Viral: కలలో కనిపించి భార్యను చంపేయాలన్న అజ్ఞాత వ్యక్తి.. చివరికి భర్త ఏం చేశాడంటే.?
మనందరికీ కలలు రావడం సర్వసాధారణం. అయితే ఈ కలలను కొందరు నమ్మరు. మరికొందరు నమ్ముతారు. ఇక నమ్మే వ్యక్తులు..
మనందరికీ కలలు రావడం సర్వసాధారణం. అయితే ఈ కలలను కొందరు నమ్మరు. మరికొందరు నమ్ముతారు. ఇక నమ్మే వ్యక్తులు.. తమ కలలో చోటు చేసుకున్న సంఘటనలు, ప్రాంతాలు మొదలైనవి.. నిజజీవితంలో కూడా జరగవచ్చునని అనుకుంటారు. సరిగ్గా ఇలాగే ఊహించాడు ఓ వ్యక్తి కలలో కనిపించింది.. నిజమవుతుందేమోనని భయపడిన అతడు.. ఏకంగా చేయకూడదని పని చేశాడు. ఇంతకీ అసలేం జరిగింది.? ఆ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
జార్ఖండ్‌లోని హుమ్తా పంచాయితీ గిరిదిహ్ గ్రామానికి చెందిన పుష్వా ముండా అనే వ్యక్తికి.. 2012లో సోన్మతీదేవీ అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. పెళ్ళైన దగ్గర నుంచి భార్యభర్తల మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. అంతా బాగానే ఉంది. అయితే ఓ రోజు రాత్రి పుష్వాకు ఒక కల వచ్చింది. కలలో ఎవరో అజ్ఞాత వ్యక్తి కనిపించి.. ‘నువ్వు నీ భార్యను చంపేసేయ్.. లేదంటే ఆమె నిన్ను చంపేస్తుంది’ అని అన్నాడు. అంతే! పుష్వాకు ఠక్కున మెలుకవ వచ్చేసింది. ఏంటి.! ఈ పీడకల.. నిజంగా ఇది జరుగుతుందా.? తన భార్య తనను చంపేస్తుందా.? అని అనుకుంటుంటే పుష్వాకు ఒళ్లంతా చెమటలు పట్టేశాయి.
అలా భయపడుతూనే పక్కనే నిద్రిస్తున్న భార్య గొంతు పట్టుకుని నులిమాడు. ఉన్నట్టుండి తన గొంతు నులుముతున్నది ఎవరో అన్నది ఆమెకు అర్ధం కాక.. మెలుకవ తెచ్చుకుంటుంది. తన భర్తే అని తెలిసి.. అరుస్తూ.. అతడి పట్టు నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక తల్లి అరుస్తుండటంతో.. నిద్రపోతున్న ముగ్గురు పిల్లలకు మెలుకవ వస్తుంది. తండ్రి చేస్తున్న పనిని చూసి భయపడుతూ తలుపులు తీసిని బయటికి వెళ్తారు. వారి ఏడుపులకు ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుంటారు. అసలు విషయం తెలుసుకుని.. పిల్లలతో వారి ఇంటికి వెళ్లగా.. తలుపులు వేసి ఉంటాయి. వారందరూ కూడా తలుపులు బద్దలుకొట్టి చూడగా.. పుష్వా భార్య మృతదేహంపై కూర్చుని ఉండటాన్ని చూసి భయభ్రాంతులకు గురవుతారు. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందిస్తారు. తనకు కల వచ్చిందని.. తన భార్యను చంపకపోతే.. తాను ఎక్కడ చనిపోతానోనని భయపడి చంపినట్లు పుష్వా పోలీసులకు అసలు నిజాన్ని చెబుతాడు. కాగా, పోలీసులు పుష్వాను అదుపులోకి తీసుకుని.. అతడిపై కేసు నమోదు చేశారు. మరోవైపు అటు తల్లి మరణం.. ఇటు తండ్రి జైలుపాలు కావడంతో.. ముగ్గురు పిల్లలు అనాధలు అయిపోయారు.