్‌ 4: ఓ మహిళ రన్నింగ్‌ ట్రైన్‌లో నుంచి అమాంతం కింద ఉన్న కాలువలోకి దూకేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. అనంతరం ఆమె నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. కొంత దూరం వెళ్లాక ఓ చెట్టు కొమ్మ ఆసరాగా చేసుకుని దాదాపు 10 గంటలపాటు నీళ్లలోనే నానా తంటాలు పడింది. ఈ షాకింగ్‌ ఘటన విజయవాడలోని కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

బాపట్ల జిల్లా భట్టిప్రోలులో షేక్‌ ఖాదర్‌వలి కుటుంబంతో కలిసి నిజాంపట్నంలో నివాసం ఉంటున్నారు. ఆయన ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య జిన్న తున్నీసా (47) గత కొన్నేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతుంది. సుదీర్ఘకాలంగా మందులు వాడుతున్నప్పటికీ ఆమెలో గుణం కనిపించడం లేదు. మందుల ఖరీదు అధికంగా ఉండటంతో వాటిని వాడలేకపోతున్నానంటూ బాధపడుతూ ఉండేవారు. నిజానికి, జిన్న తున్నీసా మానసిక స్థితి కొద్ది గంటలు బాగానే ఉన్నా.. ఆ తర్వాత మళ్లీ కొద్ది గంటలలోపే పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేది. ఈ క్రమంలో ఆమె పలుమార్లు కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోతూ ఉండేది.

గతంలోనూ పలు మార్లు ఇలా ఇంటి నుంచి వెళ్లిపోవడంతో.. కుటుంబ సభ్యులు నానాతంటాలు పడి ఆమెను వెతికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఆమె మరోమారు కుటుంబ సభ్యులకు చెప్పకుండా శనివారం సాయంత్రం గుంటూరు జిల్లా నిడుబ్రోలులో విజయవాడ వైపుకు వెళ్తున్న రైలు ఎక్కేసింది. దీంతో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో రైలు విజయవాడ పూల మార్కెట్‌ పరిసరాలకు చేరుకోగానే.. ఆమె కదులుతున్న రైలు నుంచి కిందనున్న బందరు కాలువలోకి అమాంతం దూకేసింది. కాలువలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రాంతానికి కొట్టుకు వచ్చింది. అక్కడ ఓ చెట్టుకొమ్మను పట్టుకుని రాత్రంతా నీళ్లలోనే ఉండిపోయింది.

ఇవి కూడా చదవండి
Jinnah Tunisa

Jinnah Tunisa

సుమారు 10 గంటలపాటు నీళ్లను ఉన్న ఆమెను సోమవారం తెల్లవారు జామున స్థానికులు గమనించి కృష్ణలంక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించి బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో మహిళ స్వల్పంగా గాయపడింది. గుర్తించిన పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మతి స్థిమితంలేని మహిళ కదులుతున్న రైలు నుంచి కాలువలోకి దూకిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.