ఆడ తోడు కోసం మూడు సముద్రాలు దాటిన తిమింగలం..! సరికొత్త రికార్డ్ అంటున్న శాస్త్రవేత్తలు..
అలా సాగిన తిమింగలం ప్రయాణంలో.. కనీసం 13,046 కి.మీ ప్రయాణించి ఉంటుందని, దానికి 19 వేల కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉందని పరిశోధక బృందం తెలిపింది. అయితే, ఈ తిమింగలం వలస ప్రయాణం..
తిమింగలం.. ఈ పేరు వినగానే.. అందరినీ టక్కున గుర్తొచ్చేది వాటి భారీ ఆకారం…నిజంగా వాటి ఆకారం చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. కానీ, తిమింగలాలకు సంబంధించి తరచూ సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. మనుషులతో తిమింగలాలు కలిసి ఉండే తీరుకు మనం ఫిదా అవుతుంటాం. ఎందుకంటే అవి మనుషులతో ఎంతో ప్రేమగా వ్యవహరిస్తుంటాయి. అవి మనతో మాట్లాడతాయి. ఒక్కొసారి అవి బాధపడతాయి. అంతేకాదు..పిల్లలకు పాలిచ్చి పెంచుతాయి. అచ్చం మనుషుల్లానే ప్రేమకోసం వెతికే తిమింగలం తన ఆడ తోడు కోసం ఏకంగా మూడు సముద్రాలు దాటి ప్రయాణం చేసింది..ఈ రికార్డ్ స్థాయి వలస ప్రయాణాన్ని బజారుటో సెంటర్ ఫర్ సైంటిఫిక్ స్డడీస్ అధ్యయనం ద్వారా వెల్లడైంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఈ అధ్యయనం వివరాలు రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ తిమింగలం చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని ఏఐ అల్గారిథం సాయంతో ఫొటో రికార్డింగ్ చేసి వివరాలు వెల్లడించారు. ఇక్కడ మగ తిమింగలం తగిన తోడు కోసం వెతుక్కుంటూ మూడు సముద్రాలు దాటి 19 వేల కిలోమీటర్లు ప్రయాణించినట్టుగా గుర్తించారు.. కొలంబియాలోని గల్ఫ్ ఆఫ్ ట్రిబుగా నుంచి ఈ తిమింగలం వలస ప్రయాణం ప్రారంభించింది. ఆ తర్వాత దీన్ని టాంజానియాలోని జాంజిబార్ తీరంలో గుర్తించారు పరిశోధకులు. అలా సాగిన తిమింగలం ప్రయాణంలో.. కనీసం 13,046 కి.మీ ప్రయాణించి ఉంటుందని, దానికి 19 వేల కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉందని పరిశోధక బృందం తెలిపింది.
అయితే, ఈ తిమింగలం వలస ప్రయాణం చేయడానికి గల నిర్దిష్ట కారణాలపై శాస్త్రవేత్తలు పరిశోధన సాగిస్తున్నారు. పర్యావరణ మార్పులు, తోడు కోసం అనుసరించే వ్యూహాల్లో మార్పులు లేదా వనరుల మీద ఆధిపత్యం కోసం ఈ తిమింగలం సుదూర ప్రయాణం సాగి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..