AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టిన 28 రోజులకే స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. జెరోధా చరిత్రలోనే అతి చిన్న ఇన్వెస్టర్!

పెట్టుబడులు పెట్టాలంటే ఉద్యోగం రావాలి.. చేతిలో డబ్బులు ఉండాలి.. ఆర్థిక విషయాలపై అవగాహన ఉండాలి అనుకుంటాం. కానీ ఇప్పుడు ఓ బుజ్జాయి మాత్రం పుట్టిన నెల రోజుల్లోపే ఇన్వెస్టర్‌గా మారిపోయాడు. ఇంకా సరిగ్గా కళ్లు తెరిచి ప్రపంచాన్ని చూడని ఆ చిన్నారి.. స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టాడు. ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా లో ఖాతా తెరిచి పెట్టుబడి పెట్టిన ఈ బేబీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఇంతకీ ఆ చిన్నారి వయసెంతో తెలుసా? కేవలం 28 రోజులు మాత్రమే!

పుట్టిన 28 రోజులకే స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. జెరోధా చరిత్రలోనే అతి చిన్న ఇన్వెస్టర్!
Baby Investor Becomes Nithin Kamath Zerodha Youngest Customer
Sharada V
|

Updated on: Oct 10, 2026 | 9:48 PM

Share

తమ ప్లాట్‌ఫామ్‌లో అతి చిన్న వయసున్న కస్టమర్ ప్రస్తుతం కేవలం 28 రోజుల పసికందు అని జెరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆ చిన్నారి తల్లిదండ్రులు మైనర్ అకౌంట్ తెరిచి, ఖాతా ప్రారంభించిన వారం రోజుల్లోనే తొలి పెట్టుబడి కూడా పెట్టారని చెప్పారు. ఈ వార్త విని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా పిల్లలు పెద్దయ్యాక చదువు, ఉద్యోగం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కానీ ఈ చిన్నారి తల్లిదండ్రులు మాత్రం అప్పుడే తమ బిడ్డ భవిష్యత్తు కోసం పెట్టుబడుల ప్రయాణాన్ని ప్రారంభించారు.

ఏడాదిలోనే మారిపోయిన రికార్డు!

ఈ కథలో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. గత ఏడాది నితిన్ కామత్ ఇలాంటి విషయాన్నే వెల్లడించారు. అప్పట్లో జెరోధాలో అతి చిన్న వయసున్న ఖాతాదారుడి వయసు 64 రోజులు. ఇప్పుడు ఆ రికార్డు మరింత తగ్గి 28 రోజులకు చేరింది. పిల్లలు పుట్టినప్పటి నుంచే వారి భవిష్యత్తు కోసం పెట్టుబడులు ప్రారంభించాలనే ఆలోచన కొంతమంది తల్లిదండ్రుల్లో పెరుగుతోందని ఈ ఉదంతం సూచిస్తోంది.

18 ఏళ్లలోపు పిల్లల పేరుతో తెరిచే పెట్టుబడి ఖాతా మైనర్ అకౌంట్. తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు పిల్లల తరఫున ఈ ఖాతాను నిర్వహిస్తారు. పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. జెరోధాలో పిల్లల పేరుతో మైనర్ అకౌంట్ తెరవడానికి అవకాశం ఉంది. పిల్లలకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఖాతాను సాధారణ వ్యక్తిగత ఖాతాగా మార్చేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలి.

ఆధార్, పాన్ కార్డులు ఇంత త్వరగా ఎలా వచ్చాయి?

నితిన్ కామత్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో దాదాపు 10 లక్షల వ్యూస్ సంపాదించి చర్చకు దారితీసింది. ముఖ్యంగా 28 రోజుల పసికందుకు ఇంత త్వరగా ఆధార్, పాన్ కార్డులు ఎలా వచ్చాయనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేశారు. ‘ఈ రోజుల్లో ఏం జరుగుతోంది?’ అంటూ ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, పిల్లలకు కూడా ఆధార్, పాన్ కార్డులు పొందే అవకాశం ఉందని మరొకరు స్పందించారు. ఈ వార్తపై నెటిజన్లు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘ఆ చిన్నారి ఇప్పటికే 27 రోజుల కాంపౌండింగ్ ప్రయోజనాన్ని కోల్పోయాడు. తల్లిదండ్రులు ఇంకాస్త ముందే పెట్టుబడి పెట్టాల్సింది’ అంటూ ఒకరు చమత్కరించారు. మరో నెటిజన్ అయితే, ‘పిల్లల కోసం పెట్టుబడి పెట్టాలంటే పుట్టే వరకు ఎందుకు ఆగాలి? గర్భధారణ పరీక్ష పాజిటివ్ వచ్చినప్పుడే అకౌంట్ తెరవొచ్చా?’ అంటూ సరదాగా ప్రశ్నించారు. మొత్తానికి, పుట్టిన 28 రోజులకే పెట్టుబడి ఖాతా తెరిచి తొలి ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ఈ చిన్నారి వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పిల్లల భవిష్యత్తు కోసం ముందుగానే ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవాలనే ఆలోచనను ఈ ఘటన మరోసారి చర్చలోకి తెచ్చింది. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు వాటి రిస్కులు, నిబంధనలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం ముఖ్యం.

Follow Us