
సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వింతలు, విశేషాలు వైరల్ అవుతుంటాయి. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక నిజమైన ఘటన మాత్రం నెటిజన్లను షాక్‌కు గురిచేస్తుంది. సరదాగా తన కుటుంబ చరిత్ర తెలుసుకుందామని ఓ వ్యక్తి చేసిన డీఎన్ఏ పరీక్ష.. ఆయన వైవాహిక జీవితంలో ఊహించని తుఫాను రేపింది. ఏడేళ్లుగా ఎంతో అన్యోన్యంగా సంసారం చేస్తూ, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తన భార్య.. వరుసకు చెల్లెలు అని తేలడంతో ఆయన కాళ్ల కింద నేలకదిలింది. బోర్డ్ పాండా నివేదిక ప్రకారం.. టిక్‌టాక్‌లో @toothlessandruthless పేరుతో కంటెంట్ క్రియేట్ చేసే ఒక వ్యక్తి, తన భార్యతో కలిసి తమ పూర్వీకుల వివరాలు తెలుసుకోవాలనుకున్నారు. దీనికోసం ఇద్దరూ డీఎన్ఏ పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్ట్స్ రాగానే చూసుకున్న ఆ దంపతులకు తీవ్ర షాక్ తగిలింది. వారిద్దరి మధ్య అత్యంత దగ్గరి రక్తసంబంధం ఉందనే విషయం బయటపడింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. పెళ్లికి ముందు ఈ విషయమై దంపతులకు కానీ, వారి కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి సమాచారం లేదు.
ఇంత పెద్ద కుటుంబ రహస్యం ఎవరికీ ఎలా తెలియకుండా పోయిందనే అనుమానం చాలామందికి రావచ్చు. దీనిపై ఆ క్రియేటర్ స్పందిస్తూ.. తమ కుటుంబ వృక్షంలో చాలా కాలం క్రితం విడిపోయిన ఒక కుటుంబానికి సంబంధించిన వివరాలివి అని తెలిపాడు. అతడి నానమ్మ, భార్య వైపు అమ్మమ్మ ఇద్దరూ సొంత అక్కాచెల్లెళ్లు. కాలక్రమేణా ఆ రెండు కుటుంబాల మధ్య సంబంధాలు తెగిపోవడంతో ఈ బంధం గురించి ఎవరికీ తెలీకుండా పోయింది.
ఈ చేదు నిజం తెలిసినప్పటి నుంచి ఆ వ్యక్తి తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. ‘‘నేను నా సొంత కజిన్‌ను పెళ్లి చేసుకున్నానని తెలిసాక ఏం చేయాలో పాలుపోవడం లేదు. మేము విడాకులు తీసుకోవాలా? మా ఇద్దరి పిల్లల భవిష్యత్తు ఏంటి?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశాడు. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవ్వడమే కాక, కోట్లాది మంది దృష్టిని ఆకర్షించింది.
ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్య నిపుణులు – కొందరు నెటిజన్ల అభిప్రాయం ప్రకారం.. దగ్గరి సంబంధాల్లో పెళ్లిళ్లు జరగడం వల్ల పుట్టే పిల్లల్లో థలసేమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి జన్యుపరమైన లోపాలు లేదా వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వెంటనే పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, దంపతులు జెనెటిక్ కౌన్సెలర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. మరికొందరు ఇప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి ప్రశాంతంగా జీవించాలని.. అనవసరంగా భయపడి సంసారాన్ని కూల్చుకోవద్దని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ విచిత్ర సంఘటన నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.