దోమలు మిమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయో తెలుసా?, మీలో వాటిని ఆకర్షించే అంశాలివే
అందరూ గుంపుగా ఉన్నప్పటికీ దోమలు మాత్రం ఒక్కరిద్దరినీ మాత్రమే టార్గెట్ చేసి మరీ కుడుతుంటాయి. అందరినీ కాకుండా తమనే ఎందుకు టార్గెట్ చేసి కుడుతున్నాయనే సందేహం వారిలో కలుగక మానదు. దోమలు కొందరిని మాత్రమే కుట్టడానికి పలు ఫ్యాక్టర్లు కారణమవుతున్నాయి. వాటిలో కొన్ని శరీర వాసన, ఉష్ణోగ్రత, బ్లడ్ గ్రూప్స్ తదిరత అంశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు.

సాధారణంగా దోమలు అందర్నీ కుడుతాయి. కానీ, కొందరిని మాత్రం ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా వచ్చి కాటు వేస్తాయి. ఇంట్లో ఉన్న సమయంలోనో, బయట స్నేహితులతో ఉన్న సమయంలోనో దోమలు కాటువేస్తాయి. అయితే, చాలా మంది ఉన్నప్పటికీ దోమలు మాత్రం కొందరినే టార్గెట్ చేసినట్లు కుట్టేస్తుంటాయి. ఇది చాలా మంది అనుభవించే ఉంటారు. అరే ఇంతమంది ఉండగా నన్నే ఎందుకు దోమలు కుడుతున్నాయనే సందేహం రాక మానదు.
అయితే, దోమలు కొందరిని మాత్రమే కుట్టడానికి గల కారణాలపై శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేశారు. దోమలు ర్యాండమ్‌గా వచ్చి కుట్టవని ఎంటామాలజీ పరిశోధనలు చెబుతున్నాయన్నారు. దోమలు శరీరంపై వాలిన తర్వాత స్మెల్ చేస్తాయని, కుట్టేందుకు అనుకూలంగా ఉందా? లేదా? అని చూస్తాయని చెప్పారు. కుట్టేందుకు వీలుగా లేకపోతే వేరే శరీరాన్ని వెతుక్కుంటాయన్నారు.
కార్బన్ డైఆక్సైడ్, బాడీ హీట్ నోటీస్ చేసే దోమలు
ఒక వ్యక్తిని మాత్రమే టార్గెట్(మాస్కిటో మాగ్నెట్ ) చేసి దోమలు ఎందుకు కుడతాయనేదానికి చాలా కారణాలుంటాయని వివరించారు. దోమలు చాలా రకాలుగా ప్రయత్నించిన తర్వాతనే కుట్టేందుకు సిద్ధమవుతాయని వివరించారు. మొదట చుట్టూ తిరుగుతూ కుట్టేందుకు వీలైన ప్రాంతాన్ని ఎంచుకున్న తర్వాత దగ్గరికి వచ్చి కుడతాయన్నారు. మనిషి నుంచి వెలువడే కార్బన్‌డైఆక్సైడ్‌ను దోమలు గుర్తిస్తాయన్నారు. కార్బన్‌డైఆక్సైడ్‌ను ఎక్కువగా విడుదల చేసేవారి పట్ల దోమలు ఆకర్షితమవుతాయని వెల్లడించారు.
భారీ కాయులు, గర్భిణిల నుంచి ఎక్కువగా కార్బన్‌డైఆక్సైడ్ వెలువడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇక, వేసుకునే బట్టలను బట్టి కూడా దోమలు కుట్టేందుకు ప్రయత్నిస్తాయని అన్నారు. డార్క్ కలర్ దుస్తులు ధరించే వారి పట్ల దోమలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయని.. లైట్ కలర్స్ దోమలను అంతగా ఆకర్షించలేవన్నారు. ఎక్కువ ఉష్ణోగ్రతలు(హీట్ బాడీస్) కలిగిన వ్యక్తులను కూడా దోమలు టార్గెట్ చేస్తాయన్నారు. మద్యం సేవించేవారు, వ్యాయామం చేసినవారు, గర్భిణీలలో శరీర వాతావరణం, మెటబాలిజం, స్కిన్ కెమెస్ట్రీలో మార్పులుంటాయి. అందుకే వీరిని దోమలు ఎక్కువగా కుడుతాయన్నారు.
బ్లడ్ గ్రూప్స్, అంటిజెన్స్
వ్యక్తుల బ్లడ్ గ్రూప్, అంటిజెన్స్ కూడా దోమలు కుట్టేందుకు కారణమవుతాయని శాస్త్రవేత్తలు తేల్చారు. రెడ్ బ్లడ్ సెల్స్‌లో ఉండే ప్రొటీన్స్ ఆకర్షిస్తాయన్నారు. ఎ, బి, ఎబి, లేదా ఓ బ్లడ్ గ్రూపుల్లో భిన్నమైన అంటిజెన్స్ కలిగి ఉంటాయన్నారు. చెమట, సెలైవా, కన్నీరు లాంటి వాటిని గుర్తిస్తాయన్నారు. ఎ, బి, ఓ బ్లడ్ గ్రూపుల వ్యక్తులను దోమలు ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం ఉందన్నారు. వీటిలో ఎక్కువగా ఒ గ్రూప్ దోమలను ఎక్కువగా ఆకర్షిస్తుందన్నారు. బ్లడ్ గ్రూప్ కంటే కూడా శరీర వాసన కూడా ఎక్కువ ప్రభావం చూపుతుందని ఫార్మాసూటికల్ కంపెనీ ఫైజర్ పేర్కొంది.