Mud-puddling: మడ్ పడ్లింగ్ చేస్తోన్న సీతాకోకచిలుకలు.. దీన్ని చూడండి అచ్చం ఆకులాగే ఉంది..
సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చిరు జల్లులు, పిల్ల కాలవలతో పాటు పచ్చదనం వెల్లివిరుస్తుంది. వీటన్నింటికి మించి మన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే....
సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చిరు జల్లులు, పిల్ల కాలవలతో పాటు పచ్చదనం వెల్లివిరుస్తుంది. వీటన్నింటికి మించి మన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే రంగురంగుల సీతాకోక చిలుకలు కనువిందు చేస్తుంటాయి. ఈ భూమి మీద ఉండే రకరకాల కీటకాల్లో అత్యంత అందమైనవి సీతాకోక చిలుకలు మాత్రమే. సహజంగా సీతాకోక చిలుకలు బురద, నీరు వంటి వాటి నుంచి తమకు కావలసిన లవణాలను తీసుకోవడానికి గుంపు గుంపులుగా చేరుతుంటాయి..ఈ ప్రవర్తనను మడ్ పడ్లింగ్ అంటారు. మగ సీతాకోక చిలుకలు మాత్రమే ఇలా ప్రవర్తిస్తాయి. మగవి, ఆడవాటిని ఆకర్షించేందుకు బురద, నీటి నుంచి లవణాలు, ఫెరోమోన్స్‌ను సేకరిస్తాయి. తాజాగా నలుపు రంగు రెక్కలతో ఉన్న కొన్ని సీతాకోకచిలుకలు మడ్ పడ్లింగ్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను ప్రవీణ్ కాశ్వన్ అనే ఫారెస్ట్ ఆఫీసర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. సీతాకోక చిలుకల ఈ అరుదైన విన్యాసాన్ని చూసిన నెటిజన్లు చాలా అద్భుతంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.
Mud puddling. A behaviour where butterflies congregate around mud, dung, water etc to suck up the required fluids & salt. The music of forest is additional here. Field visit. pic.twitter.com/iNADK6gL5f
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 17, 2021
ఇదిలావుంటే ఎండిన ఆకులాగా కనిపిస్తున్న మరో సీతాకోకచిలుకకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇది అచ్చు చూడ్డానికి ఎండిపోయిన ఆకులాగా కనిపిస్తుండటంతో నెటిజన్లకు తెగ నచ్చేసింది. అది నేలపై వాలినప్పుడు ఆకులాగా కనిపిస్తూ.. గాలిలో ఎగురుతున్నప్పుడు సీతాకోకచిలుకలా కనిపిస్తుంది. తనను చంపి తినేందుకు ఏ పక్షి అయినా వెంటపడితే… ఆ సీతాకోక చిలుక వెంటనే నేలపై వాలి ఆకులా మారిపోయి… శత్రువు నుంచి క్షణాల్లో తప్పించుకోగలదు. ఈ వీడియో చూసిన వారంతా మళ్లీ మళ్లీ చూస్తూ నెట్టింట్లో కామెంట్లు, లైక్‌లతో రచ్చరచ్చ చేస్తున్నారు. అయితే ఈ సీతాకోకచిలుక కల్లిమా ఇనాకస్ జాతికి చెందిన బటర్‌ఫ్లై అని సమాచారం. దీన్నే ఇండియన్ ఓక్ లీఫ్ బటర్‌ఫ్లై లేదా డెడ్ లీఫ్ అని కూడా పిలుస్తారట. కాలాన్ని బట్టీ ఈ సీతాకోక చిలుకలు తమ రంగును మార్చుకుంటాయట.
మరోవైపు విశాఖ మన్యంలోని చింతపల్లిలో ఓ భారీ సీతాకోక చిలుక కనువిందు చేస్తోంది. ఇది రెక్కలు విచ్చుకున్నప్పుడు 24 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉండటంతో పాటు.. విభిన్నమైన రంగులతో కనిపిస్తూ చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా దీని రెక్కల చివరలు పాము తల ఆకారంలో ఉన్నాయి. దీన్ని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త దృష్టికి తీసుకెళ్లగా.. సీతాకోక చిలుకల సంతతికి చెందినదే అయినా దీన్ని ‘అట్లాస్ మోత్’ అని పిలుస్తారని వారు చెప్పారు. ఇది పక్షి అంత పరిమాణంలో పెరుగుతుందని, దాని ఆకారం చాలా పెద్దగా ఉన్నప్పటికీ.. దీనికి నోరు ఉండదన్నారు. ఆహారం తీసుకోకుండా బతుకుతుందని తెలిపారు.
Also Read: పోలీస్ కుటుంబాలనూ వదలని సైబర్ కంత్రీగాళ్లు.. తాజాగా సీఐ భార్యను ఎలా మాయ చేశారంటే